టిడిపి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు మూడురోజుల పాటు చిత్తూరు జిల్లాలో తిష్టేశారు. జిల్లాలోని 14అసెంబ్లీ, మూడు పార్లమెంటు నియోజకవర్గాలపై ఆయన సమీక్ష నిర్వహించనున్నారు. 

చంద్రగిరి నియోజకవర్గం ఐతేపల్లిలోని శ్రీదేవి గార్డెన్స్‌లో ఇవాళ్టినుండి (6,7,8 తేదీల్లో) మూడు రోజుల పాటు జిల్లా నాయకులతో చంద్రబాబు సమీక్షలు, సమావేశాలు జరగనున్నాయి. మూడురోజులు తిరుపతిలోనే మకాం వేసి పార్టీని చక్కదిద్దే ప్రయత్నం చేయనున్నారు. పర్యటనకు ప్రత్యేక అజెండా లేకున్నా.. సార్వత్రిక ఎన్నికల్లో పరాజయం...నేతల అలకలు...రాజీనామాలు.. రాజకీయ ఒత్తిళ్లు... కేసులు...కార్యకర్తలపై దాడులు.. స్థానిక సంస్థల ఎన్నికలు తదితర అంశాలపై జిల్లా సర్వసభ్య సమావేశం నిర్వహించనున్నారు. 

నియోజకవర్గాల నేతలతో సమీక్షించి ఇకపై అనుసరించాల్సిన విధానంపై దిశానిర్దేశం చేయనున్నారు. సార్వత్రిక ఎన్నికల అనంతరం జిల్లాలో పలు రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. 14 శాసనసభ నియోజకవర్గాలకు గాను కేవలం ఒక్క స్థానంలోనే పార్టీ విజయం సాధించింది. జిల్లా పరిధిలోని మూడు పార్లమెంటు స్థానాల్లోనూ ఓటమి పాలైంది. 

read more  బదిలీ ఎఫెక్ట్: ఎల్వీ సుబ్రహ్మణ్యం సంచలన నిర్ణయం

పార్టీ అధికారాన్ని కోల్పోయాక పలువురు ద్వితీయ శ్రేణి నాయకులు పార్టీ మారారు. మరికొందరు మారుతారనే ప్రచారం జరుగుతోంది. కొన్ని నియోజకవర్గాల్లో బాధ్యులు మొక్కుబడిగా పార్టీ కార్యక్రమాలకు హాజరవుతున్నా.. నాయకులు, కార్యకర్తలకు దూరంగా ఉంటున్నారు. 

మరోవైపు ఇసుక కొరత, భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి కరవు వంటి సమస్యలున్నాయి. పార్టీలోనూ అంతర్గతంగా విభేదాలు పొడచూపుతున్నాయి. నియోజకవర్గాల్లో ద్వితీయ శ్రేణి నేతలు కండువాలు మార్చుకుంటున్నారు. ఈ నేపథ్యంలో సమావేశాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. 

జిల్లాలో పార్టీ కేడర్‌ను త్వరలోనే ప్రక్షాళన చేస్తారని, పరోక్షంగా రేపటి సమావేశం నుంచే అందుకు సంబంధించిన కసరత్తు ప్రారంభమవుతుందని పార్టీ వర్గాల సమాచారం. త్వరలో జరగనున్న స్థానిక ఎన్నికల్లో విజయం సాధించి పార్టీకి పూర్వ వైభవం తీసుకురావడంతో పాటు, కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపి వారికి భరోసా కల్పించే వ్యూహంతో సమావేశాల్లో ప్రధానంగా చర్చ సాగనున్నట్లు సమాచారం. 

ఇవాళ  మధ్యాహ్నం తిరుపతి విమానాశ్రయానికి చేరుకున్న ఆయన అక్కడి నుంచి రోడ్డుమార్గంలో ఐతేపల్లిలోని శ్రీదేవి గార్డెన్స్‌కు వస్తారు. తొలుత మద్యాహ్నం 2 నుండి 4 గంటల వరకు జిల్లా పార్టీ కార్యకర్తలతో సమావేశం కానున్నారు.

read more  స్నేహం కోసం... తిరుపతిలో యువకుడి ఆత్మహత్య

7 తేదిన ఉదయం 10-12 వరకు జిల్లాలో వైకాపా కారణంగా నష్టపోయినా బాధితులతో సమావేశం కానున్నారు. అటు తరువాత పుంగనూరు,పలమనేరు, నగరి, చిత్తూరు, శ్రీకాళహస్తి, సత్యవేడు నియోజకవర్గాలపై సమీక్ష చేయనున్నారు. 

ఇక 8తేదిన ఉదయం 8-10 గంటల వరకు జిల్లా సమన్వయ కమిటీతో భేటీతో పాటు అవుతారు.చంద్రగిరి,కుప్పం,పూతలపట్టు,గంగాధర నెల్లూరు తిరుపతి నియోజకవర్గాలపై సమీక్ష చేసిన అనంతరం మీడియా సమావేశం కానున్నారు.

మొదటి రోజు జిల్లా సమావేశం నిర్వహించనున్నందున నియోజకవర్గ పరిధిలోని జిల్లా కమిటీలతో పాటు, మండల కమిటీలు, అనుబంధ విభాగాలు, మాజీ ప్రజా ప్రతినిధులు, పార్టీ ముఖ్య నాయకులను సమావేశానికి హాజరయ్యేలా చూసే బాధ్యత నియోజకవర్గ బాధ్యులకు అప్పగించారు. అన్ని నియోజకవర్గాల నుంచి ముఖ్యులందరూ హాజరు కావాలని ఆదేశాలు జారీ చేశారు. 

సమావేశ వేదిక వద్దే భోజనాలను ఏర్పాటు చేశారు. అనంతరం నిర్ణీత తేదీ, సమయంలో నియోజకవర్గ సమీక్షలకూ విధిగా హాజరు కావాలని నాయకులకు ఇది వరకే సమాచారమిచ్చారు. ఎన్నికల అనంతరం మొదటి సారి జిల్లా సమావేశం జరుగుతున్నందున అధినేత శ్రేణులకు ఎలా దిశా నిర్దేశం చేస్తారన్న ఆసక్తి పార్టీ వర్గాల్లో నెలకొంది.