గ‌త బీఆర్ఎస్ హ‌యాంలో ఫోన్ ట్యాపింగ్ జ‌రిగిందంటూ ఆరోప‌ణ‌లు వ‌చ్చిన విష‌యం తెలిసిందే. మొన్న‌టి వ‌ర‌కు తెలంగాణ రాజ‌కీయాల్లో హాట్ టాపిక్‌గా మారిన ఈ అంశం ఇప్పుడు ఏపీ రాజ‌కీయాల్లోనూ చ‌ర్చ‌నీయాంశంగా మారింది. 

ఫోన్ ట్యాపింగ్ వ్య‌వ‌హారం కేంద్రంగా ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చేసిన సంచలన వ్యాఖ్యలు సంచ‌ల‌నంగా మారిన విష‌యం తెలిసిందే. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ జరిగింది నిజమేనని, త‌నతో పాటు త‌న భ‌ర్త ఫోన్‌లు ట్యాప్ అయ్యాయ‌ని ఆమే ఆరోపించారు. అంత‌టితో ఆగ‌కుండా ఈ వ్య‌వ‌హారంలో అప్ప‌టి తెలంగాణ‌ సీఎం కేసీఆర్‌తో పాటు ఏపీ సీఎం జ‌గ‌న్ పాత్ర కూడా ఉంద‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

జగన్ స్పందన

ఈ ఆరోపణలపై ఏపీ మాజీ సీఎం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ తొలిసారి స్పందించారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ, షర్మిల ఫోన్ ట్యాపింగ్ జరిగిన విషయమై తనకు స్పష్టమైన సమాచారం లేదని చెప్పారు. కానీ, గతంలో ఆమె తెలంగాణ రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉన్న నేపథ్యంలో అటువంటి చర్యలు జరిగి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేశారు. “తెలంగాణలో జరిగిన వ్యవహారాలతో నాకు సంబంధం లేదు” అని తేల్చి చెప్పారు జగన్.

మీడియా సంస్థలపై దాడులు

ఈ సంద‌ర్భంగా జ‌గ‌న్ మాట్లాడుతూ.. సాక్షి ఆఫీసులపై టీడీపీ నేతలు కూటమితో కలిసి దాడులు చేసినట్టు ఆరోపించారు. ఇది కేవలం మీడియాపై జ‌రిగిన దాడి మాత్రే కాద‌ని, ప్రజాస్వామ్యంపై జ‌రిగిన దాడి అని జ‌గ‌న్ అభివ‌ర్ణించారు. “ఇది విచ్చలవిడి రౌడీయిజం కాకా మ‌రేంటి?” అని జ‌గ‌న్ మండిప‌డ్డారు.

జర్నలిస్టులపై అక్రమ కేసులు, అరెస్టులు చేస్తూ, మీడియా గొంతును నొక్కే ప్రయత్నం చేస్తున్నారని జగన్ ఆరోపించారు. సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాస్ అరెస్టు వ్యవహారాన్ని ప్రస్తావిస్తూ, ఆయన ఎలాంటి తప్పు చేయకపోయినా కేవలం ఓ అనలిస్ట్ వ్యాఖ్యలపై అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. గతంలో ప్రముఖ జర్నలిస్టు కేఎస్‌ఆర్‌ను కూడా చంద్రబాబు ఉద్దేశపూర్వకంగా ఉద్యోగం నుంచి తొలగించారని గుర్తు చేశారు.

రెడ్‌బుక్ పాలన

76 ఏళ్ల వయస్సులో చంద్రబాబు రెడ్‌బుక్ పాలన కొనసాగిస్తున్నారని, తన ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరు ప్రశ్నించినా భూస్థాపితం చేయాలన్న విధానాన్ని అనుసరిస్తున్నారని జగన్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రభుత్వం హామీలు నెరవేర్చకుండా, శాంతియుతంగా విమర్శించిన వారిపై కేసులు పెడుతూ, అణచివేతకు పాల్పడుతోందని చెప్పారు.

చెవిరెడ్డి కేసుపై స్పందించిన జ‌గ‌న్

వైసీపీ సీనియర్ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని లిక్కర్ స్కాంలో అక్రమంగా ఇరికించేందుకు కుట్ర జరిగిందని జగన్ ఆరోపించారు. భాస్కర్ రెడ్డికి గతంలో ఎలాంటి లిక్కర్ కేసులతో సంబంధం లేదని, ఆయన అలాంటి మనిషి కాదని స్పష్టం చేశారు. అయితే రాజకీయ కక్షతో పోలీసులు అరెస్ట్ చేశారని తెలిపారు. దీనిపై మాజీ గన్‌మన్ అయిన హెడ్ కానిస్టేబుల్ మదన్ రెడ్డి ఇచ్చిన వాంగ్మూలాన్ని ఒప్పించేందుకు చిత్రహింసలు పెట్టారని, దానికి తాను ఒప్పుకోకపోవడంతో దాడికి పాల్పడ్డారని జగన్ వివరించారు.