హైదరాబాద్: ఈశాన్య ఢిల్లీలో చెలరేగుతున్న అల్లర్లపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ తీవ్రంగా ప్రతిస్పందించారు. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి. కిషన్ రెడ్డి ఢిల్లీకి వెళ్లిపోవాలని ఆయన అన్నారు. కిషన్ రెడ్డి హైదరాబాదులో ఎందుకున్నారని ఆయన ప్రశ్నించారు. 

కిషన్ రెడ్డి ఢిల్లీ వెళ్లి అక్కడి పరిస్థితిని నియంత్రించాలని ఆయన అన్నారు. ఇప్పటికే ఏడుగురు మరణించారని, అల్లర్లను కిషన్ రెడ్డి చల్లార్చాలని ఆయన అన్నారు 

ఢిల్లీ హింసకు బాధ్యులైనవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కిషన్ రెడ్డి హైదరాబాదులో అన్నారు. రెండు నెలలుగా అక్కడ ధర్నా జరుగుతోందని, కేంద్రం శాంతియుతంగా నిరసన ప్రదర్శన చేయడానికి అవకాశం కల్పించిందని, కానీ నిన్న హింస పెచ్చరిల్లిందని ఆయన అన్నారు. 

లక్ష మంది ఓవైసీలు అడ్డు వచ్చినా సీఏఏను అమలు చేసి తీరుతామని కిషన్ రెడ్డి అన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అండతో ఎంఐఎం నేతలు రెచ్చిపోతున్నారని ఆయన అన్నారు. హైదరాబాదు ఎంపీ అసదుద్దీన్ బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నారని ఆయన అన్నారు. ఓవైసీ నోటికి అడ్డూ అదుపు లేకుండా పోతోందని ఆయన అన్నారు. ఎంఐఎం, టీఆర్ఎస్ లకు ప్రజలు తగిన బుద్ధి చెప్తారని ఆయన అన్నారు.

కిషన్ రెడ్డి వ్యాఖ్యలపై అసదుద్దీన్ ఓవైసీ తీవ్రంగా మండిపడ్డారు. ఢిల్లీ అల్లర్లకు స్థానిక ఎమ్మెల్యే కారణమని ఆయన అన్నారు. పోలీసులే రాళ్లు రువ్విస్తున్నారని ఆయన ఆరోపించారు.