జల సంరక్షణ చేసి నేలను సస్యశ్యామలం చేయాలన్న చిత్తశుద్ధి, దృఢ సంకల్పమే సర్ ఆర్థర్ కాటన్ ను గోదావరి జిల్లా ప్రజల హృదయాల్లో చిరంజీవిగా నిలిపాయన్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. శుక్రవారం డెల్టా రూపశీల్పి, అపర భగీరథుడు సర్ ఆర్ధర్ కాటన్ జయంతి సందర్భంగా జనసేనాని ఆయనకు  నివాళి ఆర్పించారు.

గోదావరి నదిపై 160 ఏళ్ల కిందట కాటన్ మహాశయుడు నిర్మించిన ఆనకట్ట వల్లే ఆ డెల్టా నేటికీ పచ్చగా కళకళలాడుతోందన్నారు. ఆ అపర భగీరథుడి జయంతి సందర్భంగా నా తరఫున, జనసైనికుల తరఫున మనఃపూర్వక అంజలి ఘటిస్తున్నానని పవన్ తెలిపారు.

Also Read:రాజధాని తరలింపు, 150 రోజులుగా ఆందోళన... చీమకుట్టినట్లు లేదు: జగన్‌పై బాబు విమర్శలు

గోదావరి పుణ్య స్నానం ఆచరించేటప్పుడు సర్ ఆర్థర్ కాటన్ ను స్మరిస్తూ నేటికీ అర్ఘ్యం సమర్పిస్తున్నారంటే ప్రజలు ఆయనకు అర్పించే కృతజ్ఞతాపూర్వక నివాళి అది అని జనసేనాని గుర్తుచేశారు.

ఇరిగేషన్ ప్రాజెక్టులు నిర్మించి రైతాంగాన్ని కాపాడటంతో పాటు తాగు నీటిని అందించాలి అంటే కావాల్సింది ప్రజల పట్ల బాధ్యత అని కాటన్ జీవితాన్ని చదివితే అర్థమవుతుందన్నారు.

Also Read:మిషన్ బిల్డ్ పేరుతో ప్రభుత్వ భూముల లూటీ: వైసీపీపై దూళిపాళ నరేంద్ర

కేవలం గోదావరి ప్రాంతంలోనే కాకుండా కృష్ణా తీరం, తమిళనాడులో తంజావూరు ప్రాంతంలో నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణానికి ఆయన చేసిన కృషిని ఎవరూ మరచిపోలేరని పవన్ అన్నారు.

ఇరిగేషన్ ప్రాజెక్టులను ఓట్లు కురిపించే సాధనాలుగా భావించే నేటి తరం పాలకులు - అపర భగీరథుడు తాను చేపట్టిన ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు పడ్డ తపన గురించి తెలుసుకోవాలన్నారు. ఆ స్ఫూర్తిని కొనసాగిస్తేనే ప్రాజెక్టులు కాగితాలపై కాకుండా, కార్యరూపం దాల్చి నిర్మాణాలు పూర్తవుతాయని పవన్ ఆకాంక్షించారు.