Asianet News TeluguAsianet News Telugu

మిషన్ బిల్డ్ పేరుతో ప్రభుత్వ భూముల లూటీ: వైసీపీపై దూళిపాళ నరేంద్ర

మిషన్ బిల్డ్ ఏపీ పేరుతో వైసీపీ ప్రభుత్వం కొత్త నాటకానికి తెరతీసిందని టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే దూళిపాళ నరేంద్ర విమర్శించారు. ప్రజల కోసం కాకుండా నవరత్నాల అమలు కోసం భూములు అమ్ముతున్నామని ప్రభుత్వం చెప్పడం సిగ్గుచేటన్నారు.

Former TDP MLA dulipala Narendra serious comments on Ys Jagan government over mission build scheme
Author
Amaravathi, First Published May 15, 2020, 3:54 PM IST

అమరావతి:మిషన్ బిల్డ్ ఏపీ పేరుతో వైసీపీ ప్రభుత్వం కొత్త నాటకానికి తెరతీసిందని టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే దూళిపాళ నరేంద్ర విమర్శించారు. ప్రజల కోసం కాకుండా నవరత్నాల అమలు కోసం భూములు అమ్ముతున్నామని ప్రభుత్వం చెప్పడం సిగ్గుచేటన్నారు.

శుక్రవారం నాడు ఆయన ఓ ప్రకటనను విడుదల చేశారు.ఎన్నికల హామీలు అమలు చేయడానికి భూములు అమ్ముతారా?అని ఆయన ప్రశ్నించారు. మిషన్ బిల్డ్ ఏపీ కాదు మిషన్ బిల్డ్ లూటీకి ప్రభుత్వం తెరతీసిందన్నారు.  విశాఖ, గుంటూరులో ప్రజలు వినియోగించుకుంటున్న భూములను అమ్మకానికి పెట్టడం ప్రభుత్వ దివాళాకోరుతనానికి నిదర్శనమన్నారు.

 పీవీకే నాయుడు మార్కెట్ స్థలంలో ఎందరో వ్యాపారాలు చేసుకుంటున్నారు. కార్పొరేషన్ ఎదురుగా ఉండే  స్థలాన్ని అమ్మకానికి పెట్టడమేంటి? రాజకీయ అజెండా అమలు కోసం భూములు అమ్మకానికి పెడుతున్నారు. 

ఆస్పత్రి విస్తరణకు ఇంకొంత స్థలం కావాలన్న ప్రతిపాదనను పక్కనపెట్టి  ఏకంగా స్థలం అమ్మకానికి పెట్టడం న్యాయం కాదని ఆయన అభిప్రాయపడ్డారు.   కార్మికశాఖ, మున్సిపల్ భూములను ఎందుకు అమ్ముతున్నారో ప్రభుత్వం సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

కరోనా విలయతాండవంతో పెద్ద పెద్ద సంస్థలే బోర్డు తిప్పేస్తుంటే జగన్మోహన్ రెడ్డి మాత్రం భూముల అమ్మకం పేరుతో దోపిడీకి తెరతీశారు. ఎవరి కోసం భూములు వేలం పెడుతోంది ఈ ప్రభుత్వం?  భూముల అమ్మకం వెనుక పెద్ద కుట్ర దాగిఉందని ఆయన ఆరోపించారు.

 అస్మదీయుల కోసమే ప్రభుత్వం కుట్ర చేస్తోంది. అయినవారికి కట్టబెట్టేందుకు ఎంతవరకైనా వెళుతోంది ఈ ప్రభుత్వం. పేదలకు భూముల పేరుతో దోపిడీ చేస్తున్నారని ఆయన విమర్శించారు.. ప్రభుత్వ భూములను అడ్డగోలుగా ఆక్రమించుకుని దారాధత్తం చేస్తున్నారన్నారు.

పాలన అంటే భూములు అమ్మడమా ? ఏడాది పాలనలో ఒక్క రూపాయి సంపద సృష్టించారా?  నవరత్నాలు అమలు చేయడానికి భూములు, ప్రభుత్వ ఆస్తులు అమ్ముతామని ఎన్నికల ముందు ఎందుకు చెప్పలేదని ఆయన ప్రశ్నించారు. 

పబ్లిసిటీ ఇష్టం లేనప్పుడు, డబ్బులు లేనప్పుడు వందలకోట్ల ప్రకటనలు ఎలా ఇస్తున్నారు? గుంటూరు ప్రాంత ప్రజలకు అవసరమైన భూముల అమ్మకం నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. 

also read:పోతిరెడ్డిపాడు ఎఫెక్ట్: తెలంగాణ ప్రాజెక్టులపై ఫిర్యాదుకు ఏపీ రె'ఢీ'

ఇవన్నీ కార్పొరేషన్ భూములు. నల్లపాడులో ఉన్న కార్పొరేషన్ స్థలాన్ని అమ్మకానికి పెట్టడమేంటి? ప్రజల ప్రయోజనార్థం స్థలం ఇవ్వడానికి మనసు రాదు కానీ అస్మదీయులకు మాత్రం అప్పనంగా భూములు కట్టబెడుతున్నారు. భూముల వేలాన్ని ప్రభుత్వం వెంటనే ఆపాలని ఆయన కోరారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios