ఆంధ్రుల స్వప్నంగా ముందుకు పోవాల్సిన అమరావతిని కుట్రపూరితంగా దెబ్బతీయాలని చూస్తున్నారని ఆరోపించారు ఏపీ ప్రతిపక్షనేత, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. శుక్రవారం అమరావతి జేఏసీ సమావేశంలో ఆయన పాల్గొన్నారు.

కరోనా జాగ్రత్తలు పాటిస్తూనే.. మరోవైపు అమరావతి పోరాటం కొనసాగిస్తున్న జేఏసీ నాయకులు, రైతులు, మహిళలందరికీ చంద్రబాబు  అభినందనలు తెలిపారు.అమరావతి జేఏసీ పోరాటం 150వ రోజుకు చేరినా వైకాపా ప్రభుత్వంలో చలనం లేకపోవడం బాధాకరమన్నారు.  

జైళ్లలో పెట్టినా, అక్రమ కేసులు బనాయించి శారీరకంగా వేధించినా.. వెనుకడుగు వేయని జేఏసీ నాయకుల పోరాటం అమరావతి చరిత్రలో నిలిచిపోతుందని బాబు ప్రశంసించారు. న్యాయం కోసం పోరాడే ప్రతి ఒక్కరికీ అమరావతి పోరాటం స్ఫూర్తిదాయకమన్నారు.

Also Read:గడ్డం గ్యాంగ్ భూకబ్జాలు.. పోలీసులు ఏం చేస్తున్నారు: జగన్‌పై కళా వెంకట్రావు విమర్శలు

హైదరాబాద్ ను అభివృద్ధి చేసిన నాకు.. మరోసారి అమరావతి అభివృద్ధి రూపంలో రాష్ట్ర ప్రజలు అవకాశం ఇచ్చారని టీడీపీ అధినేత గుర్తుచేశారు. రాష్ట్ర ఖజానాలో డబ్బులు లేని సమయంలో త్యాగం చేయడానికి ముందు రమ్మని నేను ఇచ్చిన ఒక్క పిలుపుతో 29,500 మంది రైతులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి.. 35వేల ఎకరాల భూములు ఇచ్చారని ఆయన కొనియాడారు.

రైతుల త్యాగాలకు న్యాయం జరిగేలా పదేళ్ల వరకు రైతులకు లబ్ధి చేకూరే ప్యాకేజీ ఇచ్చామని... సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్ గా అమరావతి రూపొందిందని చంద్రబాబు గుర్తుచేశారు. కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో అమరావతి నిర్మాణం సాగింది.

ప్రధాని వచ్చి శంకుస్థాపన చేశారని, నిర్మాణానికి రూ. 10వేల కోట్లు వరకు ఖర్చు చేశామని..  కానీ నేడు పనులన్నీ  ఎక్కడికక్కడ నిలిచిపోయాయని ప్రతిపక్షనేత ఆవేదన వ్యక్తం చేశారు.

Also Read:మిషన్ బిల్డ్ పేరుతో ప్రభుత్వ భూముల లూటీ: వైసీపీపై దూళిపాళ నరేంద్ర

రాజధానికి 30వేల ఎకరాలు కావాలని నాడు ప్రతిపక్షనేతగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడారని చంద్రబాబు గుర్తుచేశారు. ఒక ప్రభుత్వ నిర్ణయాన్ని తర్వాత ప్రభుత్వాలు కొనసాగిస్తాయి. కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అమరావతి నిర్మాణాన్ని కుట్రపూరితంగా నిలిపివేసిందని ఆయన ఆరోపించారు.  

న్యాయం కోసం 150 రోజులుగా పోరాడుతున్న జేఏసీకి తెలుగుదేశం పార్టీ మద్ధతు ఎల్లప్పుడూ ఉంటుందని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఈ పోరాటంలో అమరావతి జేఏసీ ఖచ్చితంగా విజయం సాధిస్తుందని... రైతుల పోరాటం చరిత్రలో నిలిచిపోతుందని ఆయన ఆకాంక్షించారు.