హైదరాబాద్: త్వరలో టీఆర్ఎస్ కు ఇద్దరు ఎంపీల రాజీనామా అంటూ రాజకీయ వర్గాల్లో కలవరం రేపిన కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి హింట్ నిజమే అయ్యింది. రేవంత్ ఆడిన మాట నిజమైంది. రేవంత్ చెప్పినట్లుగానే టీఆర్ఎస్ పార్టీకి ఆ పార్టీ చేవెళ్ల ఎంపీ రాజీనామా చేశారు. దీంతో ముందస్తు ఎన్నికల్లో మాంచి హుషారుగా ఉన్న టీఆర్ఎస్ కాళ్లకు అడ్డంపడింది. 

కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి తన నియోజకవర్గమైన కొడంగల్ ఎన్నికల ప్రచారంలో ఇద్దరు టీఆర్ఎస్ ఎంపీలు కాంగ్రెస్ పార్టీలోకి వస్తారంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. దీంతో టీఆర్ఎస్ పార్టీ ఎవరా అన్న కోణంలో ఆలోచించింది. అనుమానం ఉన్న వారి దగ్గరకు దూతలను పంపి బుజ్జగింపులకు కూడా శ్రీకారం చుట్టింది. 

ఇకపోతే రేవంత్ వ్యాఖ్యల తరువాత చేవెళ్ల ఎంపీ విశ్వేశ్వరరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. టీఆర్ ఎస్ పార్టీని వీడేది ఇద్దరు కాదు ముగ్గురు అంటూ ప్రకటించారు. ఆ తర్వాత సీఎం కేసీఆర్ ను కలిసి తాను టీఆర్ఎస్ లోనే ఉంటున్నట్లు ప్రకటించారు. రేవంత్ రెడ్డి మైండ్ గేమ్ ఆడుతున్నారంటూ విమర్శలు కూడా చేశారు. 

అయితే మంగళవారం సాయంత్రం విశ్వేశ్వరరెడ్డి రాజీనామా చెయ్యడంతో రేవంత్ మాట నిజమేనన్నమాట అన్నచర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. మిగిలిన ఇద్దరు ఎవరా అంటూ ఆసక్తిగా చర్చ జరుగుతుంది. ఇప్పటికే మహబూబాబాద్ ఎంపీ సీతారాం నాయక్, ఎమ్మెల్సీ యాదవరెడ్డిలు కూడా వీడబోతారంటూ జరిగిన వార్తలు నిజజమేనా అంటూ గుసగుసలాడుకుంటున్నారు. 

ఇకపోతే  విశ్వేశ్వరరెడ్డి టీఆర్ఎస్ పార్టీకి గత కొద్దికాలంగా అంటీముట్టనట్లుగా ఉంటున్నారు. రంగారెడ్డి జిల్లాలో పార్టీ తనకు తగిన గౌరవం ఇవ్వడం లేదని అసంతృప్తితో రగిలిపోతున్నారు. 

మంత్రి పట్నం మహేందర్‌రెడ్డికి పార్టీలో విపరీతమైన ప్రాధాన్యత ఇవ్వడాన్ని విశ్వేశ్వరరెడ్డి జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన పార్టీకి గుడ్ బై చెప్పినట్లు తెలుస్తోంది. 

ఈ వార్తలు కూడా చదవండి

కేసీఆర్‌కు బిగ్ షాక్: టీఆర్ఎస్‌కు ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి రాజీనామా

కేసీఆర్ కు షాక్: కాంగ్రెసులోకి ఎంపీ విశ్వేశ్వర రెడ్డి?

ఆ ఆలోచన లేదు: కేసీఆర్ తో భేటీ తర్వాత విశ్వేశ్వర రెడ్డి

రేవంత్ మైండ్ గేమ్ ఆడుతున్నాడు: టీఆర్ఎస్ ఎంపీ

కాంగ్రెస్ లోకి ఇద్దరు టీఆర్ఎస్ ఎంపీలు:టచ్ లో ఉన్నారన్న రేవంత్