హైదరాబాద్: ఎన్నికల వేళ తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) చేవెళ్ల పార్లమెంటు సభ్యుడు విశ్వేశ్వ రెడ్డి కారు దిగనున్నట్లు తెలుస్తోంది. విశ్వేశ్వర రెడ్డితో పాటు ఎమ్మెల్సీ యాదవ రెడ్డి కూడా టీఆర్ఎస్ అధినేత కేసిఆర్ కు షాక్ ఇవ్వనున్నట్లు ప్రచారం జరుగుతోంది. కాంగ్రెసు నేత రేవంత్ రెడ్డి చెప్పినట్లు మరో ఇద్దరు పార్లమెంటు సభ్యులు కూడా టీఆర్ఎస్ షాక్ ఇస్తారని అంటున్నారు.

బుధవారం జరిగిన పరిణామాలు విశ్వేశ్వర రెడ్డి పార్టీ వీడుతారనే సంకేతాలు ఇచ్చినట్లు భావిస్తున్నారు. రేవంత్ రెడ్డి ప్రకటన వెలువడిన సమయంలో  తాండూరులో విశ్వేశ్వర్‌రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేసి కాలుష్యంపై మాట్లాడారు. రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ కాంగ్రెసులో చేరే ఇద్దరు ఎంపీల్లో మీరు కూడా ఉన్నారా? అని మీడియా ప్రతినిధులు అడిగారు. 

ఇద్దరు కాదు ముగ్గురు అంటూ ఆయన మీడియా ప్రతినిధుల ప్రశ్నకు జవాబిచ్చారు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయవర్గాల్లో చర్చనీయంగా మారాయి. అయితే, తనపై రోజూ ఇలాంటి ప్రచారాలు జరుగుతూనే ఉన్నాయని, తనతో పాటు ఇద్దరుముగ్గురిపై కూడా ఇలానే ప్రచారం జరుగుతోందని, ఆ ఉద్దేశంతోనే ఈ వ్యాఖ్యలు చేశానని విశ్వేశ్వర రెడ్డి ఆంధ్రజ్యోతి ప్రతినిధితో చెప్పారు. 

గతంలో కూడా బీజేపీలో చేరుతున్నట్లు ప్రచారం సాగిందని, అపుడు మీడియా ప్రతినిధులు అడిగితే చేరుతున్నాననే చెప్పానని.. ఇప్పుడు కూడా అలాగే యథాలాపంగా చెప్పానని అన్నారు. అయితే, ఆయన ఆ వ్యాఖ్యలు చేసినప్పటికీ పార్టీకి దూరంగా ఉండడం, ప్రచారంలో పాల్గొనకపోవడం పార్టీ మారుతారనే అనుమానాలకు బలాన్నిస్తున్నాయి. 

వచ్చే ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్‌ తరఫున చేవెళ్ల ఎంపీగా పోటీ చేయాలని విశ్వేశ్వర రెడ్డి భావిస్తున్నట్లు తెలుస్తోంది. సోనియా తెలంగాణ పర్యటనలో ఆయనతో పాటు మరికొందరు టీఆర్‌ఎస్‌ నేతలు కాంగ్రెసులో చేరుతారని అంటున్నారు. మంత్రి కేటీఆర్‌, కవిత విశ్వేశ్వర రెడ్డితో మాట్లాడే ప్రయత్నం చేసినా ఫలించలేదని తెలుస్తోంది.