Asianet News TeluguAsianet News Telugu

విభజనపై మోడీ వ్యాఖ్యలు.. తలుపులు మూయలేదా, పెప్పర్ స్ప్రే వాడలేదా : బీఆర్ఎస్‌కు కిషన్ రెడ్డి కౌంటర్

 మోడీ ఎవరినీ విమర్శించలేదని.. విభజన సమయంలో పార్లమెంట్‌లో చోటు చేసుకున్న అంశాలనే ప్రస్తావించారని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.  కేసీఆర్ కుటుంబం ప్రస్తుతం ఏది అర్ధం చేసుకునే పరిస్థితిలో లేదని కిషన్ రెడ్డి దుయ్యబట్టారు. 

union minister kishan reddy on pm narendra modi on ap bifurcation ksp
Author
First Published Sep 18, 2023, 6:33 PM IST

పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల సందర్భంగా ప్రసంగిస్తూ ప్రధాని నరేంద్ర మోడీ ఏపీ విభజన అంశాన్ని ప్రస్తావించారు. దీనిపై బీఆర్ఎస్ నేతలు ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ క్రమంలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. మోడీ ఎవరినీ విమర్శించలేదని.. విభజన సమయంలో పార్లమెంట్‌లో చోటు చేసుకున్న అంశాలనే ప్రస్తావించారని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్ర విభజన సమయంలో పెప్పర్ స్ప్రేను వాడలేదా.. పార్లమెంట్ తలుపులు మూయలేదా అని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. 

పాత పార్లమెంట్‌లో చోటు చేసుకున్న చారిత్రక ఘట్టాల గురించి చెబుతూ మోడీ సదరు విషయాలను గుర్తుచేశారని మంత్రి చెప్పారు. కేసీఆర్ కుటుంబం ప్రస్తుతం ఏది అర్ధం చేసుకునే పరిస్థితిలో లేదని కిషన్ రెడ్డి దుయ్యబట్టారు. గతంలో బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్‌తో అధికారం పంచుకుందని.. ఆ సమయంలోనే తెలంగాణ ఏర్పాటును  హస్తం పార్టీ ఆలస్యం చేసిందని ఆయన ఆరోపించారు. తెలంగాణను ఇచ్చింది తామేనని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారని.. కానీ ప్రజలు కాంగ్రెస్ మెడలు వంచి తెలంగాణను సాధించారని కిషన్ రెడ్డి తెలిపారు. 

అయితే ఏపీ విభజనకు సంబంధించి ప్రధాని  మోదీ చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యల పట్ల తాను తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యానని పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పాటుపై ప్రధాని మోదీ అవమానకర వ్యాఖ్యలు చేయడం ఇదే మొదటి సందర్భం కాదని.. చారిత్రక వాస్తవాల పట్ల ఆయనకున్న నిర్లక్ష్యానికి ఇది అద్దం పడుతోందని విమర్శలు గుప్పించారు.

Also Read: పార్లమెంట్‌లో ప్రధాని ప్రసంగం.. చరిత్రను గుర్తుచేసుకున్న మోదీ.. కీలక పాయింట్స్ ఇవే..

తెలంగాణ ప్రజలు రాష్ట్ర సాధన కోసం ప్రజలు ఆరు దశాబ్దాలుగా అవిశ్రాంతంగా పోరాడారని.. ఎట్టకేలకు 2014 జూన్ 2న వారి కలను సాకారం చేసుకున్నారని మంత్రి కేటీఆర్ గుర్తుచేశారు. రాష్ట్రావతరణ దిశగా సాగిన ప్రయాణం లెక్కలేనన్ని త్యాగాలతో కూడుకున్నదని చెప్పారు. తెలంగాణ యువకుల త్యాగాల గురించి ప్రత్యేకంగా చెప్పుకొవాల్సి ఉంటుందని అన్నారు. 

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను జరుపుకోలేదని ప్రధాని మోదీ మాట్లాడటం సరికాదని అన్నారు. ఇందులో అజ్ఞానం, అహంకారంగా కూడా కనిపిస్తుందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీని విమర్శించే ప్రయత్నంలో ప్రధాని మోదీ పదే పదే తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీస్తున్నారని విమర్శించారు. ముఖ్యమైన స్థానాల్లో ఉన్న రాజకీయ నాయకులు అటువంటి సున్నితమైన చారిత్రక విషయాలపై అవగాహనతో మాట్లాడటం, వాటితో ముడిపడి ఉన్న భావోద్వేగాలు, త్యాగాలను పరిగణనలోకి తీసుకోవడం చాలా ముఖ్యమని కేటీఆర్ అన్నారు. ఈ మేరకు కేటీఆర్ ఎక్స్(ట్విట్టర్‌)లో పోస్టు  చేశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios