పార్లమెంట్‌లో ప్రధాని ప్రసంగం.. చరిత్రను గుర్తుచేసుకున్న మోదీ.. కీలక పాయింట్స్ ఇవే..
పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల వేళ లోక్‌సభలో 75 ఏళ్ల పార్లమెంటరీ ప్రయాణంపై ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు. ఈ ప్రసంగంలో పార్లమెంట్‌లో భవనంతో ఉన్న అనుబంధం, పార్లమెంట్‌లో జరిగిన చర్చలు, మాజీ ప్రధానులు తీసుకున్న పలు కీలక నిర్ణయాలు, చేపట్టిన ప్రగతి శీల కార్యక్రమాల గురించి మోదీ ప్రస్తావించారు.
చారిత్రక పార్లమెంట్ భవనానికి వీడ్కోలు పలుకుతున్నట్టుగా ప్రధాని మోదీ తెలిపారు. మనం కొత్త భవనంలోకి వెళ్తున్నప్పటికీ పాత భవనం భావితరాలకు స్పూర్తినిస్తుందని పేర్కొన్నారు. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో భాగంగా తొలిరోజు లోక్‌సభలో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ‘‘స్వాతంత్య్రానికి ముందు ఈ సభ ఇంపీరియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్‌కు వేదికగా ఉండేది. స్వాతంత్ర్యం తర్వాత ఇది పార్లమెంటు భవనంగా గుర్తింపు పొందింది. ఈ భవనాన్ని నిర్మించాలనే నిర్ణయాన్ని విదేశీ పాలకులు తీసుకున్నారనేది నిజం. అయితే మేము ఎన్నటికీ మరచిపోలేము. ఈ పార్లమెంట్ భవనాన్ని భారతీయుల స్వేదం, డబ్బుతో నిర్మించామని గర్వంగా చెప్పగలను’’ అని అన్నారు.
ఈ సందర్భంగా చరిత్రను గుర్తుచేసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ భవనం వీడి వెళ్తున్నప్పుడు మనలో అనేక అనుభవాలు గుర్తుకువస్తున్నాయని చెప్పారు. ఈ భవనం మన గౌరవాన్ని పెంచిందని అన్నారు. 75 ఏళ్లలో అనేక ఘట్టాలకు వేదికగా నిలిచిందని చెప్పారు. ఈ భవనంతో మనకు తీపి, చేదు అనుభవాలు ఎన్నో ఉన్నాయని అన్నారు. పార్లమెంట్‌లో విభేదాలు, వివాదాలను మనందరం చూశామని.. అయితే అదే సమయంలో కుటుంబ భావనను కూడా చూశామని చెప్పారు. 75 ఏళ్ల ప్రయాణంలో ఎన్నో నిర్ణయాలు తీసుకున్నామని చెప్పారు.
తాను ఎంపీగా తొలిసారిగా ఈ భవనం (పార్లమెంట్)లోకి అడుగుపెట్టినప్పుడు.. ప్రజాస్వామ్య దేవాలయానికి నమస్కరించి, గౌరవించానని చెప్పారు. ఇది తనకు ఉద్వేగభరితమైన క్షణమని తెలిపారు. పేద కుటుంబానికి చెందిన వ్యక్తి, రైల్వే ప్లాట్‌ఫారమ్‌పై నివసించే వ్యక్తి.. పార్లమెంటులో ప్రవేశించగలరని తాను ఊహించలేదని చెప్పారు. తాను ప్రజల నుంచి ఇంత ప్రేమను పొందుతానని ఎప్పుడూ ఊహించలేదని అన్నారు.
ఈ సభలో జరిగిన చర్చలు, నిర్ణయాలను ప్రజల వద్దకు తీసుకెళ్లిన విలేకరుల భాగస్వామ్యం కూడా గొప్పదని అన్నారు. సభలో జరిగిన ప్రతి విషయాన్ని ప్రజలు ముందుంచిన పాత్రికేయులకు కూడా భారత ప్రజస్వామ్య విజయంలో భాగస్వామ్యం ఉందని చెప్పారు. సాంకేతికత అందుబాటులో లేనప్పుడు కూడా వారు ఇక్కడి నుండి సమాచారాన్ని దేశానికి చేరవేశారని గుర్తుచేశారు. జవహర్‌లాల్ నెహ్రూ నుంచి మన్మోహన్ సింగ్ వరకు అందరూ ప్రధానులు కీలక పాత్ర పోషించారని అన్నారు. ఈ సభకు 17 మంది స్పీకర్లు నేతృత్వం వహించారని తెలిపారు. మౌలంకర్ నుంచి సుమిత్రా మహాజన్ వరకు ఈ సభకు దిశానిర్దేశం చేశారని గుర్తుచేశారు. ఈ సభలో సభ్యులే కాదు.. వారికి సహకరించిన సిబ్బంది భాగస్వామ్యం కూడా గుర్తించదగినదని చెప్పారు.
పార్లమెంటులో చేసిన దిగ్గజ ప్రసంగాలను ప్రధాని మోదీ గుర్తు చేసుకున్నారు. మాజీ ప్రధానులు జవహర్‌లాల్ నెహ్రూ, అటల్ బిహారీ వాజ్‌పేయి, లాల్ బహదూర్ శాస్త్రి వంటి వారు పార్లమెంట్‌లో చేసిన ప్రగతిశీల కార్యక్రమాలను ఆయన ప్రస్తావించారు. నెహ్రు నుంచి ఎంతో ప్రేరణ పొందామని చెప్పారు. నెహ్రు, వాజ్‌పేయి ప్రసంగాలు ప్రతిధ్వనిస్తుంటాయని తెలిపారు. ప్రధానిగా నెహ్రు, కేంద్ర మంత్రిగా అంబేద్కర్ ఉన్నప్పుడు విధానాలు చాలా ప్రభావవంతంగా జరిగాయని అన్నారు. సర్దార్ పటేల్, జేపీ, లోహియా, అద్వానీ వంటి మహానుభావులను కూడా మోదీ గుర్తు చేసుకున్నారు.
‘‘(పార్లమెంట్‌పై) ఉగ్రదాడి జరిగింది. ఇది భవనంపై జరిగిన దాడి కాదు.. ఒకరకంగా ఇది ప్రజాస్వామ్యానికి తల్లిపై, మన జీవాత్మపై జరిగిన దాడి. ఆ ఘటనను దేశం ఎప్పటికీ మరచిపోదు. నేను కూడా ఉగ్రవాదులతో పోరాడుతూ పార్లమెంటును, సభ్యులందరినీ రక్షించేందుకు ధైర్యంగా పోరాడినవారికి నమస్కరిస్తున్నాను’’ అని మోదీ పేర్కొన్నారు.
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ హయాంలో 'ఓట్ల కోసం నగదు' కుంభకోణం కూడా ఈ సభలోనే జరిగిందని గత యూపీఏ సర్కార్‌పై విమర్శలు ఎక్కుపెట్టారు. ఇక, ఈ ప్రసంగంలో పార్లమెంట్‌లో భవనంతో ఉన్న అనుబంధం, పార్లమెంట్‌లో జరిగిన చర్చలు, మాజీ ప్రధానులు తీసుకున్న పలు కీలక నిర్ణయాలు, చేపట్టిన ప్రగతి శీల కార్యక్రమాల గురించి మోదీ ప్రస్తావించారు.
‘‘మనం కొత్త పార్లమెంటు భవనంలోకి ప్రవేశించినప్పుడు.. కొత్త ఆశ, విశ్వాసంతో అక్కడికి వెళ్తామని నాకు నమ్మకం ఉంది. ఈ పార్లమెంటు జ్ఞాపకాలను పంచుకోవాలని ఎంపీలందరినీ నేను అభ్యర్థిస్తున్నాను’’ మోదీ తన ప్రసంగం ముగింపు సందర్భంగా పేర్కొన్నారు.