Today Top Story: చంద్రబాబుతో ప్రశాంత్ కిశోర్ భేటీ.. టీ కాంగ్రెస్ కు కొత్త బాస్.. పేరు మార్చుకున్న పల్లవి

Today Top Story: శుభోదయం..ఈ రోజు టాప్ సోర్టీలో ఏపీ రాజకీయాల్లో సంచలనం .. టీడీపీ అధినేత చంద్రబాబుతో ఎన్నికల వ్యూహాకర్త ప్రశాంత్ కిషోర్ భేటీ, 2024 ఎన్నికల్లో​ సీఎం జగన్‌ గెలుపు కోసమే పనిచేస్తామని ఐ-పాక్ ప్రకటించింది. ఆటో, క్యాబ్ డ్రైవర్లు, ఫుడ్ డెలివరి బాయ్స్ కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్. తెలంగాణలో కొత్తగా 12 కరోనా కేసులు .. వంటి పలు వార్తల సమాహారం.  

Today Top Story, top 10 telugu news for december 24, 2023 headlines andhra pradesh, telangana updates krj

Today Top Story: 
చంద్రబాబుతో ప్రశాంత్ కిశోర్ భేటీ
 

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. గత ఎన్నికల్లో వైసీపీ వ్యూహకర్తగా పనిచేసిన ప్రశాంత్ కిషోర్ తో నేడు టీడీపీ అధినేత చంద్రబాబు భేటీ అయ్యారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో వీరి భేటీ కావడంపై రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. శనివారం మధ్యాహ్నం నారా లోకేశ్ తో కలిసి వ్యూహ్యకర్త ప్రశాంత్ కిషోర్ గన్నవరం విమానాశ్రయానికి బయలు దేరారు. అనంతరం వీరిద్దరూ ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి చేరుకుని చంద్రబాబుతో భేటీ అయ్యారు. వీరి భేటీ సూమారు గంటన్నర పాటు జరిగింది.ఈ క్రమంలో ఏపీలో రాజకీయ పరిస్థితులపై ఇరువురు చర్చించినట్లు టీడీపీ నేతలు చెబుతున్నారు. అలాగే.. ప్రశాంత్ కిషోర్ బృందం చేసిన సర్వే రిపోర్ట్‌ను చంద్రబాబుకు అందించినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ భేటీ అనంతరం ప్రశాంత్ కిశోర్ మీడియాతో మాట్లాడుతూ.. తాను చంద్రబాబునాయుడిని కలవడం వెనుక ప్రత్యేక కారణమేమి లేదని స్పష్టం చేశారు. చంద్రబాబు సీనియర్ రాజకీయనాయకుడు అని, ఆయన కలవాలని కోరడంతో వచ్చానని తెలిపారు. తాను చంద్రబాబును మర్యాదపూర్వకంగానే కలిశానని వెల్లడించారు. 


 ఐ-పాక్ కీలక ప్రకటన..
 
ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్(Prashant Kisor) చంద్రబాబు(Chandrababu)తో భేటీ అయిన విషయం తెలిసిందే. ఈ భేటీ అనంతరం ఐ-పాక్(I-PAC) కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. 2024 ఎన్నికల్లో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్(YS Jagan) గెలుపు కోసం తాము పనిచేస్తున్నట్టు ఐపాక్‌ సంస్థ ప్ర‌క‌ట‌న ద్వారా తెలియ‌జేసింది. ట్విట్టర్ (ఎక్స్) వేదికగా..‘ఆంధ్రప్రదేశ్‌ ప్రజల అభివృద్ధి కోసం అనునిత్యం కృషి చేస్తున్న సీఎం వైఎస్‌ జగన్‌కు మా వంతు సహయం చేస్తాం. ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్‌సీపీ(YSRCP)తో కలిసి పనిచేస్తున్నాం. 2024 ఎన్నికల్లో​ సీఎం జగన్‌ గెలుపు కోసమే పనిచేస్తాం’అని స్పష్టం చేసింది.

ఆటో, క్యాబ్ డ్రైవర్లకు సీఎం రేవంత్ బంపర్ ఆఫర్..!

CM Revanth Reddy: ఆటో, క్యాబ్ డ్రైవర్లు, ఫుడ్ డెలివరి బాయ్స్ కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్ ఇచ్చారు. వారి కోసం రూ.5 లక్షల 'యాక్సిడెంటల్ పాలసీ' అందుబాటులోకి తీసుకరావడంతో పాటు 'రాజీవ్ ఆరోగ్యశ్రీ' ద్వారా రూ.10 లక్షల వరకు ఉచిత వైద్యం అందిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. శనివారం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో క్యాబ్ డ్రైవర్లు, ఫుడ్ డెలవరీ బాయ్ లు, ఆటో డ్రైవర్ల సమస్యలను తెలుసుకోవడానికి నిర్వహించిన సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. సామాజిక  రక్షణ కల్పించడంలో తమ ప్రభుత్వం బాధ్యతాయుతంగా వ్యవహరిస్తుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అసంఘటిత కార్మికుల ఉపాధి, సామాజిక భద్రతకు చర్యలు తీసుకుంటామని రాహుల్ గాంధీ మాట ఇచ్చారు. ఆ క్రమంలో  విధాన నిర్ణయం తీసుకుంటామన్నారు. ఇందుకోసం రాజస్థాన్ లో చేసిన చట్టాన్ని అధ్యయనం చేసి వచ్చే బడ్జెట్ సమావేశాల్లో సమర్ధవంతమైన చట్టాన్ని ప్రవేశపెడతామని హామీ ఇచ్చారు. 


నేడే జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం రేవంత్ తొలిసారి భేటీ

CM Revanth Reddy: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఏ.రేవంత్ రెడ్డి పదవీ బాధ్యతలు చేపట్టిన అనంతరం తొలిసారిగా జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో సమావేశం ఆదివారం డా. బి. ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో నిర్వహిస్తున్నారు. గత ప్రభుత్వ లోపాలను సరిదిద్దడంతో పాటు తమ ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారంటీలను 100 రోజుల్లో అమలు, పాలనా యంత్రాంగాన్ని గ్రామ స్థాయికి తీసుకొని పోయే 'ప్రజాపాలన' కార్యక్రమాలపై సీఎం రేవంత్ రెడ్డి దిశా నిర్దేశం చేయనున్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి అత్యంత ప్రాముఖ్యతనిస్తున్న ప్రజా భవన్ లో ప్రతీ మంగళ, శుక్ర వారాల్లో ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.. అయితే.. ఈ ప్రజావాణిని జిల్లా, డివిజన్, మండల, గ్రామ స్థాయిలోనూ చేపట్టేలా కార్యాచరణ ప్రణాళికను ఈ కలెక్టర్ల సమావేశంలో సీఎం ప్రకటించనున్నట్టు తెలుస్తోంది. దీనితోపాటు.. ఆర్థిక సాధికారిత కల్పించడం ద్వారా సామాజిక న్యాయం కల్పించేందుకై ప్రకటించిన ఆరు హామీల అమలుపై కలెక్టర్లకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వనున్నారు. 


టీ కాంగ్రెస్ కు కొత్త బాస్..

తెలంగాణ కాంగ్రెస్ కొత్త ఇన్‌ఛార్జ్‌గా దీపాదాస్ మున్షీ నియమితులయ్యారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో దీపాదాస్ పరిశీలకురాలిగా పనిచేసిన సంగతి తెలిసిందే. పశ్చిమ బెంగాల్ సీనియర్ నేత ప్రియరంజన్ దాస్ మున్షీ సతీమణే దీపాదాస్ మున్షీ. ఇప్పటి వరకు తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్‌గా వ్యవహరించిన మాణిక్ రావ్ థాక్రేను గోవా కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్‌గా నియమించింది ఏఐసీసీ . ఏపీ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్‌గా మాణిక్కం ఠాగూర్‌ను నియమించింది. తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్‌గా వున్న మాణిక్యం ఠాగూర్ .. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ సీనియర్ కాంగ్రెస్ అధిష్టానానికి ఫిర్యాదు చేయడంతో ఆయన స్థానంలో మాణిక్ రావ్ థాక్రేను నియమించింది హైకమాండ్. హైదరాబాద్‌లో అడుగుపెట్టిన నాటి నుంచి కాంగ్రెస్‌లో కుమ్ములాటలు, వర్గవిభేదాలను పరిష్కరించే పనిని ఆయన భుజానికెత్తుకున్నారు.

తెలంగాణలో కొత్తగా 12 కరోనా కేసులు ..  


దేశంలో నానాటికీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. తెలంగాణలో ఇదే పరిస్థితి.. చాప కింద నీరులా వ్యాప్తి చెందుతుంది. తాజాగా 12 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ బులిటిన్ విడుదల చేసింది. హైదరాబాద్‌లో 9, వరంగల్, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాల్లో ఒక్కో కేసు చొప్పున నమోదయ్యాయి. కోవిడ్ నుంచి ఒకరు కోలుకోగా.. మరో 38 మంది చికిత్స తీసుకుంటున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. గడిచిన 24 గంటల్లో 1322 మందికి కోవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 30 మంది రిపోర్టులు రావాల్సి వుంది. ఈ తరుణంలో 
రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజ నర్సింహ సమీక్ష నిర్వహించారు. కరోనాను అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలు, ఆక్సిజన్ సిలిండర్లు, వెంటిలేటర్ల వంటి వాటిపై ఆరా తీశారు. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో వున్న ల్యాబ్‌ల్లో ఒక్కరోజులో 16,500 ఆర్టీపీసీఆర్ టెస్టులు చేయగలిగే సామర్ధ్యం వుందని అధికారులు మంత్రికి వివరించారు. మరో 84 ప్రైవేట్ ఆర్టీపీసీఆర్ ల్యాబ్‌లు అందుబాటులో వున్నాయని అధికారులు రాజనర్సింహకు తెలిపారు. 


ప్రియాంక గాంధీకి షాకిచ్చిన అధిష్ఠానం

Priyanka Gandhi: భారత జాతీయ కాంగ్రెస్ (Congress Party) పలు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కొత్త ఇన్‌ఛార్జీలను నియమించింది. ఈ తరుణంలో అగ్ర నాయకురాలు, ఏఐసీసీ జాతీయ ప్రధాన కార్యదర్శి  ప్రియాంక గాంధీకి ఏఐసీసీ షాకిచ్చింది. ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ ఏఐసీసీ ఇంచార్జ్ పదవి నుంచి ప్రియాంక గాంధీ వాద్రాను తప్పించారు. ఆమె స్థానంలో అవినాశ్ పాండేని యూపీ కాంగ్రెస్ ఇన్చార్జిగా నియమిస్తూ హైకమాండ్ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ప్రియాంక గాంధీకి ఏ రాష్ట్ర బాధ్యతలను అప్పగించలేదు. అవినాశ్ పాండే మహారాష్ట్రకు చెందిన సీనియర్ కాంగ్రెస్ నేత. వృత్తి రీత్యా ఆయన న్యాయవాది. కాంగ్రెస్ పార్టీలో విద్యార్థి విభాగం నేతగా ప్రస్థానం మొదలుపెట్టి అంచెలంచెలుగా ఎదిగారు.2010లో ఆయన ఎంపీగా గెలుపొందారు.  

రైతుబిడ్డ ట్యాగ్ తీసేసిన పల్లవి ప్రశాంత్

Pallavi Prashanth : బిగ్ బాస్ తెలుగు 7 సీజన్ విన్నర్‌గా కామన్ మ్యాన్ పల్లవి ప్రశాంత్ గెలిచిన సంగతి తెలిసిందే. అయితే అన్నపూర్ణ స్టూడియోస్‌లో ప్రశాంత్ ఫ్యాన్స్ రచ్చ చేయడంతో..  అతనిపై కేసు నమోదు చేశారు. అనంతరం అతడ్ని అరెస్ట్ చేసి జైలుకు తరలించిన సంగతి తెలిసిందే.. అయితే తాజాగా ప్రశాంత్‌కు బెయిల్ వచ్చింది. దీంతో అతడు శనివారం చంచల్‌ గూడ జైలు నుంచి విడుదలయ్యారు.  

ఇక అది అలా ఉంటే ప్రశాంత్  తాజాగా తన పేరును మార్చుకున్నారు. తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో తన పేరు, బయోను మార్పు చేశారు. తనను ఎంతగానో పాపులర్ చేసిన రైతు బిడ్డ ఐడెంటిటీ ఇంస్టాగ్రామ్ బయో నుండి తప్పించాడు.ప్రశాంత్‌గా ఉండే పేరు.. MALLA OCHINA, SPY Team Winner అని కొత్తగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో చేర్చుకున్నాడు. తన బిగ్ బాస్ విజయంలో శివాజీ, యావర్‌ల సాయం మరవలేనిది. ఈ నేపథ్యంలో వారి పేర్లను కలుపుకుని స్పై టీమ్ విన్నర్‌గా మార్చుకున్నట్లు చెబుతున్నారు ఆయన అభిమానులు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios