CM Revanth Reddy: నేడే జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం రేవంత్ భేటీ.. చర్చించే కీలక అంశాలివే..  

CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి పదవి బాధ్యతలు చేపట్టిన తరువాత తొలిసారి జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో సమావేశం కానున్నారు. ఈ భేటీలో తమ ప్రభుత్వం ప్రకటించిన 100 రోజుల్లో ఆరు గ్యారంటీల అమలు, పాలనా యాంత్రాంగాన్ని గ్రామ స్థాయికి తీసుకొని పోయే ‘ప్రజా పాలన’ కార్యక్రమాలపై ముఖ్యమంత్రి దిశా నిర్దేశం చేయనున్నట్టు సమాచారం.  

CM Revanth Reddy to hold meeting with collectors and SPs KRJ

CM Revanth Reddy: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఏ.రేవంత్ రెడ్డి పదవీ బాధ్యతలు చేపట్టిన అనంతరం తొలిసారిగా జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో సమావేశం ఆదివారం డా. బి. ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో నిర్వహిస్తున్నారు. గత ప్రభుత్వ లోపాలను సరిదిద్దడంతో పాటు తమ ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారంటీలను 100 రోజుల్లో అమలు, పాలనా యంత్రాంగాన్ని గ్రామ స్థాయికి తీసుకొని పోయే 'ప్రజాపాలన' కార్యక్రమాలపై సీఎం రేవంత్ రెడ్డి దిశా నిర్దేశం చేయనున్నారు. 

ప్రజా సమస్యల పరిష్కారానికి అత్యంత ప్రాముఖ్యతనిస్తున్న ప్రజా భవన్ లో ప్రతీ మంగళ, శుక్ర వారాల్లో ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.. అయితే.. ఈ ప్రజావాణిని జిల్లా, డివిజన్, మండల, గ్రామ స్థాయిలోనూ చేపట్టేలా కార్యాచరణ ప్రణాళికను ఈ కలెక్టర్ల సమావేశంలో సీఎం ప్రకటించనున్నట్టు తెలుస్తోంది. దీనితోపాటు.. ఆర్థిక సాధికారిత కల్పించడం ద్వారా సామాజిక న్యాయం కల్పించేందుకై ప్రకటించిన ఆరు హామీల అమలుపై కలెక్టర్లకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వనున్నారు. 

నిరుపేదలు, అట్టడుగు వర్గాల వారికి ప్రభుత్వ పథకాల ఫలాలు దక్కేలా పాలనా యంత్రాంగాన్ని క్షేత్ర స్థాయిలోకి తీసుకెళ్లేందుకు, ప్రభుత్వ పని తీరును మరింత మెరుగుపర్చడం, జవాబుదారీగా ఉండేలా ప్రజా పాలన కార్యక్రమాన్ని చేపడుతున్నారు. ఈ సమావేశానికి స్థానిక సంస్థల అదనపు కలెక్టర్లను కూడా ఆహ్వానించారు. 

డిసెంబర్ 28 నుండి 2024 జనవరి 6 వరకు ( సెలవు రోజులు మినహాయించి మొత్తం 8 పనిదినాలు) ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు, తిరిగి మధ్యాహ్నం 2 గంటలనుండి సాయంత్రం 6 గంటలవరకు ఈ ప్రజాపాలన గ్రామ సభలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. అన్ని గ్రామ పంచాయితీలు, మున్సిపల్ వార్డులలో రోజుకు రెండు చొప్పున అధికారులతో కూడిన బృందాలు పర్యటిస్తాయి.

 ఈ ప్రజాపాలన కార్యక్రమానికి స్థానిక సర్పంచ్/ కార్పొరేటర్/ కౌన్సిలర్ లను ఆహ్వానించడంతోపాటు సంబంధిత ప్రజా ప్రతినిధులందరూ విధిగా పాల్గొనేలా చర్యలు తీసుకొనున్నారు. ఈ గ్రామ సభల్లో వచ్చిన ప్రతి దరఖాస్తును పరిశీలించి వాటిని ప్రత్యేకమైన నెంబర్ ఇవ్వడంతోపాటు వాటిని కంప్యూటరైజ్ చేయనున్నారు. ఆదివారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఈ సమావేశం జరుగునున్నది. ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతోపాటు మంత్రులు, వివిధ శాఖల కార్యదర్శులు, సంబంధిత అధికారులు పాల్గొనున్నారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios