ఈ నెల 8న ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన నేపథ్యంలో వరంగల్ పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధాని మోడీ పర్యటించే ప్రాంతాల్లో గగనతలాన్ని నో ఫ్లై జోన్‌గా ప్రకటిస్తున్నట్లు వరంగల్ పోలీస్ కమీషనర్ ఏవీ రంగనాథ్ ఆదేశాలు జారీ చేశారు.

ఈ నెల 8న ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణకు రానున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా వరంగల్, ఖాజీపేట, హనుమకొండల్లో ఆయన పలు కార్యక్రమాల్లో పర్యటించనున్నారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో వరంగల్ పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే ప్రధాని మోడీ పర్యటించే ప్రాంతాల్లో గగనతలాన్ని నో ఫ్లై జోన్‌గా ప్రకటిస్తున్నట్లు వరంగల్ పోలీస్ కమీషనర్ ఏవీ రంగనాథ్ ఆదేశాలు జారీ చేశారు. దీని ప్రకారం.. ఇవాళ్టీ నుంచి 8వ తేదీ వరకు వరంగల్, హనుమకొండ జంట నగరాల్లో 20 కిలోమీటర్ల వ్యాసార్ధంలో గగనతలాన్ని నో ఫ్లై జోన్‌గా ప్రకటిస్తున్నట్లు సీపీ తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 

ఈ ఆదేశాల ప్రకారం.. డ్రోన్, రిమోట్ కంట్రోల్‌తో పనిచేసే మైక్రో లైట్ ఎయిర్ క్రాఫ్ట్, పారాగ్లైడర్ వంటి వాటిని ఎగురవేయడం నిషేధం. ఈ ఆదేశాలను ధిక్కరించిన వ్యక్తులు, సంస్థలపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని రంగనాథ్ హెచ్చరించారు. అంతేకాదు.. వరంగల్, హనుమకొండ, ఖాజీపేట పరిధిలో 144 సెక్షన్ అమలు చేస్తున్నట్లు వరంగల్ పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. దీని ప్రకారం నలుగురికంటే ఎక్కువ మంది గుమిగూడటం, ర్యాలీ, సభలు, సమావేశాలు , మైకులు, స్పీకర్లు ఏర్పాటు చేయడం నిషేధం. 

ALso Read: ప్ర‌ధాని మోడీ తెలంగాణ ప‌ర్య‌ట‌న‌.. భద్రతా చర్యలపై సీఎస్ సమీక్ష

కాగా.. తెలంగాణలో దాదాపు రూ.6,100 కోట్ల విలువైన పలు కీలకమైన మౌలిక సదుపాయాల అభివృద్ధి ప్రాజెక్టులకు ఆయన శంకుస్థాపన చేస్తారని ప్రకటనలో పీఎంవో పేర్కొంది. వీటిలో రూ. 5,550 కోట్ల విలువైన జాతీయ రహదారి ప్రాజెక్టులు ఉన్నాయి. 68 కిలోమీటర్ల పొడవైన కరీంనగర్-వరంగల్ సెక్షన్ NH-563ని ఇప్పటికే ఉన్న రెండు లేన్‌ల నుండి నాలుగు లేన్‌ల కాన్ఫిగరేషన్‌గా అప్‌గ్రేడ్ చేయడానికి ప్ర‌భుత్వం చ‌ర్య‌లు తీసుకుంది. కాజీపేటలో రైల్వే తయారీ యూనిట్‌కు ప్రధాని శంకుస్థాపన చేస్తార‌ని స‌మాచారం. ప్ర‌ధాని మోడీ అదే రోజు సాయంత్రం 4:15 గంటలకు రాజస్థాన్‌లోని బికనీర్‌కు చేరుకుంటారు. అక్క‌డ దాదాపు రూ.24,300 కోట్ల విలువైన ప‌నుల‌కు శంకుస్థాపన చేయ‌డంతో పాటు ప‌లు బహుళ అభివృద్ధి ప్రాజెక్టులను జాతికి అంకితం చేస్తారు.