సైబర్ నేరాల కట్టడిలో అగ్రస్థానం.. పోలీసు ట్రైనింగ్ పై డీజీపీ అంజనీకుమార్ కీలక వ్యాఖ్యలు
Hyderabad: కొత్తగా పోలీసు బాధ్యతలు చేపట్టేవారికి మంచి శిక్షణ ఇవ్వడం అంటే సమాజానికి ఉత్తమ సేవలు అందించడమేననీ, శిక్షణకు హాజరుకానున్న ఎస్సై, కానిస్టేబుళ్లకు పోలీసు కళాశాలల్లోని సిబ్బంది మంచి విషయాలను బోధించాలని తెలంగాణ డీజీపీ అంజనీకుమార్ సూచించారు. రాష్ట్రంలో 14,881 మంది ఎస్సై, కానిస్టేబుళ్ల నియామక ప్రక్రియ తుదిదశకు చేరుకోగా, వీరికి సెప్టెంబరు, అక్టోబరు నెలల్లో శిక్షణ మొదలుకానుంది.
Telangana DGP Anjani Kumar: సాంకేతిక వినియోగం గణనీయంగా పెరుగుతున్నందున ప్రపంచవ్యాప్తంగా సైబర్ నేరాలు పెరుగుతున్నాయని తెలంగాణ డీజీపీ అంజనీకుమార్ స్పష్టం చేశారు. దీని ప్రభావం రాష్ట్రంలోనూ ఉందనీ, ఇక్కడ కూడా సైబర్ నేరాల సంఖ్య పెరుగుతోందన్నారు. రాష్ట్రంలో నేరాలు, ఫంక్షనల్ వర్టికల్స్‌పై అన్ని జిల్లాల ఎస్పీలు, కమిషనర్లతో డీజీపీ మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ సైబర్‌నేరాలకు సంబంధించి కేసులు నమోదు చేయడంలో తెలంగాణ దేశంలోనే ముందుందనీ, ఈ తరహా నేరాలు అరికట్టడంలోనూ రాష్ట్ర పోలీసు యంత్రాంగం దేశంలో అగ్రస్థానంలో ఉందన్నారు.
రాష్ట్రంలో దర్యాప్తులో ఉన్న కేసులు 52.01 శాతానికి తగ్గాయనీ, పోక్సో, ఎస్సీ, ఎస్టీ కేసులు కూడా గణనీయంగా తగ్గాయన్నారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో వీఐపీల పర్యటన సందర్భంగా తగు జాగ్రత్తలు తీసుకోవాలనీ, సామాజిక మాధ్యమాల్లో వచ్చే ప్రతికూల వార్తలను గమనిస్తూ ఎప్పటికప్పుడు వివరణ ఇవ్వాలని అంజనీకుమార్ సూచించారు. అదనపు డీజీలు మహేష్‌భగవత్, అభిలాష బిస్త్, ఐజీలు షానవాజ్ ఖాసీం పాల్గొన్నారు. పోగొట్టుకున్న సెల్ఫోన్ల ఆచూకీ తిరిగి రాబట్టి బాధితులకు అందించడంతో పాటు, కృషి బ్యాంకు డిపాజిటర్లను గుర్తించి వారికి డబ్బు అందజేసిన సీఐడీ పోలీసులను డీజీపీ అభినందించి, ప్రశంసా పత్రాన్ని అందించారు.
కొత్తగా పోలీసు బాధ్యతలు చేపట్టేవారికి మంచి శిక్షణ ఇవ్వడం అంటే సమాజానికి ఉత్తమ సేవలు అందించడమేననీ, శిక్షణకు హాజరుకానున్న ఎస్సై, కానిస్టేబుళ్లకు పోలీసు కళాశాలల్లోని సిబ్బంది మంచి విషయాలను బోధించాలని తెలంగాణ డీజీపీ అంజనీకుమార్ సూచించారు. రాష్ట్రంలో 14,881 మంది ఎస్సై, కానిస్టేబుళ్ల నియామక ప్రక్రియ తుదిదశకు చేరుకోగా, వీరికి సెప్టెంబరు, అక్టోబరు నెలల్లో శిక్షణ మొదలుకానుంది. ఈ ఏర్పాట్లపై చర్చించేందుకు డీజీపీ మంగళవారం 28 పోలీసు శిక్షణ కళాశాలల ప్రిన్సిపాళ్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందనీ, అందులో భాగంగా 2018లో మొత్తం 11,023 మంది పోలీస్ కానిస్టేబుళ్లు, సబ్ ఇన్స్పెక్టర్లు, 16,282 మంది పోలీసులను నియమించామన్నారు. 2020లో కానిస్టేబుళ్లు.. ప్రస్తుత ఏడాది 2023-24లో 14,881 మంది పోలీసు అధికారుల నియామకానికి ప్రభుత్వం ఆదేశించిందని తెలిపారు. శిక్షణా కార్యక్రమం ప్రారంభానికి ముందే అన్ని పీటీసీలు మౌలిక వసతులు, శిక్షణకు అవసరమైన మెటీరియల్స్, వసతి, ఇతర సౌకర్యాలను సిద్ధం చేయాలని ఆదేశించారు. భవనాల మరమ్మతులు, వైట్‌వాష్, మరుగుదొడ్లు, రీడింగ్‌రూమ్ తదితర సౌకర్యాల కోసం తగిన నిధులు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు.
కొత్త పోలీసులకు నాణ్యమైన శిక్షణ ఇస్తే రాబోయే 30 నుంచి 35 ఏళ్ల పాటు సమాజానికి మంచి సేవలందిస్తారు. యువ అధికారులకు ప్రధానోపాధ్యాయులు ఆదర్శంగా నిలవాలన్నారు. ఏ ఇతర రాష్ట్రంలో లేనివిధంగా తెలంగాణలో పోలీసు నియామకాల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించామనీ, మహిళా ట్రైనీ పోలీస్ కానిస్టేబుళ్లకు శిక్షణ ఇచ్చేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని అంజనీకుమార్ పునరుద్ఘాటించారు.