- Home
- Telangana
- Weather Update: బంగాళాఖాతంలో కొత్త అల్పపీడనం.. తెలంగాణ, ఏపీలో వర్షాలు, ఈదురుగాలుల అలర్ట్
Weather Update: బంగాళాఖాతంలో కొత్త అల్పపీడనం.. తెలంగాణ, ఏపీలో వర్షాలు, ఈదురుగాలుల అలర్ట్
Weather Update: ఏపీ, తెలంగాణలోని పలు ప్రాంతాల్లో శనివారం వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. 5 తెలంగాణ జిల్లాల్లో వర్షాలు, ఏపీలో డిసెంబర్ 4 వరకు వానలు ఉంటాయని ఐఎండీ హెచ్చరికలు ఇచ్చింది.

తెలంగాణ జిల్లాల్లో వానలు, ఈదురుగాలుల అలర్ట్
చలితో పాటు తెలంగాణలో మళ్లీ వర్షాలు మొదలయ్యాయి. హైదరాబాద్‌లోని భారత వాతావరణ శాఖ (IMD) వెదర్ బులెటిన్ ప్రకారం.. శనివారం తెలంగాణలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే ఛాన్స్ ఉంది. ముఖ్యంగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో వానలు పడే ఛాన్స్ ఉంది.
ఈ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున జనం అలర్ట్‌గా ఉండాలని ఐఎండీ పేర్కొంది. ఆదివారం నుంచి డిసెంబర్ 4 వరకు రాష్ట్రంలో పొడి వాతావరణం ఉంటుందని, ఆ ఆరు రోజులకు ఎలాంటి ప్రత్యేక హెచ్చరికలు లేవని వాతావరణ శాఖ స్పష్టం చేసింది.
నవంబర్ 30న అల్పపీడనం.. డిసెంబర్ 2 నాటికి వాయుగుండం
బంగాళాఖాతంలో మరో సిస్టమ్ యాక్టివ్ అవుతోంది. దక్షిణ అండమాన్ సముద్రంపై ఏర్పడే ఉపరితల ఆవర్తన ప్రభావంతో నవంబర్ 30 నాటికి అండమాన్, ఆగ్నేయ బంగాళాఖాతంలో కొత్త అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) తెలిపింది.
ఇది డిసెంబర్ 2వ తేదీ నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడి, పశ్చిమ-వాయవ్య దిశగా తమిళనాడు లేదా శ్రీలంక తీరాల వైపు కదిలే సూచనలు ఉన్నాయని పేర్కొంది. అయితే వివిధ అంతర్జాతీయ వాతావరణ మోడల్స్ ప్రకారం, ఈ వాయుగుండం తీరాన్ని తాకకముందే సముద్రంలోనే బలహీనపడే ఛాన్స్ ఉన్నప్పటికీ, తెలుగు రాష్ట్రాలపై దీని ప్రభావం మాత్రం తప్పకుండా ఉంటుందని అధికారులు చెప్పారు.
ఏపీలో డిసెంబర్ 4 వరకు వర్షాలు, పొగమంచు అలర్ట్
అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొన్న వివరాల ప్రకారం.. డిసెంబర్ 4 ఉదయం వరకు కోస్తాంధ్ర, యానాం, రాయలసీమలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ సమాచారం ప్రకారం శనివారం నెల్లూరు, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లోని కొన్ని చోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడనున్నాయి.
మార్కాపురం, ప్రకాశం జిల్లాతో పాటు మిగతా రాయలసీమ జిల్లాల్లో చెదురుమదురుగా తేలికపాటి జల్లులు పడొచ్చు. వర్షాలు పడే సమయంలో గంటకు 30-40 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే ఛాన్స్ ఉంది. అలాగే కోస్తాంధ్ర, యానాం, రాయలసీమలో నవంబర్ 28 నుంచి డిసెంబర్ 2 వరకు తెల్లవారుజామున తేలికపాటి పొగమంచు పడే అవకాశం ఉండగా, డిసెంబర్ 2 నుంచి 4 వరకు పొగమంచు హెచ్చరికలు లేవు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు, చిత్తూరు, వైఎస్ఆర్, అనంతపురం, కర్నూలు జిల్లాల ఇదే వాతావరణం వుండనుంది.
ప్రజలకు అధికారుల అలర్ట్
తెలంగాణలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు వచ్చే జిల్లాల్లో ప్రజలు వాతావరణ అప్డేట్స్ గమనిస్తూ ఉండాలి. ప్రతికూల వాతావరణం ఉన్నప్పుడు సేఫ్ ప్లేస్‌లోకి వెళ్లడానికి సిద్ధంగా ఉండాలి, ముఖ్యంగా రక్షణ లేని నిర్మాణాల దగ్గర నిలబడకుండా జాగ్రత్త పడాలి. ఏపీలో రైతులు పంటల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. వ్యవసాయ సూచనల కోసం ఐఎండీ (IMD) అందించే ‘మేఘదూత్’ యాప్, మెరుపుల హెచ్చరికల కోసం ‘దామిని’ యాప్, వాతావరణ సమాచారం కోసం ‘మౌసం’ యాప్‌లను ఉపయోగించుకోవచ్చని అధికారులు సూచించారు.











