Telangana: తెలంగాణలో విద్యార్థులకు గుడ్ న్యూస్.. ముఖ్యమంత్రి విదేశీ ఉపాధి పథకం
Telangana: విదేశాల్లో ఉద్యోగం సంపాదించాలనే లక్ష్యంతో ఉన్న తెలంగాణ నిరుద్యోగ యువతకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఆర్థిక ఇబ్బందుల కారణంగా విదేశీ ఉద్యోగ అవకాశాలను అందుకోలేకపోతున్న వారికి చేయూతనిచ్చేందుకు ముఖ్యమంత్రి విదేశీ ఉపాధి పథకం ప్రారంభించింది.

తొలి ఏడాది 7 వేల మందికి అవకాశం
2026–27 ఆర్థిక సంవత్సరంలో 7,000 మంది నిరుద్యోగులకు ఆర్థిక సాయం అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో 5,880 మందిని నేరుగా విదేశీ ఉద్యోగాలకు, మరో 1,120 మందిని విదేశీ భాషా నైపుణ్యం అవసరమైన ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు. అభ్యర్థులకు విదేశీ భాషల్లో శిక్షణ, వృత్తి నైపుణ్యాల పెంపు, అవసరమైన ధ్రువీకరణ పత్రాల పొందడంలో TOMCOM సహకరిస్తుంది. విదేశీ సంస్థలతో సమన్వయం చేసుకొని చట్టబద్ధమైన ఉద్యోగ అవకాశాలు కల్పించనుంది.
రెండు కేటగిరీలు.. రూ.1.75 లక్షల వరకు సబ్సిడీ
ఈ పథకంలో అభ్యర్థులను రెండు విభాగాలుగా విభజించారు. మొదటి కేటగిరీలో భాగంగా ప్రత్యేక విదేశీ భాషా శిక్షణ అవసరం లేకుండా ఉద్యోగాలకు వెళ్లేవారికి వీసా, విమాన ప్రయాణ ఖర్చుల్లో 50 శాతం సబ్సిడీ ఇస్తారు. గరిష్ఠంగా రూ.50 వేలు అందుతుంది. రెండో కేటగిరీలో భాగంగా విదేశీ భాషల్లో ప్రావీణ్యం అవసరమైన ఉద్యోగాలకు వెళ్లేవారికి గరిష్ఠంగా రూ.1.75 లక్షల వరకు సాయం అందుతుంది. రెండో కేటగిరీలో TOMCOM గుర్తించిన సంస్థల్లో భాషా శిక్షణ తీసుకునేవారికి శిక్షణ ఖర్చులో 50 శాతం సబ్సిడీ ఇస్తారు. ఇప్పటికే భాషా పరీక్షల్లో ఉత్తీర్ణులైన వారికి వీసా, విమాన ప్రయాణ ఖర్చుల్లో 50 శాతం అందిస్తారు. ఈ రెండు అవకాశాల్లో ఏదో ఒకదానిని మాత్రమే ఎంచుకోవాలి. మిగిలిన 50 శాతం ఖర్చును అభ్యర్థులే భరించాలి. ఆర్థిక స్థోమత లేనివారికి బ్యాంకుల ద్వారా రుణాలు అందించే ఏర్పాట్లు కూడా చేయనున్నారు.
ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు?
ఈ పథకానికి దరఖాస్తు చేసుకునేవారు 18 నుంచి 40 ఏళ్ల మధ్య వయసు కలిగి ఉండాలి. తెలంగాణ స్థానికులై ఉండటంతో పాటు ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు రాష్ట్రంలోనే చదివి ఉండాలి. ఐటీఐ అర్హతతో వెళ్లేవారు తెలంగాణలోని గుర్తింపు పొందిన సంస్థల్లోనే కోర్సు పూర్తి చేయాలి. అభ్యర్థులు ప్రభుత్వం నిర్ణయించిన ఈడబ్ల్యూఎస్ ఆదాయ పరిమితికి లోబడి ఉండాలి. సంబంధిత వృత్తిలో కనీసం రెండేళ్ల అనుభవం ఉండాలి. దరఖాస్తు సమయంలో పాస్‌పోర్టుకు కనీసం ఆరు నెలల గడువు ఉండాలి. ఉద్యోగ సంస్థలు నిర్వహించే వైద్య పరీక్షల్లోనూ అర్హత సాధించాలి. నిర్మాణం, తయారీ, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, రవాణా, లాజిస్టిక్స్, వైద్య సహాయక సేవలు, హోటళ్లు, పర్యాటకం, నిర్వహణ, గృహ సేవలు తదితర రంగాల్లో ఉద్యోగాలకు ఈ పథకం వర్తిస్తుంది.
ఆన్లైన్లోనే దరఖాస్తులు.. 30 రోజుల్లో ఎంపిక
TOMCOM ప్రత్యేక ఆన్లైన్ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఆధార్, రేషన్ కార్డు లేదా ఆహార భద్రత కార్డు, ఆదాయ ధ్రువీకరణ పత్రం, పాస్‌పోర్టు, విద్యార్హతలు, పని అనుభవానికి సంబంధించిన పత్రాలను సమర్పించాలి. అవసరమైనవారు విదేశీ భాషా ప్రావీణ్య ధ్రువీకరణ పత్రాలను కూడా జతచేయాలి. ఆఫ్‌లైన్ దరఖాస్తులకు అనుమతి లేదు. దరఖాస్తులను జిల్లా ఉపాధి కల్పన అధికారులు, ఆర్డీవో లేదా తహసీల్దార్లు పరిశీలిస్తారు. జిల్లాస్థాయి కమిటీ అర్హులను గుర్తించి రాష్ట్రస్థాయి కమిటీకి సిఫారసు చేస్తుంది. తుది జాబితాకు రాష్ట్రస్థాయి కమిటీ ఆమోదం తెలుపుతుంది. రిజిస్ట్రేషన్ పూర్తయిన లేదా దరఖాస్తుల గడువు ముగిసిన 30 రోజుల్లో ఎంపిక ప్రక్రియను పూర్తి చేస్తారు.
మహిళలు, దివ్యాంగులకు ప్రత్యేక కేటాయింపులు
ఈ పథకం కింద ఒక రేషన్ కార్డుపై ఒక కుటుంబంలో ఒక్కరికి మాత్రమే సబ్సిడీ లభిస్తుంది. మొత్తం లబ్ధిదారుల్లో మహిళలకు 33.33 శాతం, దివ్యాంగులకు 5 శాతం అవకాశాలు కేటాయించారు. ఎంపికైన అభ్యర్థులు ఉద్యోగ నియామక పత్రం, వీసా, ప్రయాణానికి సంబంధించిన ఆధారాలు సమర్పించిన తర్వాత అర్హత మేరకు సబ్సిడీ నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తారు. రాష్ట్రస్థాయి కమిటీతో పాటు 33 జిల్లాల్లో కలెక్టర్ల ఆధ్వర్యంలో ప్రత్యేక కమిటీలు పథకాన్ని పర్యవేక్షిస్తాయి. అయితే పథకంలో నమోదు చేసుకోకముందు చేసిన ఖర్చులకు సబ్సిడీ వర్తించదు. ప్రతి అంశానికి ఒక్కసారి మాత్రమే ఆర్థిక సాయం అందుతుంది. తప్పుడు సమాచారం, నకిలీ పత్రాలు సమర్పించినా లేదా నిధులను దుర్వినియోగం చేసినా ఎంపిక రద్దు చేసి, ఇప్పటికే ఇచ్చిన సబ్సిడీని తిరిగి వసూలు చేస్తారు.













