పార్లమెంట్ సీట్ల పెంపు తెలంగాణ, దక్షిణాది రాష్ట్రాల ప్రయోజనాలను కాపాడేలా ఉండాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. ఎన్డిఏ కూటమి డీలిమిటేషన్ ప్రతిపాదనకు బీఆర్ఎస్ సపోర్ట్ ఇస్తుందని, దీని ద్వారా తెలంగాణ లోక్సభ స్థానాలు 26కు పెరుగుతాయని ఆయన తెలిపారు.
లోక్ సభ నియోజకవర్గాల (ఎంపి స్థానాల) పునర్విభజన (డీలిమిటేషన్) పై భారత రాష్ట్ర సమితి (BRS) వైఖరిని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (KTR) మరోసారి స్పష్టం చేశారు. ముగ్గురు బిఆర్ఎస్ ఎంపీలు (రాజ్యసభ సభ్యులు) డీలిమిటేషన్ బిల్లుకు అనుకూలంగా ఓటు వేస్తారని ఆయన ప్రకటించారు. తెలంగాణ ప్రయోజనాలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తూ, ప్రతిపాదిత విధానంలోని రక్షణలను పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేటీఆర్ చెప్పారు.
ఇక మహిళా రిజర్వేషన్లకు కూడా బీఆర్ఎస్ సపోర్ట్ ఎప్పుడూ ఉంటుందని కేటీఆర్ మరోసారి స్పష్టం చేశారు. మహిళలకు రాజకీయాల్లో ఎక్కువ ప్రాతినిధ్యం కల్పించాల్సిన అవసరం ఉందని నొక్కిచెప్పారు.
తెలంగాణకు అన్యాాయం జరిగితే సహించబోం : కేటీఆర్
డీలిమిటేషన్ ప్రక్రియలో తెలంగాణ, దక్షిణాది రాష్ట్రాల ప్రయోజనాలను పూర్తిగా కాపాడాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. పార్లమెంట్ సీట్ల పెంపులో రాష్ట్రానికి ఎలాంటి అన్యాయం జరిగినా సహించేది లేదని తేల్చిచెప్పారు. పార్లమెంట్లో దక్షిణాది ప్రాతినిధ్యం తగ్గకూడదని బీఆర్ఎస్ మొదటి నుంచి చెబుతోందని ఆయన గుర్తుచేశారు.
ప్రస్తుతం పార్లమెంట్లో ఉన్న దక్షిణాది రాష్ట్రాల 24 శాతం వాటాను కాపాడాలని కేటీఆర్ నొక్కిచెప్పారు. లోక్సభ సభ్యుల సంఖ్యను పెంచే ఏ ప్రయత్నమైనా దక్షిణాది రాజకీయ ప్రాతినిధ్యాన్ని దెబ్బతీయకూడదని ఆయన అన్నారు.
తెలంగాణ ఎంపీ సీట్లు 26 కు పెంపు : కేటీఆర్
పార్లమెంట్ సీట్లను 50 శాతం పెంచే ప్రతిపాదన, 2051 వరకు అంతర్రాష్ట్ర ప్రాతినిధ్య నిష్పత్తిని మార్చకుండా ఉండేలా రక్షణ కల్పించడం వంటివి దక్షిణాది రాష్ట్రాల ప్రధాన ఆందోళనలను పరిష్కరిస్తాయని కేటీఆర్ వివరించారు. ఈ ప్రతిపాదన ద్వారా దక్షిణాది రాష్ట్రాల ప్రస్తుత వాటాను తగ్గించకుండానే పార్లమెంట్ ప్రాతినిధ్యాన్ని పెంచుకునే అవకాశం ఉంటుందని ఆయన చెప్పారు. దీనివల్ల తెలంగాణకు కలిగే ప్రయోజనాలను కేటీఆర్ వివరిస్తూ… ఈ ప్రతిపాదన ద్వారా లోక్సభలో రాష్ట్ర ప్రాతినిధ్యం ప్రస్తుతమున్న 17 నుంచి 26 సీట్లకు పెరుగుతుందన్నారు. ఈ పెంపుతో దేశ అత్యున్నత చట్టసభలో తెలంగాణ గొంతుక మరింత బలంగా వినిపిస్తుందని, అదే సమయంలో రాష్ట్ర రాజకీయ ప్రయోజనాలకు రక్షణ ఉంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
డీలిమిటేషన్, దక్షిణాది రాష్ట్రాల రాజకీయ ప్రాతినిధ్యంపై దాని ప్రభావం గురించి చర్చ జరుగుతున్న సమయంలో కేటీఆర్ చేసిన ఈ ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది. పార్లమెంట్ సీట్ల పెంపు వల్ల వివిధ ప్రాంతాల మధ్య ఉన్న ప్రాతినిధ్య బ్యాలెన్స్ దెబ్బతింటుందనే ఆందోళనలు దక్షిణాదిలో వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో దక్షిణాది రాష్ట్రాల ఉమ్మడి వాటాను కాపాడుతూనే, తెలంగాణకు తగిన ప్రాతినిధ్యం దక్కేలా చూడాలని బీఆర్ఎస్ కోరుతోంది.
లోక్సభ సీట్లు 17 నుంచి 26కు పెరిగితే పార్లమెంట్లో తెలంగాణ బలం గణనీయంగా పెరుగుతుంది. ప్రాంతీయ ప్రయోజనాలను సమతుల్యం చేయడం, తెలంగాణ రాజకీయ ప్రాతినిధ్యాన్ని కాపాడటం, మహిళా రిజర్వేషన్లకు సపోర్ట్ ఇవ్వడం వంటి అంశాలకు బీఆర్ఎస్ ఇస్తున్న ప్రాధాన్యంను కేటీఆర్ ప్రకటన ప్రతిబింబిస్తోంది. పార్లమెంట్ ప్రాతినిధ్యానికి సంబంధించిన విషయాలపై నిర్ణయం తీసుకునేటప్పుడు, రాష్ట్ర ప్రయోజనాలకే బీఆర్ఎస్ అత్యధిక ప్రాధాన్యం ఇస్తుందని కేటీఆర్ స్పష్టం చేశారు.












