తెలంగాణలో కరోనా జాడలు బయటపడిన నేపథ్యంలో మంత్రి ఈటల రాజేందర్ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రానికి చెందిన ఓ 24 ఏళ్ల వ్యక్తి బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడని అతనికి కరోనా సోకినట్లు ఈటల తెలిపారు.

కంపెనీ పని మీద ఫిబ్రవరి 15న వెళ్లిన ఆయన.. తిరిగి బెంగళూరుకు అక్కడి నుంచి హైదరాబాద్‌కు వచ్చారని ఈటల చెప్పారు. తీవ్రమైన జ్వరం రావడంతో వైద్య పరీక్షలు చేయించుకుని మందులు వాడారని, అయినప్పటికీ తగ్గకపోవడంతో ఆదివారం గాంధీ ఆసుపత్రికి వెళ్లి పరీక్షలు చేయించుకున్నట్లు రాజేందర్ చెప్పారు.

Also Read:హైదరాబాద్‌లో కరోనా.. ఎవరూ భయపడొద్దు: మంత్రి ఈటల

అతని రక్త నమూనాలను సేకరించి పుణేకు పంపితే కరోనా పాజిటివ్‌గా తేలినట్లు మంత్రి పేర్కొన్నారు. దీనిపై భారత ప్రభుత్వంతో పాటు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సమాచారం అందించినట్లు వెల్లడించారు.

ప్రస్తుతం టెక్కీ పరిస్థితి నిలకడగానే ఉందని, అది వ్యాప్తి చెందకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని ఈటల స్పష్టం చేశారు. వైద్య పరీక్షల నిమిత్తం హైదరాబాద్‌లోని గాంధీ, చెస్ట్, ఫీవర్ ఆసుపత్రుల్లో 40 పడకలు ఏర్పాటు చేశామని మంత్రి తెలిపారు.

Also Read:వైరల్: టాలీవుడ్ డైరెక్టర్ కి కరోనా.. అసలు నిజమేంటంటే..?

బాధితుడు తన కుటుంబసభ్యులతో కలిసి కొన్ని రోజులు గడిపారని... దీంతో ఆయన కుటుంబసభ్యులు, సహచరుల వివరాలను సేకరిస్తున్నట్లు వెల్లడించారు. దీనితో పాటు టెక్కీ ప్రయాణించిన బస్సులోని ప్రయాణీకుల వివరాలు సేకరిస్తున్నట్లు మంత్రి చెప్పారు.

ఆ బస్సులో అతనితో పాటు మరో 27 మంది ప్రయాణించినట్లు తెలిసిందన్నారు. చికిత్స అందించిన వారి వివరాలతో పాటు యువకుడు సంచరించిన ప్రాంతాల్లో 80 మందిని గుర్తించామని ఈటల రాజేందర్ చెప్పారు. బహిరంగ ప్రదేశాల్లో దగ్గడం, తుమ్మడం లాంటివి చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి ప్రజలకు విజ్ఞప్తి చేశారు.