కోవిడ్-19 (కరోనా వైరస్) దీని పేరు చెబితేనే ప్రస్తుతం ప్రపంచం వణికిపోతోంది. చైనాలో బయటపడిన ఈ మహమ్మారి ప్రస్తుతం 54 దేశాలకు విస్తరించి వేల మందిని బలి తీసుకుంది. దీనికి అడ్డుకట్ట వేసేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టింది. అటు భారత ప్రభుత్వం కూడా అన్ని ఎయిర్‌పోర్టుల్లో హై అలర్ట్ ప్రకటించింది.

విదేశాల నుంచి వచ్చిన వారిని క్షుణ్ణంగా పరీక్షించిన తర్వాతే బయటకు వదులుతోంది. ఈ క్రమంలో టాలీవుడ్ డైరెక్టర్, సోషల్ యాక్తివిస్ట్ అయిన సునీత కృష్ణన్ కి ఈ వైరస్ లక్షణాలున్నాయనే వార్త వైరల్ అయింది. దీంతో ఆమె ఈ విషయంపై స్పందించి సోషల్ మీడియా వేదికగా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది. మీడియాలో ఇలాంటి ఫేక్ వార్తలు రావడంపై ఆమె మండిపడింది.

హైదరాబాద్‌లో ఒకరికి కరోనా వైరస్: నిర్ధారించిన అధికారులు

మీడియా అంటే బాధ్యతగా వ్యవహరించాలంటూ క్లాస్ పీకింది. అనంతరం.. ఈరోజు ఉదయాన్నే బ్యాంకాక్ కి వెళ్లి తిరిగి వచ్చానని.. దగ్గు ఉండడంతో గాంధీహాస్పిటల్ కి వెళ్లినట్లు చెప్పింది. హాస్పిటల్ నిర్వాహకులు కరోనా సోకిందేమోననే అనుమానంతో తనను ఐసోలేషన్ వార్డ్ లో జాయిన్ చేశారని చెప్పారు. కరోనా వైరస్ కి సంబంధించిన అన్ని పరీక్షలు నిర్వహించారని.. రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తున్నట్లు చెప్పారు.

ఇంతలోనే తనకు కరోనా సోకినట్లు వార్తలు రావడంతో ఆమె ఆ వార్తలను ఖండించే ప్రయత్నం చేశారు. సునీతా కృష్ణన్ గతంలో 'నా బంగారు తల్లి', 'రక్తం' వంటి చిత్రాలను తెరకెక్కించారు. విమెన్ ట్రాఫికింగ్ కాన్సెప్ట్ తో తీసిన 'నా బంగారు తల్లి' సినిమా దర్శకురాలిగా ఆమెకి మంచి పేరు తీసుకొచ్చింది. ఎన్నో అవార్డులను సైతం దక్కించుకున్నారు.