వరంగల్‌ మెడికల్ విద్యార్ధిని ప్రీతి కుటుంబ సభ్యులను నిమ్స్‌లో తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పరామర్శించారు.  ర్యాగింగ్ జరిగిందని అంటున్నారని.. కానీ ఇప్పుడే చెప్పలేమని దర్యాప్తు జరుగుతోందని ఆమె చెప్పారు. 

వైద్య విద్యార్ధిని ప్రీతి ఆత్మహత్యాయత్నం బాధాకరమన్నారు తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్. గురువారం నిమ్స్‌లో చికిత్స పొందుతున్న ప్రీతిని , ఆమె కుటుంబ సభ్యులను గవర్నర్ పరామర్శించారు. అనంతరం తమిళిసై మీడియాతో మాట్లాడుతూ.. ఇది చాలా సున్నితమైన సమస్య అన్నారు. అన్ని కోణాల నుంచి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. ఓ వైద్య విద్యార్ధిని ఈ పరిస్ధితుల్లో వుండటం దురదృష్టకరమని తమిళిసై ఆవేదన వ్యక్తం చేశారు. ప్రీతి క్షేమంగా కోలుకుని తిరిగి రావాలని గవర్నర్ ఆకాంక్షించారు. ప్రీతి ప్రతిభ గల విద్యార్ధిని అని.. ఇటీవలే యూపీఎస్సీ పరీక్షల్లో పాస్ కావడమే కాకుండా, ఇంటర్వ్యూకు కూడా ఆమె హాజరయ్యారని తమిళిసై ప్రశంసించారు. ఇలాంటి పరిస్ధితుల్లో ఈ ఘటన దురదృష్టకరమన్నారు. ర్యాగింగ్ జరిగిందని ఇప్పుడే చెప్పలేమని దర్యాప్తు జరుగుతోందని ఆమె చెప్పారు. 

మరోవైపు.. ప్రీతి ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా వుందని నిమ్స్ వైద్యులు తెలిపారు. ఈ మేరకు గురువారం హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. ప్రీతి మల్టీ ఆర్గాన్స్ పూర్తిగా ఫెయిల్ అయ్యాయని.. వెంటిలేటర్‌పై వుంచి, ఎక్మోపైనే చికిత్స అందిస్తున్నామని నిమ్స్ వైద్యులు తెలిపారు. ఎక్మో, సీఆర్‌ఆర్‌పీ ద్వారా కిడ్నీ ఫంక్షన్ చేయిస్తున్నామని డాక్టర్లు వెల్లడించారు. ఇప్పటికీ ప్రీతి పరిస్థితి అత్యంత విషమంగానే వుందని తెలిపారు. 

ALso REad: మల్టీ ఆర్గాన్స్ ఫెయిల్, ఎక్మోపై చికిత్స.. ప్రీతి ఆరోగ్యం అత్యంత విషమం : నిమ్స్ వైద్యుల హెల్త్ బులెటిన్

ఇక, మహబూబాబాద్ జిల్లాకు చెందిన ప్రీతి.. వరంగల్‌లోని కాకతీయ మెడికల్ కాలేజీలో పీజీ (అనస్థీషియా) చదువుతోంది. మహాత్మాగాంధీ మెమోరియల్ (ఎంజీఎం) ఆస్పత్రిలో శిక్షణలో ఉన్న సమయంలో బుధవారం ఉదయం 6:30 గంటల ప్రాంతంలో విషపూరిత ఇంజక్షన్‌ వేసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లుగా తెలుస్తోంది. ప్రీతిని అపస్మారక స్థితిలో ఉండటం గమనించిన ఆసుపత్రి సిబ్బంది సీనియర్ వైద్యులక సమాచారం అందించారు. వారు ఆమెను అత్యవసర వార్డుకు తరలించి చికిత్స అందించారు.

దీనిపై ప్రీతి సహవిద్యార్థులు కేఎంసీ ప్రిన్సిపాల్ డాక్టర్ మోహన్ దాస్, ఎంజీఎం ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ చంద్రశేఖర్‌లకు సమాచారం అందించారు. ఈ ఘటనపై అప్రమత్తమైన వెంటనే డాక్టర్ ప్రీతిని వెంటిలేటర్‌పై ఉంచి సీటీ స్కాన్‌తో పాటు అన్ని పరీక్షలు నిర్వహించామని ఎంజీఎం ఆస్పత్రి సూపరింటెండెంట్ చంద్రశేఖర్ తెలిపారు. పీజీ విద్యార్థి శరీరంపై తమకు ఇంజక్షన్ గుర్తు కనిపించలేదని చెప్పారు. ఇదిలా ఉంటే.. ప్రీతిని మెరుగైన వైద్యం కోసం వరంగల్ నుంచి హైదరాబాద్‌లోని నిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ప్రీతి పరిస్థితి విషమంగానే ఉందని వైద్యులు చెబుతున్నాయి. 

ALso REad: వరంగల్ ప్రీతి కేసు : సైఫ్ అరెస్ట్ .. పోలీసుల చేతికి కీలక వాట్సాప్ ఛాట్, మరిన్ని ఆధారాలు

సీనియర్ విద్యార్థి వేధింపుల వల్లే ప్రీతి ఆత్మహత్యకు యత్నించిందని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపించారు. అయితే సీనియర్ విద్యార్థుల ర్యాగింగ్ ఆరోపణలను కేఎంసీ ప్రిన్సిపాల్ డాక్టర్ మోహన్ దాస్ తోసిపుచ్చారు. సీనియర్ విద్యార్థులు డాక్టర్ ప్రీతిని ఎప్పుడూ ర్యాగింగ్ చేయలేదని.. అయితే ఆమె విధులను సక్రమంగా నిర్వర్తించడం గురించి హెచ్చరించినట్లు చెప్పారు. ఇక, ప్రీతి తండ్రి నరేందర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసు అధికారులు ఆత్మహత్యాయత్నం కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.