వరంగల్ వైద్య విద్యార్ధిని ప్రీతి ఆత్మహత్యాయత్నం కేసుకు సంబంధించి పోలీసులు విచారణను ముమ్మరం చేశారు. ప్రీతి, సైఫ్ వాట్సాప్ ఛాట్‌ను రిట్రీవ్ చేశారు పోలీసులు. అంతేకాకుండా ప్రీతి గదిలో పలు కీలక ఆధారాలను కూడా సేకరించారు.
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన వరంగల్ వైద్య విద్యార్ధిని ప్రీతి ఆత్మహత్యాయత్నం కేసుకు సంబంధించి పోలీసులు విచారణను ముమ్మరం చేశారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న సీనియర్ విద్యార్ధి సైఫ్ దగ్గర నుంచి పోలీసులు వివరాలు సేకరించారు. ఆత్మహత్యాయత్నం చేసిన ప్రీతి గదిని పోలీసులు పరిశీలించారు. ప్రీతి గదిలోని ఆధారాలను సేకరించారు. ఈ క్రమంలో మత్తు ఇంజెక్షన్లు స్వాధీనం చేసుకున్నారు. మత్తు మందు మోతాదుపై ఆమె గూగుల్‌లో సెర్చ్ చేసినట్లుగా గుర్తించారు. గత కొంతకాలం నుంచి ప్రీతిని సైఫ్ వేధించినట్లుగా పోలీసులు ఆధారాలు సేకరించారు. ప్రీతిని అవమానించే విధంగా వాట్సాప్‌లో ఛాటింగ్ చేసినట్లు గుర్తించారు. ప్రీతి, సైఫ్ వాట్సాప్ ఛాట్‌ను రిట్రీవ్ చేశారు అధికారులు. ఇప్పటికే ప్రీతిని సైఫ్ వేధిస్తున్నట్లుగా ఆమె తండ్రి పోలీసులకు తెలిపారు. సైఫ్‌ను పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చారు .
ఇక, మహబూబాబాద్ జిల్లాకు చెందిన ప్రీతి.. వరంగల్‌లోని కాకతీయ మెడికల్ కాలేజీలో పీజీ (అనస్థీషియా) చదువుతోంది. మహాత్మాగాంధీ మెమోరియల్ (ఎంజీఎం) ఆస్పత్రిలో శిక్షణలో ఉన్న సమయంలో బుధవారం ఉదయం 6:30 గంటల ప్రాంతంలో విషపూరిత ఇంజక్షన్ వేసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లుగా తెలుస్తోంది. ప్రీతిని అపస్మారక స్థితిలో ఉండటం గమనించిన ఆసుపత్రి సిబ్బంది సీనియర్ వైద్యులక సమాచారం అందించారు. వారు ఆమెను అత్యవసర వార్డుకు తరలించి చికిత్స అందించారు.
ALso REad: ప్రీతిపై వేధింపులకు పాల్పడినవారిపై చర్యలు తీసుకోవాలి.. ప్రజాసంఘాల ఆందోళ.. నిమ్స్ వద్ద ఉద్రిక్తత..
దీనిపై ప్రీతి సహవిద్యార్థులు కేఎంసీ ప్రిన్సిపాల్ డాక్టర్ మోహన్ దాస్, ఎంజీఎం ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ చంద్రశేఖర్‌లకు సమాచారం అందించారు. ఈ ఘటనపై అప్రమత్తమైన వెంటనే డాక్టర్ ప్రీతిని వెంటిలేటర్‌పై ఉంచి సీటీ స్కాన్‌తో పాటు అన్ని పరీక్షలు నిర్వహించామని ఎంజీఎం ఆస్పత్రి సూపరింటెండెంట్ చంద్రశేఖర్ తెలిపారు. పీజీ విద్యార్థి శరీరంపై తమకు ఇంజక్షన్ గుర్తు కనిపించలేదని చెప్పారు. ఇదిలా ఉంటే.. ప్రీతిని మెరుగైన వైద్యం కోసం వరంగల్ నుంచి హైదరాబాద్‌లోని నిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ప్రీతి పరిస్థితి విషమంగానే ఉందని వైద్యులు చెబుతున్నాయి.
సీనియర్ విద్యార్థి వేధింపుల వల్లే ప్రీతి ఆత్మహత్యకు యత్నించిందని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపించారు. అయితే సీనియర్ విద్యార్థుల ర్యాగింగ్ ఆరోపణలను కేఎంసీ ప్రిన్సిపాల్ డాక్టర్ మోహన్ దాస్ తోసిపుచ్చారు. సీనియర్ విద్యార్థులు డాక్టర్ ప్రీతిని ఎప్పుడూ ర్యాగింగ్ చేయలేదని.. అయితే ఆమె విధులను సక్రమంగా నిర్వర్తించడం గురించి హెచ్చరించినట్లు చెప్పారు. ఇక, ప్రీతి తండ్రి నరేందర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసు అధికారులు ఆత్మహత్యాయత్నం కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
