ప్రస్తుతం ఎండలు మండిపోతూ ఉష్ణోగ్రతలు పైపైకి వెళుతున్నాయి. ఈ క్రమంలో బయట తిరిగేవారు వడదెబ్బల బారినపడే ప్రమాదముంది. దీంతో వడదెబ్బను రాష్ట్ర విపత్తుగా ప్రకటించింది తెలంగాణ సర్కార్. కాబట్టి ఇకపై ఎండల కారణంగా చనిపోయినా ఎక్స్ గ్రేషియా ఇస్తారు... ఎంతో తెలుసా?
Telangana Weather : తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. ఉదయం, సాయంత్రం వేళల్లో తప్పు పగటిపూట రోడ్డుమీదకు రావాలంటే ప్రజలు జంకుతున్నారు. అయితే చిరు వ్యాపారులు, బయటతిరిగే చిరుద్యోగులు ఈ ఎండల్లో పనిచేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే వీరు వడదెబ్బకు గురయ్యే ప్రమాదం ఉంటుంది... ఒక్కోొసారి పరిస్థితి విషమించి ప్రాణాలుకూడా పోవచ్చు. ఇలా వడదెబ్బతో మరణించేవారి కుటుంబాలను ఆదుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం ముందుకువచ్చింది.
ఈ మండుటెండలు, వడగాలులను దృష్టిలో ఉంచుకుని రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. వడదెబ్బను రాష్ట్ర విపత్తుగా పరిగణించాలని నిర్ణయించింది. ఇకపై ఈ ఎండల్లో తిరుగుతూ వడదెబ్బకు గురయితే ప్రభుత్వం సాయం చేయనుంది. వడదెబ్బతో మరణించేవారి కుటుంబాలను ఆదుకోవాలని... రూ.4 లక్షల ఆర్థిక సాయం చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది.
ఇంతకుముందు వడదెబ్బతో మరణిస్తే కేవలం రూ.50 వేల ఆర్థిక సాయం అందేది. అయితే ఇప్పుడు దీన్ని రాష్ట్ర విపత్తుగా ప్రకటించారు కాబట్టి ఆర్థికసాయం రూ.4 లక్షలకు చేరింది. బాధిత కుటుంబాలకు రాష్ట్ర విపత్తు సహాయనిధి నుండి పరిహారం లభిస్తుంది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను కూడా ప్రభుత్వం జారీ చేసింది.
ఇకపై వడదెబ్బ మరణాలపై పక్కా లెక్క
వడదెబ్బ చాలా ప్రమాదకరమైందని ప్రభుత్వం అంగీకరించింది.ముఖ్యంగా మహిళలు, పిల్లలు, వృద్ధులు వంటివారు ఎక్కువగా వడదెబ్బకు గురవుతారు. అయితే వడదెబ్బ మరణాలను క్రమపద్ధతిలో నివేదించడం లేదని జీఓ గుర్తించింది.
తెలంగాణవ్యాప్తంగా వేసవికాలంలో ప్రతిరోజు కనీసం 15 మంది వడదెబ్బకు గురవుతున్నారని ప్రభుత్వం చెబుతోంది. ఈ ఫ్రీక్వెన్సీ ఇతర గుర్తింపు పొందిన ప్రకృతి వైపరీత్యాల మాదిరిగానే ఉంది. కాబట్టే దీన్ని రాష్ట్ర విపత్తుగా గుర్తించినట్లు ప్రభుత్వం చెబుతోంది.
ఇప్పటినుండి వడదెబ్బ మరణాలను ఖచ్చితంగా గుర్తించేందుకు, సంబంధిత అధికారులు సరైన రోగ నిర్ధారణ చేసేలా జిల్లా కలెక్టర్ చూసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ ప్రక్రియలో అధిక ఉష్ణోగ్రతలకు గురికావడాన్ని సమీక్షించడం, హైపర్థెర్మియా యొక్క ఇతర కారణాలను తోసిపుచ్చడం వంటివి ఉంటాయి. పెరుగుతున్న ఉష్ణోగ్రతల ప్రాణాంతకంగా మారుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి. అందువల్లే వడదెబ్బను విపత్తుగా గుర్తించింది ప్రభుత్వం.
