ఎస్సై ఇంట్లో భారీగా డ్రగ్స్... హైదరాబాద్ లో సైబర్ క్రైమ్ పోలీస్ అరెస్ట్
స్మగ్లర్ల నుండి స్వాీధీనం చేసుకున్న డ్రగ్స్ ను ఇంట్లో దాచుకున్న ఓ ఎస్సైని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేసారు.
హైదరాబాద్ : తప్పు చేసినవారిని పట్టుకోవాల్సిన పోలీసే తప్పుడుపనిచేసి కటకటాలపాలయ్యాడు. స్మగ్లర్ల నుండి స్వాధీనం చేసుకున్న డ్రగ్స్ ను సంబంధిత విభాగానికి అప్పగించకుండా ఇంట్లో దాచుకుని ఓ ఎస్సై అడ్డంగా బుక్కయ్యాడు. ఇంట్లో డ్రగ్స్ కలిగివున్న సదరు ఎస్సైని పోలీసులు అరెస్ట్ చేసారు. ఈ ఘటన తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో చోటుచేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. తెలంగాణ సైబర్ క్రైమ్ విభాగంలో ఎస్సైగా పనిచేస్తున్నారు రాజేందర్. ఇటీవల విశ్వసనీయ సమాచారంతో రాజేందర్ నేతృత్వంలో ఓ బృందం మహారాష్ట్రకు వెళ్లి స్మగ్లర్లను పట్టుకున్నారు. ఈ క్రమంలో భారీగా డ్రగ్స్ స్వాధీనం చేసుకుని హైదరాబాద్ కు తీసుకువచ్చారు. అయితే డ్రగ్స్ ను సంబంధిత విబాగానికి గానీ, కోర్టుకు గానీ అప్పగించకుండా తన ఇంట్లోనే పెట్టుకున్నాడు ఎస్సై రాజేందర్.
Read More హైదరాబాద్‌లో తప్పతాగి కారు నడిపిన సీఐ!.. ఎదురుగా వస్తున్న వాహనాన్ని ఢీకొట్టడంతో..
ఎస్సై రాజేందర్ స్మగ్లర్ల నుండి స్వాధీనం చేసుకున్న డ్రగ్స్ ఇంట్లో దాచుకున్నట్లు రాయదుర్గం పోలీసులకు సమాచారం అందింది. వెంటనే ఎస్సై నివాసముండే ఇంట్లో పోలీసులు తనిఖీలు చేపట్టగా డ్రగ్స్ ప్యాకెట్లు పట్టుబడ్డాయి. దీంతో వాటిని స్వాధీనం చేసుకున్న రాయదుర్గం పోలీసులు ఎస్సై రాజేందర్ ను అరెస్ట్ చేసారు. వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదుచేసి ఎస్సైని కోర్టులో ప్రవేశపెట్టి రిమాండ్ కు తరలించారు.
ఎస్సై రాజేందర్ ఇంట్లో 1750 గ్రాముల డ్రగ్స్ ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. స్మగ్లర్ల నుండి స్వాధీనం చేసుకున్న ఈ డ్రగ్స్ ను ఇంట్లో దాచడమే కాదు అమ్మడానికి కూడా ఎస్సై ప్రయత్నించినట్లు నార్కోటిక్ విభాగం అధికారుల విచారణలో తేలింది. దీంతో రాష్ట్ర యాంటీ నార్కోటిక్స్ బ్యూరో డైరెక్టర్, సిపి సివి ఆనంద్ ఆదేశాలతో సదరు ఎస్సైని కోర్టులో ప్రవేశపెట్టి జైలుకు తరలించారు.
గతంలో రాయదుర్గం ఎస్సైగా పనిచేసిన రాజేందర్ లంచం తీసుకుంటూ ఏసిబికిక రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు. అప్పట్లో అతడిని సర్వీస్ నుండి తొలగించగా కోర్టు నుండి స్టే తెచ్చుకుని సైబరాబాద్ సిసిఎస్ లో ఎస్సైగా కొనసాగుతున్నాడు. అయినప్పటికీ రాజేందర్ తీరు మార్చుకోకుండా తాజాగా ఇంట్లో డ్రగ్స్ దాచి అడ్డంగా బుక్కయ్యాడు.