తెలంగాణ కేబినెట్ సమావేశంలో అభివృద్ధి, ఉద్యోగాలు, పారిశ్రామికీకరణ, విద్య, సంక్షేమంపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు.ఈ క్రమంలోనే సర్పంచ్ ఎన్నికలు ఎప్పుడు జరగనున్నాయి అనే దాని మీద కూడా ఓ క్లారిటీ ఇచ్చారు.
జూన్ చివర నాటికి..
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) నేతృత్వంలో హైదరాబాద్ సచివాలయంలో జరిగిన తాజా కేబినెట్ (Cabinate Meeting)సమావేశం, రాష్ట్ర పాలనకు దారితీయే అనేక కీలక నిర్ణయాలకు వేదికైంది. ఈ భేటీలో పరిపాలనా, అభివృద్ధి, సంక్షేమ రంగాలకు సంబంధించిన పలు అంశాలపై సమగ్రంగా చర్చ జరిగింది.కేబినెట్ సమావేశంలో మొదటగా స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై దృష్టి సారించినట్లు తెలుస్తుంది. ఎలక్షన్ల గురించి మంత్రులు చర్చించగా, జూన్ చివర నాటికి ఎన్నికలకు సిద్ధమవుతామని సంకేతాలిచ్చారు.
450 పేజీల నివేదికల్లో..
కాళేశ్వరం ప్రాజెక్టుపై గతంలో కేంద్ర, రాష్ట్ర సంస్థలు రూపొందించిన నివేదికలను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వివరంగా ప్రస్తావించగా, వాటిపై మంత్రుల అభిప్రాయాలను సీఎం రేవంత్ సేకరించారు. 450 పేజీల నివేదికల్లో ఉన్న అంశాలపై ముందుగా విశ్లేషణ అనంతరం తగిన చర్యలు తీసుకోవాలని అభిప్రాయపడ్డారు. రాష్ట్ర పారిశ్రామిక వృద్ధికి ఊతమివ్వాలనే ఉద్దేశంతో, వివిధ జిల్లాల్లో ప్రభుత్వ భూములను టీజీఐఐసీకి అప్పగించేందుకు మంత్రివర్గం అంగీకరించింది. ఇది పెట్టుబడులను ఆకర్షించడమే కాకుండా స్థానిక యువతకు ఉపాధి అవకాశాలను కల్పించగలదన్న నమ్మకం వ్యక్తమైంది.
300 కొత్త ఉద్యోగాల భర్తీకి..
ఇంకా విద్యుత్ శాఖలో 300 కొత్త ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన మంత్రివర్గం, విద్యాశాఖలో కొత్త డైరెక్టర్ నియామకానికి కూడా ఆమోదం తెలిపింది. అలాగే, ఎక్సైజ్‌పై ప్రత్యేక సెస్ విధించేందుకు మంత్రులు మన్ననిచ్చారు.సర్కార్ ఉద్యోగుల సంక్షేమంపై సుదీర్ఘంగా చర్చ జరిగిన ఈ సమావేశంలో, ఒక డీఏ తక్షణమే విడుదల చేయాలని, పెండింగ్ బిల్లుల చెల్లింపులకు ప్రతి నెలా రూ.700 కోట్లు కేటాయించాలని నిర్ణయం తీసుకుంది. ఇది ఉద్యోగుల ఆర్థిక భద్రతను బలోపేతం చేయనుంది.
రేషన్ కార్డుల పంపిణీ..
రోడ్ల అభివృద్ధి కోసం హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ ద్వారా రూ.23 వేల కోట్లు వెచ్చించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇది రాష్ట్రంలోని మౌలిక వసతుల అభివృద్ధికి దోహదపడనుంది. రాజీవ్ యువ వికాసం పథకానికి అందిన అపరిమిత దరఖాస్తులపై సమగ్ర పరిశీలన అనంతరం మాత్రమే అర్హుల జాబితా ప్రకటించాలని నిర్ణయం తీసుకున్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, వానాకాలం సాగు సన్నద్ధత, రేషన్ కార్డుల పంపిణీ వంటి అంశాలపై సమీక్ష జరిగింది.
వేములవాడ ఘటనను పరిశీలించిన మంత్రివర్గం, భవిష్యత్తులో ఇలాంటి దుర్ఘటనలు పునరావృతం కాకుండా తీసుకోవాల్సిన చర్యలపై దృష్టి సారించింది. జహీరాబాద్‌లో పారిశ్రామిక అభివృద్ధి అథారిటీ ఏర్పాటు ద్వారా పెట్టుబడులు రావటంతో పాటు, పశ్చిమ తెలంగాణ అభివృద్ధికి బలమైన పునాదులు పడతాయని అంచనా. ఇదే సమయంలో, ములుగు జిల్లాలో పామాయిల్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటుకు 12 ఎకరాల భూమిని కేటాయిస్తూ మంత్రివర్గం మద్దతినిచ్చింది.
తొలి భూ విజ్ఞాన విశ్వవిద్యాలయం…
మహిళా స్వయం సహాయక సమూహాలకు బీమా నిధుల విడుదలకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇది మహిళల ఆర్థిక భద్రతను పెంపొందించడంలో సహకరించనుంది.విద్యారంగంలో చారిత్రాత్మక అడుగులు వేసిన మంత్రివర్గం, కొత్తగూడెంలో దేశంలోనే తొలి భూ విజ్ఞాన విశ్వవిద్యాలయానికి ఆమోదం తెలిపింది. డాక్టర్ మన్మోహన్ సింగ్ పేరు మీద ఏర్పడనున్న ఈ విశ్వవిద్యాలయం, భూకంపాలు, వాతావరణం, ఖనిజాల అధ్యయనం వంటి రంగాల్లో కీలక శోధనల కేంద్రంగా మారనుంది.
ఈ మొత్తం నిర్ణయాల ద్వారా ప్రభుత్వ సంకల్పాన్ని ప్రజలకు స్పష్టంగా చాటింది. అభివృద్ధి, సంక్షేమం, పారదర్శక పాలన అనే మూడు సూత్రాలను కేంద్రీకరించుకుని ఈ సమావేశం రాష్ట్రానికి దిశానిర్దేశం చేసినట్లు కనిపిస్తోంది.