తెలంగాణ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం బీఏసీ సమావేశం జరిగింది. దీనిలో భాగంగా శాసనసభ సమావేశాలలో ప్రాధాన్యత అంశాలపై స్పీకర్ చర్చించారు. అవసరమైతే సమావేశాల నిడివి పొడిగించాలని భేటీలో నిర్ణయించారు.

ఈ నెల 8 నుంచి 20 వరకు మొత్తం 12 రోజుల పాటు శాసనసభ సమావేశాలు జరగనున్నాయి. శనివారం గవర్నర్‌కు ధన్యవాద తీర్మానాన్ని ప్రవేశపెట్టనున్నారు. ఈ నెల 8న ప్రభుత్వం బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది.

9,10, 15 తేదీలలో అసెంబ్లీకి సెలవులు ప్రకటించారు. ఈ నెల 20 ద్రవ్య వినిమయ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. కాగా శాసనసభ సమావేశాల్లో భాగంగా శుక్రవారం గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. 

రైతు బంధు పథకం దేశానికి ఆదర్శంగా నిలిచిందన్నారు. దీన్ని ఇప్పటికే అనేక రాష్ట్రాల అమలు చేస్తున్నాయని తెలిపారు. రైతు భీమా పథకం కూడా వ్యవసాయ రంగంపై ఆదారపడే రైతన్నలకు భరోసా ఇచ్చిందన్నారు.  

కొన్ని నెలలుగా దేశం తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కుంటోందని... ఈ ప్రభావం తెలంగాణపై కూడా వుందన్నారు.  కానీ సమర్థవంతమైన పాలన, ఆర్థిక క్రమశిక్షణతో ఈ పరిస్థితులను అధిగమించే ప్రయత్నం చేస్తున్నామన్నారు. 

అంతర్జాతీయ ప్రమాణాలతో హైదరాబాద్ లో కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. నిర్మాణంలో వున్న దీన్న అతి త్వరలో ప్రారంభించనున్నామని వెల్లడించారు. మహిళా భద్రత కోసం తెలంగాణ పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. షీ టీమ్ లు హైదరాబాద్ తో పాటు మరికొన్ని చోట్ల మహిళా రక్షణకోసం సమర్ధవంతంగా పనిచేస్తున్నాయని అన్నారు. 

 గొల్ల కురుమలకు 75శాతం సబ్సిడితో గొర్రెల పంపిణీ  చేపట్టినట్లు తెలిపారు. ప్రమాదవశాత్తు మరణించిన మత్స్యకారులు, గీతకార్మికుల కుటుంబాలకు రూ. 6 లక్షల ఇక్స్ గ్రేషియా అందిస్తున్నామన్నారు.  

హైదరాబాద్ లో ఏర్పాట్లుచేసిన బస్తీ దవాఖానాలు నగర పేదలకు ఎంతో ఉపయోగపడుతున్నాయి. ఈ బస్తీ దవాఖానాల సంఖ్యను మరింత పెంచడానికి తమ ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, నిరుపేదలు ఎక్కువగా వుండే ప్రాంతాల్లో వీటిని ఏర్పాటుచేయన్నట్లు వెల్లడించారు. 

రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలను నివారించామన్నారు. అతి తక్కువ కాలంలోనే కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేసినట్టు చెప్పారు. మిషన్ కాకతీయ కార్యక్రమం ద్వారా భూగర్భ జలాలు పెరిగాయన్నారు. 

కళ్యాణ్‌లక్ష్మీ, షాదీ ముబారక్ లాంటి స్కీమ్‌ల ద్వారా తెలంగాణ రాష్ట్రంలోని పేదల కుటుంబాల్లో వెలుగులు నిండాయని గవర్నర్ అభిప్రాయపడ్డారు. తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమించి ప్రాణాలు ఆర్పించిన  కుటుంబాలు రూ. 10 లక్షల ఆర్ధిక సహాయం అందించినట్టుగా తమిళిసై చెప్పారు.

బిసీ వర్గాలకు కార్యాలయాల కోసం హైదరాబాద్ కు స్థలాలు  కేటాయించామని తెలిపారు.  డ్రైవర్లు,హోంగార్డులు, జర్నలిస్టులకు ఇన్సూరెన్స్ అమలు చేస్తున్నామని గవర్నర్ తెలిపారు. 

తెలంగాణలో ఒకప్పుడు వ్యవసాయం దండగ అన్నపరిస్థితులు వుంటే దాన్ని పూర్తిగా మార్చివేసినట్లు తెలిపారు. తమ ప్రభుత్వ చర్యలతో ఇప్పుడు యావత్ తెలంగాణ సుభిక్షంగా మారుతోందన్నారు. 

Also Read:తెలంగాణ బడ్జెట్ సమావేశాలు: ముగిసిన గవర్నర్ ప్రసంగం...ఆదివారానికి సభ వాయిదా

వ్యవసాయ రంగానికి ఉచితంగా విద్యుత్‌ను అందిస్తున్నామని తమిళిసై చెప్పారు. అన్ని రంగాలకు నాణ్యమైన విద్యుత్‌ను అందిస్తున్నామన్నారు. రైతుల సంక్షేమం కోసం రైతు భీమా పథకాన్ని అమలు చేస్తున్నట్టు గవర్నర్ చెప్పారు. 

ఎస్సి, ఎస్టీలకు 101 యూనిట్ల విద్యుత్ ఉచితంగా  అందిస్తున్నామన్నారు. అలాగే తమ ప్రభుత్వం విద్యుత్ కు సంబంధించి గిరిజనులపై పెట్టిన విజిలెన్స్ కేసులను కూడా ఉపసంహరించుకున్న గవర్నర్ వెల్లడించారు. 

రాష్ట్రం కోసం ఉద్యమించిన నేతే రాష్ట్రాన్ని నడిపిస్తున్నారు. ఆయనకు రాష్ట్ర  పరిస్థితులు పూర్తిగా అవగాహన వున్నాయి కాబట్టి ప్రభుత్వం ప్రజలకు మంచి పాలన అందుతోందని అన్నారు. 

Also Read:సీఆర్ దార్శనికతతో పురోభివృద్ధిలో తెలంగాణ: తమిళిసై

ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు వివక్షకు గురయ్యాయి. కానీ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సమస్యలన్నింటిని అధిగమించి తమ సాంప్రదాయాలకు పెద్దపీట వేయబడ్డాయి. పేదల సంకేమానికి తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందన్నారు. 

అతి తక్కువ కాలంలోనే తెలంగాణ అద్భుతమైన  పురోగతిని సాధించింది. కనీస పెన్షన్లు కూడా ఇవ్వలేని స్థాయినుండి భారీగా వాటిని పెంచుకుని  ప్రజలకు ఎలాంటి లోటు లేకుండా సంక్షేమాన్ని అందించే స్థాయికి చేరుకుందని గవర్నర్ తెలిపారు