హైదరాబాద్: పేదల సంక్షేమానికి తమ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని  తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై చెప్పారు. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు శుక్రవారం నాడు ప్రారంభమయ్యాయి. గవర్నర్ తమిళిసై  బడ్జెట్ సమావేశాలను పురస్కరించుకొని  ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. 

రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఒక్కో సమస్యను అధిగమిస్తూ ముందుకు సాగుతోందని గవర్నర్ తమిళిసై అభిప్రాయపడ్డారు. పేదల సంక్షేమానికి తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని చెప్పారు. బీడి కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం రూ. 2016 పెన్షన్ అందిస్తున్న విషయాన్ని గవర్నర్ గుర్తు చేశారు. 

రాష్ట్రం ఏర్పడిన కొత్తలో విద్యుత్ సంక్షోభాన్ని చవిచూసినట్టు చెప్పారు. ఆసరా పెన్షన్లు పేదల జీవితాల్లో  వెలుగులు నింపినట్టుగా ఆమె చెప్పారు.రాష్ట్రం కోసం ఉద్యమించిన నేత రాష్ట్రాన్ని పాలిస్తున్నాడని గవర్నర్ చెప్పారు.కేసీఆర్ దార్శనికతతో రాష్ట్రం పురోభివృద్ధిలో ముందుకు సాగుతోందన్నారామె. 

Also read:తెలంగాణ బడ్జెట్ సమావేశాలు లైవ్ అప్ డేట్స్:రాష్ట్రం కోసం ఉద్యమించిన నేతే పాలిస్తున్నాడు: గవర్నర్
వ్యవసాయ రంగానికి ఉచితంగా విద్యుత్‌ను అందిస్తున్నామని తమిళిసై చెప్పారు. అన్ని రంగాలకు నాణ్యమైన విద్యుత్‌ను అందిస్తున్నామన్నారు. రైతుల సంక్షేమం కోసం రైతు భీమా పథకాన్ని అమలు చేస్తున్నట్టు గవర్నర్ చెప్పారు. 

ఈ పథకం దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు.  తెలంగాణలో ఒకప్పుడు వ్యవసాయం దండగ అనే పరిస్థితులు ఉండేవి కానీ, ప్రస్తుతం వ్యవసాయం పండగ అనే పరిస్థితులు నెలకొన్నాయని ఆమె చెప్పారు. 

రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలను నివారించామన్నారు. అతి తక్కువ కాలంలోనే కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేసినట్టు చెప్పారు. మిషన్ కాకతీయ కార్యక్రమం ద్వారా భూగర్భ జలాలు పెరిగాయన్నారు. 

కళ్యాణ్‌లక్ష్మీ, షాదీ ముబారక్ లాంటి స్కీమ్‌ల ద్వారా తెలంగాణ రాష్ట్రంలోని పేదల కుటుంబాల్లో వెలుగులు నిండాయని గవర్నర్ అభిప్రాయపడ్డారు. తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమించి ప్రాణాలు ఆర్పించిన  కుటుంబాలు రూ. 10 లక్షల ఆర్ధిక సహాయం అందించినట్టుగా తమిళిసై చెప్పారు.

బీసీ వర్గాల కార్యాలయాల కోసం హైద్రాబాద్‌లో స్థలాన్ని కేటాయించినట్టుగా ఆమె చెప్పారు.  విద్యుత్ తలసరి వినియోగంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచిందన్నారు. కొత్త పంచాయితీరాజ్, మున్సిపల్ చట్టాలను తీసుకొచ్చినట్టుగా ఆమె గుర్తు చేశారు. వేగంగా డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను నిర్మిస్తున్నట్టుగా గవర్నర్  చెప్పారు.