తెలుగు రాష్ట్రాల్లో ఇప్పట్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలు కనిపించడంలేదు.. మరో నాలుగైదు రోజులు చిరుజల్లులే ఉంటాయట. అంటే జూన్ లో ఇక హెవీ రెయిన్స్ లేనట్లే. మంగళవారం తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుందంటే… 

Telugu States Weather Update : వర్షాకాలం మొదలై నెలరోజులు కావస్తున్నా తెలుగు రాష్ట్రాల్లో ఇంకా వానలు ఊపందుకోవడం లేదు. నైరుతి ముందుగానే ప్రవేశించి వర్షాకాలం మే నెలలోనే ప్రారంభమయ్యింది... ఆరంభంలో వర్షాలు కూడా బాగానే పడ్డాయి. అయితే జూన్ వచ్చేసరికి వర్షాలు ముఖం చాటేశాయి. సాధారణంగా ఈ నెలలో భారీ వానలు కురవాలి... కానీ ఈసారి జూన్ లో లోటు వర్షపాతం నమోదయ్యింది.

మేలోనే వానలు మొదలవడంతో రైతులు వ్యవసాయ పనులు ప్రారంభించారు. కానీ జూన్ లో వర్షాల జాడ లేకపోవడంతో వారు ఆందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే వర్షాధార పంటలు వేసినవారితో పాటు పంటలు వేసేందుకు భూమిని సిద్దం చేసుకున్న రైతులు వర్షాల కోసం ఎదురుచూస్తున్నారు. కానీ ఈ నెలలో చెదురుమదురు జల్లులు మినహా భారీ వర్షాలు కురిసే అవకాశాలు లేవని వాతావరణ శాఖ స్పష్టం చేస్తోంది.

జూన్ 24 తెలంగాణ వాతావరణ సమాచారం :

తెలంగాణలో ఇవాళ(మంగళవారం) చిరుజల్లులు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఈ వర్షాలకు ఈదురుగాలులు, పిడుగులు తోడయ్యే అవకాశాలున్నాయని... ఇది ప్రమాదకరంగా మారవచ్చని హెచ్చరించారు. కాబట్టి వర్షం కురిసే సమయంలో ప్రజలు మరీముఖ్యంగా రైతులు, వ్యవసాయ కూలీలు జాగ్రత్తగా ఉండాలి... చెట్లకింద, బలహీనమైన తాత్కాలిక నిర్మాణాల్లో ఉండటం ప్రమాదాలకు దారితీయవచ్చు... సురక్షిత ప్రాంతాల్లో ఉండటం మంచిది.

నేడు నిజామాబాద్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, నాగర్ కర్నూల్ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశాలున్నాయని తెలిపారు. అలాగే హైదరాబాద్ తో పాటు శివారుజిల్లాలైన రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డిలో కూడా అక్కడక్కడ చెదురుమదురు జల్లులు కురుస్తాయని ప్రకటించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల్లో మోస్తరు నుండి అక్కడక్కడ భారీ వర్షాలు కురవొచ్చని అంచనా వేస్తున్నారు. మొత్తంగా తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశాలున్న ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.

తెలంగాణలో లోటు వర్షపాతం

సాధారణంగా నైరుతి రుతుపవనాలు జూన్ ఆరంభంతో తెలంగాణను తాకి తొలకరి జల్లులు మొదలవుతాయి. ఈ నెలలో సాధారణంగా భారీ వర్షాలుంటాయి... కానీ ఈసారి పరిస్థితి అలాలేదు. మే చివర్లోనే రుతుపవనాలు తెలంగాణను తాకి వర్షాలు మొదలయ్యాయి. కానీ జూన్ లోకి వచ్చేసరికి వర్షాలు లేవు. ఇప్పటివరకు అక్కడక్కడా చెదురుమదురు జల్లులు మినహా భారీ వర్షాలు కురిసిందే లేదు. సాధారణంగా జూన్ లో 97 మిల్లిమీటర్ల వర్షపాతం నమోదుకావాలి... కానీ ఇప్పటివరకు కురిసింది కేవలం 56 మి.మీ వర్షమే. అంటే 42 శాతం లోటు వర్షపాతం నమోదయ్యింది.

మరో నాలుగైదురోజులు సాధారణ వర్షాలే తప్ప భారీ వర్షాలుండవని వాతావరణ శాఖ చెబుతోంది. అంటే ఈ జూన్ లో లోటు వర్షపాతమే ఉండనుంది. వర్షాలు లేక ఆందోళనకు గురవుతున్న తెలుగు ప్రజలు ఇప్పటికే కప్పల పెళ్లిళ్లు, వరుణ దేవుడి కరుణ కోసం ప్రత్యేక పూజలు చేస్తున్నాయి. ఈ పూజలు ఫలించి వాతావరణ పరిస్థితులు మారతాయేమో.. వర్షాలు జోరందుకుంటాయేమో చూడాలి.

జూన్ 24 ఆంధ్ర ప్రదేశ్ వాతావరణ సమాచారం :

ఆంధ్ర ప్రదేశ్ లో కూడా ఇప్పట్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలు కనిపించడంలేదు. నైరుతి రుతుపవనాలు యాక్టివ్ గా మారినా, బంగాళాఖాతంలో మరో ఉపరితల ఆవర్తనం ఏర్పడినా ఏపీలో చెదురుమదురు జల్లులు తప్ప పెద్ద వర్షాలు ఉండకపోవచ్చని వాతావరణ శాఖ ప్రకటించింది. నేడు, రేపు (మంగళ, బుధవారం) ఈదురుగాలులు, ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని ప్రకటించారు.

రాష్ట్రంలోని శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కోనసీమ, ఉభయ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తాయని విపత్తు నిర్వహణ సంస్థ ప్రకటించింది. మిగతా జిల్లాల్లో వర్షాలు కురవకున్నా ఆకాశం మేఘాలతో కప్పేసి వాతావరణం చల్లగా ఉంటుందని తెలిపారు. ఈ రెండుమూడు రోజులు చిరుజల్లులే తప్ప భారీ వర్షాలు ఉండవని స్పష్టం చేశారు.