- Home
- National
- Telugu States Weather : తెలుగు రాష్ట్రాల్లో మరో ఆర్రోజులు ఇంతే.. జోరువానలు ఎప్పట్నుంచంటే
Telugu States Weather : తెలుగు రాష్ట్రాల్లో మరో ఆర్రోజులు ఇంతే.. జోరువానలు ఎప్పట్నుంచంటే
తెలుగు రాష్ట్రాల్లో మరో ఆర్రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశాలు లేవట. మరి ఎప్పట్నుంచి వానలు జోరందుకునే అవకాశాలున్నాయట తెలుసా?

తెలుగు రాష్ట్రాల్లో చిరుజల్లులే... ఇప్పట్లో భారీ వర్షాలు లేనట్లే
Telangana And Andhra Pradesh Weather Updates : వర్షాకాలం మొదలై దాదాపు నెలరోజులు కావస్తోంది. సాధారణంగా జూన్ ఆరంభంలో మొదలవ్వాల్సిన వర్షాలు ఈసారి మే చివర్లోనే ప్రారంభమయ్యాయి. నైరుతి రుతుపవనాలు ముందుగానే తెలుగు రాష్ట్రాలను తాకడంతో వర్షాలు కురిసాయి. దీంతో ఈ వర్షాకాలమంతా ఇలాగే జోరువానలు ఉంటాయని భావించిన రైతులు వ్యవసాయ పనులు ప్రారంభించారు.
కానీ అసలు వర్షకాలంలో అంటే జూన్ లో మేఘాలు ముఖం చాటేసాయి... వర్షాల జాడే లేదు. తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ లలో చెదురుమదులు జల్లులు మినహా ఇప్పటివరకు భారీ వర్షాలు కురిసిందే లేదు. దీంతో తెలుగు ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
అయితే మరికొద్దిరోజులు తెలుగు రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. అక్కడక్కడ చిరుజల్లులు మినహా పెద్దగా వర్షాలుండవని చెబుతున్నారు. జూన్ చివర్లో లేదా జూలై ఆరంభంలో వర్షాలు జోరందుకునే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ చెబుతోంది.
జూన్ 19 తెలంగాణ వాతావరణ సమాచారం
తెలంగాణలో రాబోయే ఆరురోజులు అంటే జూన్ 19 నుండి 24 వరకు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు మాత్రమే కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అయితే ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల్లో అక్కడక్కడా వర్షాలు పడే అవకాశాలున్నాయని తెలిపారు. ఇక హైదరాబాద్ తో పాటు మిగతా జిల్లాల్లో పొడి వాతావరణం ఉంటుందని... ఆకాశం మేఘాలతో కప్పివుండి వాతావరణం చల్లగా ఉంటుందని తెలిపారు.
రైతులు, కూలీలు జాగ్రత్త...
భారీ వర్షాలు లేకున్నా గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. అలాగే పలు ప్రాంతాల్లో చిరుజల్లులకు ఉరుములు మెరుపులు, పిడుగులు తోడయ్యే అవకాశాలున్నాయని తెలిపారు. కాబట్టి వ్యవసాయ పనులుచేసే రైతులు, కూలీలు అప్రమత్తంగా ఉండాలని... వర్షం కురిసే సమయలో చెట్లకింద కాకుండా సురక్షిత ప్రాంతాల్లో తలదాచుకోవాలని సూచిస్తున్నారు.
జూన్ 19 ఆంధ్ర ప్రదేశ్ వాతావరణ సమాచారం
ఇవాళ (గురువారం) ఆంధ్ర ప్రదేశ్ లో కూడా పెద్దగా వర్షాలు కురిసే అవకాశం లేదని విపత్తు నిర్వహణ విభాగం తెలిపింది. అక్కడక్కడ చెదురుమదులు జల్లులు మాత్రమే ఉంటాయని... ఈదురుగాలులు, పిడుగులు పడే అవకాశాలున్నాయని ప్రకటించారు. కాబట్టి వర్ష సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఈ ఏపీ జిల్లాల్లో చిరుజల్లులు..
ఏపీలోని శ్రీకాకుళం, విజయనగరం, మన్యం జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటించారు. ఇక అల్లూరి, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, నెల్లూరు, తిరుపతి, కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాల్లో చెదురుమదులు జల్లులు పడతాయని తెలిపారు. మొత్తంగా ఏపీలో ఇప్పట్లో భారీ వర్షాలు ఉండవని వాతావరణ సూచనలను బట్టి తెలుస్తోంది.
మహారాష్ట్ర, గుజరాత్ ను ముంచెత్తిన వరదలు
మహారాష్ట్ర, కర్ణాటక, కేరళలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ఆర్థిక రాజధాని ముంబైతో పాటు పలు ప్రాంతాల్లో కురిసిన వర్షాలు, వరదలతో ప్రాణనష్టం, ఆస్తినష్టం సంభవించింది. 18 మందివరకు ప్రాణాలు కోల్పోగా 65 మందివరకు తీవ్ర గాయాలపాలయ్యారు. ఇలాగే గుజరాత్ లో కూడా భారీ వర్షాలతో వరదలు సంభవించాయి. ఇక్కడ కూడా బుధవారం వరద ప్రవాహంలో కొట్టుకుపోయి నలుగురు ప్రాణాలు కోల్పోయారు.
ముంబైలో ఇప్పటికే కుండపోత వర్షాలు కురుస్తున్నాయి... ఇప్పటివరకు 200 మి.మీ. వర్షపాతం నమోదయ్యింది. ఈ వర్షాలు ఇలాగే కొనసాగే అవకాశాలు ఉండటంతో ఐఎండి ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అత్యవసరమయితే తప్ప బయటకు రావద్దని సూచిస్తున్నారు. లోతట్టు ప్రాంతాల్లో నీటి మట్టం పెరుగుతున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని.. అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు. ప్రజలు అధికారిక సూచనలను పాటించాలని... అపోహలకు లోనుకావద్దని హెచ్చరించారు.