హైదరాబాద్: తమ కూతురు నాలాలో పడి మరణించిన ఘటనపై సుమేధ తల్లిదండ్రులు తెలంగాణ మున్సిపల్ శాఖ మంత్రి కేటీ రామారావుపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. మంత్రి కేటీఆర్ మీద వారు నేరేడుమెట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

కేటీఆర్ మీదనే కాకుండా జీహెచ్ఎంసి కమిషర్, జోనల్ కమిషనర్ మీద కూడా వారు ఫిర్యాదు చేశారు. దాంతో పాటు స్థానిక కార్పోరేటర్ మీద, సంబంధిత డీఈ, ఏఈల మీద కూడా వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారందరిపై 304 సెక్షన్ కింద కేసు నమోదు చేయాలని వారు కోరారు. 

Also Read: నేరెడ్‌మెట్‌ నాలాలో బాలిక మృతి: జీహెచ్ఎంసీ అధికారులపై తల్లిదండ్రుల ఫిర్యాదు

నేరేడ్ మెట్ లో అదృశ్యమైన 12 ఏళ్ల బాలిక సుమేధ బండ చెరువు వద్ద శవమై తేలింది. నాలాలా పడి ఆమె మరణించింది. హైదరాబాదులోని నేరేడుమెట్ కాకతీయ నగర్ లో సుమేధ కపూరియా అనే బాలిక నివసిస్తూ వచ్ిచంది. గురువారంనాడు సాయంత్రం సైకిల్ మీద బాలిక బయటకు వెళ్లింది.

బయటకు వెళ్లిన సుమేధ ఎంతకీ ఇంటికి తిరిగి రాలేదు. ఆమె ఇంటి నుంచి బయటకు వెళ్లిన కొద్దిసేపటి తర్వాత భారీ వర్షం కురిసింది. ఆమె బయటకు వెళ్లిన సమయంలో తల్లి ఇంట్లో లేదు. తల్లి ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత కూతురి కోసం గాలించింది. ఆ తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేశారు 

Also Read: నేరేడ్‌మెట్టులో అదృశ్యమైన బాలిక మృతి: బండచెరువు వద్ద సుమేధ మృతదేహం లభ్యం

దీన్ దయాళ్ నగర్ లోని నాలా వద్ద బాలిక ఉపయోగించిన సైకిల్ ను స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. నాలాలో పడిపోవడంతో బాలిక కొట్టుకుపోయిందని భావించి పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. శుక్రవారం ఉదయం బండచెరువు వద్ద బాలిక మృతదేహాన్ని డిజాస్టర్ మేనేజ్ మెెంట్ బృందం గుర్తించింది.