హైదరాబాద్:  హైద్రాబాద్ నేరేడ్‌మెట్టులో నిన్న అదృశ్యమైన 12 ఏళ్ల బాలిక సుమేధ మృతి చెందింది. బండచెరువు వద్ద సుమేధ మృతదేహాన్ని ఇవాళ  గుర్తించారు. రాత్రి నుండి బాలిక కోసం డిజాస్టర్ మేనేజ్ మెంట్ బృందం గాలింపు చర్యలు చేపట్టారు. 

నగరంలోని నేరేడ్‌మెట్ కాకతీయ నగర్ లో తల్లిదండ్రులతో కలిసి సుమేధ కపురియా అనే బాలిక నివాసం ఉంటుంది. ఆ బాలిక వయస్సు 12 ఏళ్లు. గురువారంనాడు సాయంత్రం సైకిల్ పై బాలిక బయటకు వెళ్లింది. ఆమె ఎంతసేపటికి ఇంటికి తిరిగి రాలేదు. బాలిక ఇంటి నుండి బయటకు వెళ్లిన కొంతసేపటికి భారీ వర్షం కురిసింది.

also read:హైద్రాబాద్‌లో 12 ఏళ్ల బాలిక అదృశ్యం: నాలా సమీపంలో సైకిల్ లభ్యం

నిన్న సాయంత్రం ఆరున్నర గంటలకు బాలిక ఇంటి నుండి వెళ్లింది. ఆ సమయంలో బాలిక తల్లి ఇంట్లో లేదు. ఆమె తల్లి ఇంటికి చేరుకొన్న తర్వాత బాలిక లేదని విషయాన్ని గుర్తించి ఆమె కోసం గాలింపు చర్యలు చేపట్టారు. వెంటనే ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.

దీన్ దయాళ్ నగర్ లోని నాళా వద్ద బాలిక ఉపయోగించిన సైకిల్ ను స్థానికులు గుర్తించి పోలీసులకు  సమాచారం ఇచ్చారు. నాలాలో పడిపోవడంతో ఆ బాలిక కొట్టుకుపోయిందేమోనని పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. 

శుక్రవారం నాడు ఉదయం బండచెరువు వద్ద బాలిక మృతదేహాన్ని డిజాస్టర్ మేనేజ్ మెంట్ బృందం ఇవాళ గుర్తించింది.