నేరెడ్‌మెట్ నాలాలో బాలిక మృతి: జీహెచ్ఎంసీ అధికారులపై తల్లిదండ్రుల ఫిర్యాదు
ముక్కుపచ్చలారని చిన్నారి సుమేధ మరణం ఆమె తల్లిదండ్రులను తీవ్రంగా కలచివేస్తోంది. నాలాలో పడి చనిపోయిన బాలిక పేరెంట్స్ స్టేట్‌మెంట్‌ను పోలీసులు రికార్డు చేశారు.
ముక్కుపచ్చలారని చిన్నారి సుమేధ మరణం ఆమె తల్లిదండ్రులను తీవ్రంగా కలచివేస్తోంది. నాలాలో పడి చనిపోయిన బాలిక పేరెంట్స్ స్టేట్‌మెంట్‌ను పోలీసులు రికార్డు చేశారు. ఇవాళ బాలిక మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు.
అనంతరం నేరెడ్‌మెట్ పోలీసులు తల్లిదండ్రుల నుంచి స్టేట్‌మెంట్ తీసుకున్నారు. ఇప్పటికే బాలిక కనిపించకుండా పోయిన ఫిర్యాదుపై మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు పేరెంట్స్ స్టేట్‌మెంట్‌తో మరికొన్ని సెక్షన్లను చేర్చారు.
అధికారుల నిర్లక్ష్యంతోనే ఈ ఘటన జరిగిందని తల్లిదండ్రులు ఆరోపిస్తూ ఉండటంతో ఘటన జరిగిన ప్రాంతంలోని జీహెచ్ఎంసీ సిబ్బందిని బాధ్యులుగా చేర్చే అవకాశం వుంది. ఇందుకోసం సెక్షన్ 304 కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
Also Read:నేరెడ్‌మెట్‌లో బాలికను మింగిన నాలా: రేపు సుమేధ అంత్యక్రియలు
అధికారులు సత్వరమే స్పందించిన వుంటే సుమేధ బతికి వుండేదని కుటుంబసభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. నాలాల మీద కనీసం జాలీలైనా ఏర్పాటు చేసి వుంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు.
14 ఏళ్లుగా ఇక్కడే నివాసం వుంటున్నామని.. అప్పుడెలా వుందో, ఇప్పుడు అదే పరిస్ధితని కుటుంబసభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారుల్లో మార్పు రావాల్సిన అవసరం వుందని వారు చెప్పారు.
తమ కుటుంబంలో జరిగిన విషాదం మరో కుటుంబంలో జరగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. హైదరాబాద్ నేరెడ్‌మెట్‌లో నిన్న సాయంత్రం నుంచి కనిపించకుండా పోయిన బాలిక సుమేధ బండ చెరువులో శవమై తేలింది.
గురువారం సాయంత్రం ఆడుకోవడానికి బయటకు వెళ్తున్నానని నాన్నమ్మకు చెప్పిన సుమేధ ఇంటికి తిరిగిరాలేదు. తల్లీ ఆఫీసు నుంచి ఇంటికి వచ్చే సరికి సుమేధ కనిపించలేదు. స్థానికులను ఆరా తీసినప్పటికీ చిన్నారి ఆచూకీ తెలియలేదు.
అయితే నాలా దగ్గర సుమేధ సైకిల్ కనిపించడంతో నాలాలో పడిపోయి వుంటుందని అనుమానించారు. ఆ దిశగా సహాయక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ క్రమంలో బండ చెరువులో బాలిక మృతదేహాం లభ్యమైంది.