SIR: తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఓటర్ల వివరాల సేకరణ కోసం ఉపయోగించే ఎన్యూమరేషన్ ఫారాల సమర్పణ గడువును మరోసారి పొడిగించింది.

ఆగస్టు 10 వరకు ఫామ్‌లు సమర్పించే అవకాశం

మొదట ఈ ప్రక్రియకు జులై 24ను చి చ‌వరి తేదీగా నిర్ణయించారు. అనంతరం ఓటర్ల నుంచి వచ్చిన స్పందన, క్షేత్రస్థాయిలో కొనసాగుతున్న పనులను దృష్టిలో పెట్టుకుని ఆగస్టు 3 వరకు గడువు పొడిగించారు. ఇప్పుడు మరోసారి నిర్ణయం మార్చి, ఆగస్టు 10 వరకు ఫామ్‌లు సమర్పించేందుకు అవకాశం ఇచ్చారు. ఈ గడువులోగా ఓటర్లు తమ వివరాలను సంబంధిత బూత్ లెవల్ ఆఫీసర్ల (BLO)కు అందించాలని ఎన్నికల సంఘం సూచించింది. ఇంటింటికీ వెళ్లి వివరాలు సేకరించే ప్రక్రియను కూడా బీఎల్‌వోలు కొనసాగించాలని ఆదేశాలు జారీ చేసింది.

రాష్ట్రంలో 77 శాతానికి పైగా ప్రక్రియ పూర్తి

ఎన్నికల సంఘం వెల్లడించిన వివరాల ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 77.12 శాతం ఎన్యూమరేషన్ ప్రక్రియ పూర్తయింది. జిల్లాల వారీగా చూస్తే హైదరాబాద్‌లో 56.31 శాతం, రంగారెడ్డి జిల్లాలో 63.43 శాతం, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో 61.37 శాతం పనులు పూర్తయ్యాయి. మిగిలిన ప్రాంతాల్లో కూడా అధికారులు వేగంగా సర్వే పూర్తి చేసే దిశగా చర్యలు చేపడుతున్నారు.

డ్రాఫ్ట్ నుంచి తుది ఓటర్ల జాబితా వరకు పూర్తి షెడ్యూల్ ఇదే

ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమానికి సంబంధించిన తదుపరి షెడ్యూల్‌ను కూడా కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది.

* ఆగస్టు 10 – ఎన్యూమరేషన్ ఫారాల సమర్పణకు చివరి తేదీ

* ఆగస్టు 17 – డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదల

* సెప్టెంబర్ 16 వరకు – క్లెయిములు, అభ్యంతరాల స్వీకరణ

* ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 15 వరకు – క్లెయిములు, అభ్యంతరాల పరిశీలన, పరిష్కారం

* అక్టోబర్ 19 – తుది ఓటర్ల జాబితా (Final Publication) విడుదల

ఓటర్ల జాబితాలో పేరు చేర్పించడం, వివరాలు సరిచేయడం లేదా మార్పులు చేయించుకోవాల్సిన వారు ఈ పొడిగించిన గడువును సద్వినియోగం చేసుకోవాలని ఎన్నికల సంఘం సూచించింది.