షైన్ ఆసుపత్రి ఉదంతం దృష్ట్యా తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమయ్యింది. రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రైవేట్ ఆసుపత్రులపై తనిఖీలు చేయనుంది. నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయనే ఆయా ఆసుపత్రుల గుర్తింపును రద్దు చేస్తామన్నారు డీఎంహెచ్ఓ స్వరాజ్య లక్ష్మీ.

షైన్ ఆసుపత్రిలో ప్రమాదానికి నిబంధనలు ఉల్లంఘించడమే కారణమని ఆమె వెల్లడించారు. 20 పడకల ఆసుపత్రికి అనుమతి తీసుకుని 50 పడకల ఆసుపత్రిగా నిర్వహిస్తున్నారని తెలిపారు.

ఈ ఘటనపై వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీకి నివేదిక ఇస్తామన్నారు. జిల్లాల్లో నర్సింగ్ హోంలు, ఆసుపత్రులు మొత్తం కలిపి 462 ఉన్నాయని.. డివిజన్ల వారీగా బృందాలను ఏర్పాటు చేసి గురువారం నుంచి తనిఖీలు చేస్తామన్నారు.

Life Style:చిన్నారి మృతి: షైన్ ఆసుపత్రిపై ప్రభుత్వం కొరడా

పడకలు, ఫైర్ సేఫ్టీ, బిల్డింగ్ అనుమతులు, లేఔట్ అనుమతులు తనిఖీ చేస్తామని స్వరాజ్యలక్ష్మీ వెల్లడించారు. ఇప్పటి వరకు ప్రభుత్వ అనుమతి లేకుండా ఆసుపత్రులు నడుపుతున్న వారికి కొంత గడువు ఇస్తామని అయినప్పటికీ స్పందించని పక్షంలో కఠినచర్యలు తీసుకుంటామని ఆమె స్పష్టం చేశారు.

ప్రైవేట్ ఆసుపత్రి నిర్వహణకు దరఖాస్తు చేయాలంటే ముందుగా బిల్డింగ్ అనుమతి పత్రం, ఫ్లోర్ల వారీగా ప్లాన్ ఇవ్వాలని ఆమె వెల్లడించారు. షైన్ ఆసుపత్రి నిబంధనలకు విరుద్ధంగా నడుస్తోందని స్వరాజ్యలక్ష్మీ తెలిపారు. ఇప్పటికే ఆసుపత్రి గుర్తింపును రద్దు చేశామని ఆమె పేర్కొన్నారు. 

ఈ నెల 21వ తేదీ తెల్లవారుజామున షైన్ ఆసుపత్రిలో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. ఈ మంటలతో ఉమ్మడి నల్గొండ జిల్లాలోని దువ్వాడ గ్రామానికి చెందిన  దంపతుల నాలుగు మాసాల చిన్నారి మృతి చెందాడు.

Life Style:చిన్నారి మృతి.. షైన్ హాస్పిటల్ యజమాని సునీల్ అరెస్ట్

మరో ఆరుగురు చిన్నారుల పరిస్థితి విషమంగా ఉంది. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఐసీయూలో మంటలు వ్యాపించాయి. మంటలతో పాటు పొగలు కూడ దట్టంగా వ్యాపించాయి. ఈ పొగతో షైన్ ఆసుపత్రిలోని ఐసీయూలో చిన్నారులు ఊపిరాడక ఉక్కిరిబిక్కిరయ్యారు. అంతేకాదు కొందరు చిన్నారులకు మంటలు కూడ వ్యాపించాయి.

పొగ కారణంగా ఊపిరి ఆడక ఆరుగురు చిన్నారుల ఆరోగ్యం విషమంగా ఉంది.ఈ చిన్నారులను హైద్రాబాద్‌లోని పలు ప్రముఖ చిన్న పిల్లల ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నారు.

ఈ ఘటనపై తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖాధికారి ఈటల రాజేందర్ సీరియస్ అయ్యారు. 24 గంటల్లో నివేదిక అందించాలని  డైరెక్టర్ ఆఫ్ హెల్త్ ను ఆదేశించారు. ఈ ఆదేశాల మేరకు వైద్య ఆరోగ్యశాఖ అదనపు డైరెక్టర్ రవీంద్రనాయక్‌ మంగళవారం నాడు షైన్ ఆసుపత్రిలో తనిఖీలు నిర్వహించారు.