ఎల్బీనగర్ లోని షైన్ చిన్నపిల్లల ఆస్పత్రిలో అగ్నిప్రమాదం జరిగి ఓ చిన్నారి మృతి చెందిన సంగతి తెలిసిందే.  కాగా.... ఈ ఘటన నేపథ్యంలో మంగళవారం ఆ హాస్పిటల్ యాజమాని సునీల్ ని పోలీసులు అరెస్టు చేశారు.

పూర్తి వివరాల్లోకి వెళితే... సోమవారం తెల్లవారుజామున  ఎల్బీనగర్‌లోని షైన్ చిల్డ్రన్స్ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్‌ కారణంగా ఒక్కసారిగా ఐసీయూలో మంటలు చెలరేగాయి. అది గమనించిన సిబ్బంది అద్దాలు పగలగొట్టి మంటలార్పేందుకు ప్రయత్నించారు. అప్పటికే మంటలు బాగా వ్యాపించడంతో ప్రమాదంలో ఓ చిన్నారి మ‌ృతి చెందింది. కాగా, పలువురు చిన్నారులకు తీవ్రగాయాలయ్యాయి. వీరిలో ఐదుగురు చిన్నారుల పరిస్థితి విషమంగా ఉంది. గాయాలపాలైన వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Also Read షైన్ ఆసుపత్రిపై ఈటల సీరియస్: కమిటీ ఏర్పాటుకు ఆదేశం

ఘటన పై కేసు నమోదు చేసిన ఎల్బీనగర్ పోలీసులు.. ఆస్పత్రిని సీజ్ చేశారు. ఆస్పత్రి ఎండీ సునీల్ కుమార్ పై 304ఏ కింద కేసు నమోదు చేశారు. ఏడాదిగా ఫైర్ సేఫ్టీ ఎన్‌వోసీని రెన్యువల్ చేయించకుండా నిబంధనలు ఉల్లంఘిస్తోందని పోలీసులు గుర్తించారు. మరోవైపు బాధిత కుటుంబసభ్యులు ఆస్పత్రి ఎదుట ఆందోళన చేస్తున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో హాస్పిటల్ లో 40మందికిపైగా చిన్నారులు ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు.

ఇదిలా ఉండగా... షైన్ ఆస్పత్రికి జీహెచ్ఎంసీ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు నోటీసులు ఇచ్చారు. అగ్ని ప్రమాదంపై వివరాలు సేకరిస్తున్న అధికారులు.. పూర్తి వివరాలు తెలపాలంటూ హాస్పిటల్‌కు నోటీసులంటించారు. హైదరాబాద్ లో 1600 ఆస్పత్రులు, క్లినిక్ లు ఉన్నాయని అధికారులు అంచనా వేశారు. మరోవైపు ఆస్పత్రి నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలంటూ డీవైఎఫ్‌ఐ నేతలు ధర్నా చేపట్టారు.

కాగా... ఇంత ప్రమాదం జరిగి ఓ చిన్నారి ప్రాణాలు కోల్పోయినా.. హాస్పిటల్ యాజమాన్యం కొంచెం కూడా స్పందించకపోవడం గమనార్హం. ప్రమాదం జరగడం సర్వసాధారణం అన్నట్లు ప్రవర్తించడం విశేషం. కాగా... చిన్నారి మృతికి బాధ్యుడిని చేస్తూ... హాస్పిటల్ యజమాని సునీల్ ని పోలీసులు ఈ రోజు అదుపులోకి తీసుకున్నారు.