హైదరాబాద్: హైద్రాబాద్ ఎల్బీనర్ షైన్ ఆసుపత్రిలో మంగళవారం నాడు  వైద్య ఆరోగ్యశాఖ అదనపు డైరెక్టర్ రవీంద్రనాయక్‌ తనిఖీలు నిర్వహించారు. ఆసుపత్రిలో తనిఖీ చేసిన తర్వాత నివేదికను ప్రభుత్వానికి ఇవ్వనున్నట్టుగా రవీంద్రనాయక్ చెప్పారు.

Also Read:చిన్నారి మృతి.. షైన్ హాస్పిటల్ యజమాని సునీల్ అరెస్ట్

ఈ నెల 21వ తేదీ తెల్లవారుజామున షైన్ ఆసుపత్రిలో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. ఈ మంటలతో ఉమ్మడి నల్గొండ జిల్లాలోని దువ్వాడ గ్రామానికి చెందిన  దంపతుల నాలుగు మాసాల చిన్నారి మృతి చెందాడు.

మరో ఆరుగురు చిన్నారుల పరిస్థితి విషమంగా ఉంది. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఐసీయూలో మంటలు వ్యాపించాయి. మంటలతో పాటు పొగలు కూడ దట్టంగా వ్యాపించాయి. ఈ పొగతో షైన్ ఆసుపత్రిలోని ఐసీయూలో చిన్నారులు ఊపిరాడక ఉక్కిరిబిక్కిరయ్యారు. అంతేకాదు కొందరు చిన్నారులకు మంటలు కూడ వ్యాపించాయి.

Also Read:షైన్ ఆసుపత్రిపై ఈటల సీరియస్: కమిటీ ఏర్పాటుకు ఆదేశం

పొగ కారణంగా ఊపిరి ఆడక ఆరుగురు చిన్నారుల ఆరోగ్యం విషమంగా ఉంది.ఈ చిన్నారులను హైద్రాబాద్‌లోని పలు ప్రముఖ చిన్న పిల్లల ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నారు.

ఈ ఘటనపై తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖాధికారి ఈటల రాజేందర్ సీరియస్ అయ్యారు. 24 గంటల్లో నివేదిక అందించాలని  డైరెక్టర్ ఆఫ్ హెల్త్ ను ఆదేశించారు. ఈ ఆదేశాల మేరకు వైద్య ఆరోగ్యశాఖ అదనపు డైరెక్టర్ రవీంద్రనాయక్‌ మంగళవారం నాడు షైన్ ఆసుపత్రిలో తనిఖీలు నిర్వహించారు.

సోమవారం నాడు మధ్యాహ్నం ఆసుపత్రి యాజమాన్యానికి వైద్య,ఆరోగ్య శాఖాధికారులు నోటీసులు ఇచ్చారు. మంగళవారం నాడు ఆసుపత్రిని రవీంద్రనాయక్ తనిఖీ చేశారు. ఆసుపత్రిలో ఫైర్ సెఫ్టీతో పాటు ఇంకా ఏరకమైన జాగ్రత్తలు తీసుకోలేదనే విషయమై రవీంద్రనాయక్ ఆరా తీశారు.

వాస్తవానికి 150 చదరపు గజాల స్థలంలో గ్రౌండ్ ఫోర్ తో పాటు మొదటి అంతస్థుకు మాత్రమే నిర్మించుకొనేందుకు అనుమతి ఇవ్వాలి. కానీ, షైన్ ఆసుపత్రి మూడు అంతస్థులతో పాటు పెంట్ హౌస్ ను కూడ నిర్మించారు.

ఈ ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం చోటు చేసుకొని చిన్నారి మరణించడంతో నియమ నిబంధనలను ఉల్లంఘించి ఈ భవనాన్ని నిర్మించినట్టుగా జీహెచ్‌ఎంసీ అధికారులు చెబుతున్నారు.

జాతీయ రహదారి పక్కనే నిర్మించిన ఈ భవనం జీహెచ్‌ఎంసీ అధికారులకు ఇంతకాలం ఎందుకు కన్పించలేదని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు ఏడాదిగా షైన్ ఆసుపత్రిలో  ఫైర్ లైసెన్స్ ను  రెన్యూవల్ చేయలేదని  గుర్తించారు.

సోమవారం నాడు ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం వాటిల్లి చిన్నారి మృతి చెందడంతోనే ఆసుపత్రి యాజమాన్యం ఏ రకంగా నిబంధనలను ఉల్లంఘించిన విషయాలు బయటకు వచ్చాయి.అయితే ఇంతకాలం ప్రభుత్వ నిబంధనలు సక్రమంగా అమలు చేయాల్సిన అధికారులు ఏం చేశారని బాధఇతుల కుటుంబసభ్యులు ప్రశ్నిస్తున్నారు. 

అగ్ని ప్రమాదం చోటు చేసుకొన్న తర్వాత కూడ ఐసీయూలో చికిత్స పొందుతున్న చిన్నారులను ఏ ఆసుపత్రుల్లో చేర్పించారనే విషయమై కూడ స్పష్టమైన సమాచారం కూడ ఇవ్వలేదని  బాధితుల కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.

షైన్ ఆసుపత్రిలో చిన్నారి మృతి చెందిన ఘటన తర్వాత ఆసుపత్రిని సీజ్ చేశారు.అంతేకాదు ఆసుపత్రి యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు ఆసుపత్రి యాజమాన్యంపై కేసు నమోదు చేశారు.