తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం అధికార టీఆఎస్ పార్టీలోకి భారీగా వలసలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ప్రతిపక్ష కాంగ్రెస్, టిడిపి  పార్టీల నుండి ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా టీఆర్ఎస్ గూటికి చేరుకుంటున్నారు. ఈ క్రమంలోనే మరో ముగ్గురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లో చేరడానికి సిద్దమైనట్లు ప్రచారం జరుగుతోంది.  ఈ జాబితాలో సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జయప్రకాష్ రెడ్డి (జగ్గారెడ్డి) కూడా వున్నారు.  పార్టీ మారనున్నట్లు గత మూడు రోజులుగా విస్తృతంగా  జరుగుతున్న  ప్రచారంపై తాజాగా జగ్గారెడ్డి విచిత్రంగా స్పందించారు. 

 తాను పార్టీ మారనున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని ఖండించకుండా దాన్ని కాలమే నిర్ణయిస్తుందంటూ ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రతిసారి ఈ ప్రచారంపై స్పందించడం, వాటిని ఖండించడం చేస్తున్నానని....కానీ వాటికి ఎలాంటి విలువ లేకుండా పోతోందని అన్నారు. టీఆర్ఎస్ లోకి వెళతానో, లేదో కాలమే నిర్ణయిస్తుందని... అంతవరకు ఇలాంటి ప్రచారాలను నమ్మవద్దని జగ్గారెడ్డి సూచించారు. 

 తన పోరాటం టీఆర్ఎస్ పార్టీ, ప్రభుత్వంపై కాదని...గతంలో తమ జిల్లాకు అన్యాయం చేసిన మాజీ మంత్రి హరీష్ రావుపైనే అని వెల్లడించారు. ఆయన అనాలోచిత నిర్ణయాల వల్ల నష్టపోయిన సంగారెడ్డి ప్రజల పక్షాన తాను మాట్లాడుతున్నానని అన్నారు. ప్రస్తుతం వేసవి సందర్భంగా తీవ్ర నీటి ఎద్దడి ఏర్పడిందని...దీనికి హరీషే కారణమని జగ్గారెడ్డి విరుచుకుపడ్డారు. 

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఇంకా బలోపేతంగానే వుందని...ఎమ్మెల్యేలు ఎవ్వరు తమంతట తాముగా పార్టీ మారాలని అనుకోవడం లేదన్నారు. టీఆర్ఎస్ పార్టీ ప్రయత్నాలతోనే వారు పార్టీని వీడుతున్నట్లు తెలిపారు. ఈ వలసలను అడ్డుకోడానికి టిపిసిసి నాయకులు కూడా సమర్థవంతంగానే ప్రయత్నిస్తున్నారని...కానీ అడ్డుకోలేకపోతున్నారని అన్నారు. కాంగ్రెస్ ను నాయకులు వీడినా పరవాలేదని...క్యాడర్ అలాగే పార్టీలోనే వుంటోందని పేర్కొన్నారు. ఈ పార్టీని పూర్తిగా రాష్ట్రంలో లేకుండా చేయడం అసాధ్యమని జగ్గారెడ్డి తెలిపారు.

సంబంధిత వార్తలు

టీఆర్ఎస్‌లో సీఎల్పీ విలీనానికి రంగం సిద్దం: 13 మంది ఎమ్మెల్యేల సంతకాలు?

చివరికి మిగిలేది ఆ ముగ్గురే: కాంగ్రెస్ ఎమ్మెల్యేలు (వీడియో)

టీఆర్ఎస్ లోకి జంప్: గండ్ర భార్యకు కేసీఆర్ బంపర్ ఆఫర్

కాంగ్రెసుకు భారీ షాక్: టీఆర్ఎస్ లోకి మరో ముగ్గురు ఎమ్మెల్యేలు