హైదరాబాద్: స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు తెలంగాణ కాంగ్రెసుకు మరో భారీ షాక్ తగలనుంది. మరో ముగ్గురు శాసనసభ్యులు తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్)లో చేరేందుకు సిద్ధపడ్డారు. ఇప్పటికే పది మంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లో చేరారు. దీంతో మొత్తం 18 మంది కాంగ్రెసు ఎమ్మెల్యేల్లో 13 మంది టీఆర్ఎస్ లో చేరినట్లవుతుంది.

మరో ముగ్గురు ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లో చేరితే శాసనసభలో కాంగ్రెసు ప్రతిపక్ష హోదా రద్దు కానుంది. సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జయప్రకాష్ రెడ్డి, భద్రాచలం ఎమ్మెల్యే పోడెం వీరయ్య, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి టీఆర్ఎస్ లో చేరనున్నారు. ఈ చేరికకు ముహూర్తం కూడా ఖరారైనట్లు తెలుస్తోంది. 

ఈ నెల 24వ తేదీన ముగ్గురు శాసనసభ్యులు కూడా కారెక్కుతారని సమాచారం. ఇక కాంగ్రెసుల మిగిలేది ఐదుగురు ఎమ్మెల్యేలు మాత్రమే. ఉత్తమ్ కుమార్ రెడ్డి, మల్లు భట్టి విక్రమార్క, శ్రీధరబాబు, రోహిత్ రెడ్డి, సీతక్క కాంగ్రెసు పార్టీలో మిగిలిపోతారు. ఆ ముగ్గురు శాసనసభ్యులు టీఆర్ఎస్ లో చేరిన వెంటనే సిఎల్పీని టీఆర్ఎస్ఎల్పీలో విలీనం చేయాల్సిందిగా వారు కోరే అవకాశం ఉంది. 

శాసనసభ ఎన్నికల్లో టీఆర్ఎస్ 88 స్థానాలు గెలుచుకుంది. మరో ముగ్గురు ఎమ్మెల్యేలు చేరితే టీఆర్ఎస్ బలం 104కు పెరుగుతుంది. దీంతో శాసనసభలో ప్రతిపక్షాల పాత్ర నామమాత్రమవుతుంది.