హైదరాబాద్:  శాసనసభలో కాంగ్రెస్ పార్టీకి శాసనసభపక్ష హోదా దక్కకుండా టీఆర్ఎస్‌ నాయకత్వం వ్యూహత్మకంగా అడుగులు వేస్తోంది.  కాంగ్రెస్ పార్టీని వీడి టీఆర్ఎస్‌లో చేరుతామని  ప్రకటించిన  ఎమ్మెల్యేలు త్వరలోనే టీఆర్ఎస్‌లో తమ శాసనసభపక్షాన్ని విలీనం చేస్తామని  స్పీకర్‌కు లేఖనుయ ఇచ్చే అవకాశం ఉంది.

గత ఏడాది డిసెంబర్ 7వ తేదీన జరిగిన ఎన్నికల్లో  కాంగ్రెస్ పార్టీ 19 ఎమ్మెల్యేల స్థానాల్లో విజయం సాధించింది.  ఇప్పటికే 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీని వీడుతామని ప్రకటించారు. తాజాగా మరో ముగ్గురు ఎమ్మెల్యేలు కూడ టీఆర్‌ఎస్‌లో చేరేందుకు రంగం సిద్దం చేసుకొంటున్నట్టు సమాచారం.

ఈ ముగ్గురు కూడ టీఆర్ఎస్‌లో చేరేందుకు  రంగం సిద్దం చేసుకొంటే  అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడ దక్కని పరిస్థితి కూడ నెలకొంటుంది. టీఆర్ఎస్‌లో చేరేందుకు సిద్దంగా  ఉన్న 13 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ శాసనసభపక్షాన్ని వీలీనం చేస్తున్నట్టుగా స్పీకర్‌కు లేఖ ఇచ్చే  అవకాశం ఉందని తెలుస్తోంది.

ఇప్పటికే 13 మంది కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఈ లేఖపై సంతకాలు చేశారని తెలుస్తోంది. ఆదివారం నాడు నలుగురు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలోని టీఆర్ఎస్‌ శాసనసభపక్ష కార్యాలయంలో సమావేశమయ్యారు.

వీలైతే ఇవాళ కాకపోతే రెండు మూడు రోజుల్లో కాంగ్రెస్ పార్టీ శాసనసభపక్షాన్ని టీఆర్ఎస్‌లో విలీనం చేస్తున్నట్టుగా లేఖ ఇచ్చే అవకాశం ఉందని సమాచారం.