Asianet News TeluguAsianet News Telugu

ఆర్ఎంపీ డాక్టర్.. డబ్బులు సరిపోక.. విలాసాలకు అలవాటుపడి..!

రాత్రి సమయాల్లో వివిధ ప్రాంతాల నుంచి హైదరాబాద్‌కు ప్రయాణిస్తుంటాడు. ల్యాప్‌టాప్‌ బ్యాగ్‌లతో బస్‌లలో ప్రయాణించడాన్ని గమనిస్తుంటాడు.

RMP Doctor Turned Into Thief in Hyderabad
Author
Hyderabad, First Published Sep 22, 2021, 9:43 AM IST

అతను ఓ ఆర్ ఎంపీ వైద్యుడు. వైద్యం చేస్తూ వచ్చిన డబ్బులు అతనికి సరిపోలేదు. విలాసాలకు అలవాటు పడి... సంపాదన పెంచుకోవాలని అనుకున్నాడు. ఈ క్రమంలో.. సులభంగా డబ్బులు సంపాదించాలని అనుకున్నాడు.  ఈ క్రమంలో దొంగతనాలకు అలవాటు పడటం గమనార్హం. రాత్రివేళల్లో ల్యాప్ టాప్ తో బస్సులో ప్రయాణించేవారిని లక్ష్యంగా చేసుకొని దొంగతనాలు చేయడం మొదలుపెట్టాడు. అయితే.. తాజాగా.. వనస్థలీపురంలో అనుమానాస్పదంగా తిరుగతూ పోలీసులకు దొరికిపోయాడు. ఈ సంఘటన హైదరాబాద్ నగరంలో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

భద్రాచలం పట్టణంలోని జగదీష్‌ కాలనీకి చెందిన గుడికాడి నవీన్‌ కుమార్‌(41) ఖమ్మం జిల్లా పాల్వంచలోని లక్ష్మిదేవునిపల్లిలో ఆర్‌ఎంపీ డాక్టర్‌గా స్థిరపడ్డాడు. లగ్జరీ లైఫ్‌కు అలవాటు పడిన ఇతను డబ్బు కోసం చోరీలు చేస్తుంటాడు. రాత్రి సమయాల్లో వివిధ ప్రాంతాల నుంచి హైదరాబాద్‌కు ప్రయాణిస్తుంటాడు. ల్యాప్‌టాప్‌ బ్యాగ్‌లతో బస్‌లలో ప్రయాణించడాన్ని గమనిస్తుంటాడు.

వారితో పాటు తోటి ప్రయాణికుడిగా బస్‌ ఎక్కుతాడు. హైదరాబాద్‌లోని శివారు ప్రాంతాలకు బస్‌ చేరుకుంటుందనగా ల్యాప్‌టాప్‌ బ్యాగ్‌లను లాక్కొని రన్నింగ్‌ బస్‌ నుంచి సెకనులో దిగేసి పారిపోతాడు. లేదంటే దిల్‌సుఖ్‌నగర్, ఎల్బీనగర్, వనస్థలిపురం వంటి ప్రాంతాల్లోని బ్యాచ్‌లర్స్‌ రూమ్స్‌లలోకి చొరబడి ల్యాప్‌టాప్స్‌ను దొంగిలిస్తుంటాడు. 

చోరీలో భాగంగా గత నెల 8వ తేదీన ఫిర్యాదుదారుడు, అతని స్నేహితుడు ఇద్దరూ కలిసి నర్సరావుపేట నుంచి నిజాంపేట వెళ్లేందుకు హైదరాబాద్‌ బస్‌ ఎక్కారు. వాళ్లు పనిచేసే కంపెనీ ఇచ్చిన హెచ్‌పీ, డెల్‌ ల్యాప్‌టాప్‌లను తీసుకొని బస్‌లో కూర్చున్నారు. వాళ్ల మొబైల్‌ ఫోన్లను కూడా అదే బ్యాగ్‌లో పెట్టేసి పడుకున్నారు. ఇది గమనించిన నిందితుడు నవీన్‌ కుమార్‌ అదే బస్‌లో ఎక్కాడు.

రిజర్వేషన్‌ చేసుకుంటే వివరాలు తెలిసిపోతాయని.. టికెట్‌కు సరిపోయే డబ్బులు చెల్లించి వారి పక్కనే కూర్చున్నాడు. బస్‌ ఆటోనగర్‌కు సమీపిస్తున్న సమయంలో నిందితుడు ల్యాప్‌టాప్‌ బ్యాగ్‌లతో దిగి పారిపోయాడు. మరుసటి రోజు ఉదయం చూసుకునేసరికి ల్యాప్‌టాప్‌ బ్యాగ్‌లు కనిపించకపోయేసరికి బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అతని ఫిర్యాదు మేరకు తాజాగా నిందితుడిని పోలీసులు పట్టుకున్నారు. అతని వద్ద నుంచి  రూ.5 లక్షల విలువ చేసే 16 ల్యాప్‌టాప్‌లు, 5 సెల్‌ఫోన్లు, 2 పవర్‌ బ్యాంక్, ఒక వాచ్‌ స్వాధీనం చేసుకున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios