ఈ-కేవైసీ పూర్తిచేయని రేషన్ కార్డులను రద్దు చేసే అవకాశం ఉందని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది . జూన్ 30 చివరి తేదీగా అధికారులు వెల్లడించారు.

రాష్ట్రాల్లో రేషన్ కార్డులకు సంబంధించి ఈ-కేవైసీ ప్రక్రియ జోరుగా సాగుతోంది. కేంద్రం ఇటీవల రేషన్ కార్డుదారులకు కీలక హెచ్చరిక ఇచ్చింది. ఎవరైనా ఈ-కేవైసీని పూర్తి చేయకపోతే వారి కార్డు రద్దయ్యే అవకాశముందని స్పష్టం చేసింది. ఇందుకోసం జూన్ 30న తుదిగడువుగా నిర్ణయించింది.

మూడు నెలల రేషన్‌ను ముందుగానే…

ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం మూడు నెలల రేషన్‌ను ముందుగానే పంపిణీ చేస్తోంది. దీంతో ఆగస్టు వరకు రేషన్ కోసం షాపులకు వెళ్లాల్సిన అవసరం లేదు. కానీ ఈ సమయానికే కార్డు e-KYC పూర్తిచేయాలని సూచిస్తోంది. లేదంటే సెప్టెంబర్ నుంచి రేషన్ తీసుకోవడంలో ఇబ్బందులు తప్పవు.

ఈ చర్యల వెనుక ప్రధాన కారణం నకిలీ కార్డులు, చనిపోయిన లబ్ధిదారుల పేర్లను కొనసాగించడం వంటి మోసాలను అడ్డుకోవడమే. రేషన్ పంపిణీ విధానాన్ని పారదర్శకంగా మార్చేందుకు కేంద్రం ఆధార్ ఆధారిత ఈ-కేవైసీని తప్పనిసరి చేసింది.

సాంకేతిక కారణాలతో..

ఇది పూర్తిచేయడానికి మొదట మార్చి 31 వరకు గడువు ఇచ్చినా, సాంకేతిక కారణాలతో చాలా మంది చేయలేకపోయారు. అందుకే కేంద్రం ఈ గడువును జూన్ 30 వరకు పొడిగించింది.

ఈ-కేవైసీని రేషన్ షాపుల ద్వారా లేదా ఆన్లైన్‌లో చేయవచ్చు. షాపుకెళ్లి ఆధార్ కార్డు, రేషన్ కార్డు తీసుకెళ్లి బయోమెట్రిక్ ద్వారా పూర్తిచేయవచ్చు. ఆన్లైన్‌లో అయితే, MyKYC లేదా Aadhaar FaceRD యాప్‌లను ఉపయోగించి ఓటీపీతో ఆధార్ వివరాలు సరిచూసి, మొబైల్ కెమెరా ద్వారా ముఖం స్కాన్ చేయాల్సి ఉంటుంది.

కార్డు రద్దు కాకుండా ఉండాలంటే లబ్ధిదారులు తక్షణమే ఈ ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులు సూచిస్తున్నారు.