New ration cards registration: కొత్త రేష‌న్ కార్డుల‌పై బిగ్ అప్ డేట్ వ‌చ్చింది. ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం కొత్త రేష‌న్ కార్డుల జారీ, మార్పులు చేర్పులు చేసుకోవ‌డం కోసం న‌మోదు ప్ర‌క్రియ‌ను ప్రారంభించింది. జూన్‌లో స్మార్ట్ కార్డులు జారీకి సన్నాహాలు చేస్తోంది. అయితే, కొత్త రేష‌న్ కార్డుల‌కు ఎలా అప్లై చేసుకోవాలి?  మార్పుల కోసం ఎవ‌రిని సంప్ర‌దించాల‌నే వివ‌రాలు ఇప్పుడు తెలుసుకుందాం.   

New ration cards registration: రేష‌న్ కార్డుల‌కు సంబంధించి బిగ్ అప్ డేట్ వ‌చ్చింది. రాష్ట్ర ఆహార, పౌర సరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించిన వివరాల ప్రకారం, నూతన రైస్ కార్డుల జారీకి సంబంధించిన సేవలు మంగ‌ళ‌వారం ప్రారంభమయ్యాయి. బుధవారం నుండి రాష్ట్రవ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయాల్లో మొత్తం ఆరు రకాల సేవలు అందించ‌నున్నారు. 

రేష‌న్ కార్డుల‌కు సంబంధించి ప్ర‌భుత్వం అందిస్తున్న 6 సేవ‌ల్లో: 

1. కొత్త  రేష‌న్ కార్డు జారీ
2. రేష‌న్ కార్డుల విభజన
3. రేష‌న్ కార్డుల‌ చిరునామా మార్పు
4. రేష‌న్ కార్డులలో కుటుంబ సభ్యుల చేరిక
5. రేష‌న్ కార్డు నుంచి సభ్యుల తొలగింపు
6. రేష‌న్ కార్డుల స‌రెండ‌ర్‌

వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా కూడా ఈ సేవలు అందుబాటులోకి వస్తాయని మంత్రి నాదేండ్ల‌ తెలిపారు. జూన్ నెలలో క్యూఆర్ కోడ్‌తో కూడిన స్మార్ట్ రైస్ కార్డుల జారీకి సన్నాహాలు జరుగుతున్నాయని ఆయన వెల్లడించారు. కొత్త కార్డులపై కుటుంబ సభ్యుల వివరాలు, లింక్ చేసిన డాటాబేస్ సమాచారం ఉంటుందని తెలిపారు.

గత ఎన్నికల నేపథ్యంలో 2023 మార్చిలో భారత ఎన్నికల సంఘం కొత్త కార్డుల జారీని నిలిపివేసిందని, ఆపై సుప్రీంకోర్టు ఈ కేవైసీని తప్పనిసరిగా ప్రకటించినందున రైస్ కార్డుల జారీ ఆలస్యం అయిందన్నారు. ఇప్పటివరకు 94.4 శాతం ఈకేవైసీ ప్రక్రియ పూర్తయిన నేపథ్యంలో కార్డుల జారీ మళ్లీ ప్రారంభమవుతోందని చెప్పారు.

ప్రస్తుతం రాష్ట్రంలో మొత్తం 1,46,21,223 రేష‌న్ కార్డులు ఉన్నాయి. వాటి ద్వారా 4,24,59,028 మందికి లబ్ధి కలుగుతోంది. ఐదు సంవత్సరాల లోపు పిల్లలు, 80 ఏళ్లకు పైబడినవారికి  ఈ కేవైసీ  మినహాయింపు ఉండటంతో 6,45,765 మందికి  ఈ కేవైసీ అవసరం లేదు. ఇప్పటివరకు 3,94,08,070 మంది తమ రైస్ కార్డులలో మార్పులకు నమోదు చేసుకున్నారని మంత్రి వివరించారు.

రేషన్ ద్వారా దీపం-2 పథకం కింద ఇప్పటివరకు 1,50,19,303 గ్యాస్ సిలిండర్లను పంపిణీ చేశారని, రాయితీ మొత్తాన్ని కొన్ని గంటల్లోనే లబ్ధిదారుల ఖాతాలో జమ చేయడం జరుగుతుందని తెలిపారు.

జూన్ 12 నుండి రాష్ట్రంలోని 41,000 ప్రభుత్వ పాఠశాలలకు, 4,000 సంక్షేమ వసతి గృహాలకు ప్రతి నెల 25 కేజీల బస్తాల ద్వారా మంచి నాణ్యత గల బియ్యాన్ని పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. పౌర సరఫరాల శాఖ కమిషనర్ సౌరబ్ గౌర్ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.

కొత్త రేష‌న్ కార్డుల‌కు ఎలా అప్లై చేయాలి?

రాష్ట్ర ప్రభుత్వం కొత్త రైస్ కార్డుల జారీతో పాటు కార్డులలో మార్పులు, చేర్పులకు బుధ‌వారం నుంచి అప్లై చేసుకోవ‌డానికి అవకాశం కల్పించింది. ఇందుకోసం అభ్యర్థులు దగ్గరలోని గ్రామ లేదా వార్డు సచివాలయాన్ని సంప్రదించి, నిర్దిష్ట ప్రక్రియ అనుసరించి దరఖాస్తు చేసుకోవాలి. కొత్త రేష‌న్ కార్డుల‌తో పాటు మార్పుల కోసం కూడా ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. 

1. గ్రామ/వార్డు సచివాలయంలో  పౌర సరఫరాల శాఖ డెస్క్‌ను సంప్రదించండి.

2. అవసరమైన డాక్యుమెంట్లు సమర్పించండి. వాటిలో ఆధార్ కార్డు, నివాస ధృవీకరణ పత్రం,  విద్యుత్ బిల్లు లేదా బ్యాంక్ స్టేట్‌మెంట్,  కుటుంబ సభ్యుల ఆధార్ వివ‌రాలు, వయస్సు ధృవీకరణ పత్రాలు, 
ఇప్పటికే ఉన్న కార్డు (మార్పుల కోసం).

3. వాటిని చూపించిన త‌ర్వాత మీకే అందించిన అప్లికేషన్ ఫారమ్ పూరించండి. సంబంధిత ఫారమ్‌ను సచివాలయం వద్ద లేదా స్పంద‌న పోర్టల్‌లో పొందవచ్చు. పూర్తి వివరాలతో ఫారమ్‌ను పూరించాలి.

4. ఫింగర్ ప్రింట్ / బయోమెట్రిక్ నమోదు: రైస్ కార్డు కొత్తగా తీసుకునే వారికి, సభ్యులను చేర్చే వారికి బయోమెట్రిక్ అవసరం.

5. సమర్పించిన డాక్యుమెంట్ల పరిశీలన: అధికారులు దరఖాస్తును పరిశీలించి మీకు సంబంధిత వివ‌రాలు తెలియ‌జేస్తారు. 

6. వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా సేవలు: రైస్ కార్డు సేవల కోసం వాట్సాప్ ద్వారా అప్లై చేసుకునే అవకాశం కల్పించనుంది. దీనికి సంబంధిత నంబర్‌ను ప్రభుత్వం త్వరలో ప్రకటించనుంది. వారం త‌ర్వాత అందుబాటులోకి తీసుకువ‌చ్చే అవ‌కావ‌ముంది. 

7.స్మార్ట్ రైస్ కార్డు జారీ: జూన్ నెలలో క్యూఆర్ కోడ్‌తో కూడిన స్మార్ట్ కార్డులు జారీ చేయ‌నున్నారు. వాటిలో కుటుంబ సభ్యుల సమాచారం మొత్తం ఉంటుంది.