Asianet News TeluguAsianet News Telugu

ఉప్పల్ జంట హత్యలు : పున్నమి భయం, అనారోగ్యం.. ఎస్సై కావాలనుకున్నవాడిని హంతకుడిని చేసింది..

ఉప్పల్ జంట హత్యల కేసులో పోలీసులు ఐదుగురిని అరెస్ట్ చేశారు. మరో ముగ్గురిని ప్రశ్నిస్తున్నారు. ఎస్సై కావడం కోసం డబ్బులు ఇచ్చి.. ఆ తరువాత తన మీద పూజారి క్షుద్రపూజలు చేస్తున్నాడని నమ్మడమే ఈ హత్యలకు దారితీసిందని తెలిపారు. 

Police solved Uppal twin murders case, five arrested in hyderabad
Author
First Published Oct 19, 2022, 6:53 AM IST

హైదరాబాద్ : ఉప్పల్ జంటహత్యల కేసు మిస్టరీ వీడింది. ఎస్సై ఉద్యోగం కోసం చేసిన పూజలు ఫలించకపోవడం, వ్యాపారంలో నష్టాలు, ప్రతి పౌర్ణమి రోజున చెడు జరగడం, అనారోగ్యం… వీటన్నింటికీ నరసింహమూర్తి చేసిన పూజలే కారణమని భావించిన ఓ వ్యక్తి ఆయనను హత్య చేశాడు. అడ్డొచ్చిన ఆయన కుమారుడు శ్రీనివాస్ ను కూడా మట్టుపెట్టాడు. జంటహత్యల కేసులో రాచకొండ పోలీసులు ఐదుగురిని అరెస్టు చేశారు.  ముగ్గురిని విచారిస్తున్నారు. నిందితుల నుంచి కత్తి, కొడవలి, ద్విచక్ర వాహనం, నాలుగు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. మల్కాజ్గిరి, ఉప్పల్ పోలీసు అధికారులతో  కలిసి రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్ మంగళవారం కేసు వివరాలు వెల్లడించారు.

పూజల పై నమ్మకం..
ఉప్పల్ లో నివాసముంటున్న వినయ్ మేనమామతో కలిసి తరచూ పూజారి నరసింహమూర్తి ఇంటికి వెళ్ళేవాడు. ఆయన పూజలపై విపరీతంగా నమ్మకం పెంచుకున్నాడు. ఈ నేపథ్యంలో 2016లో వినయ్ ఎస్ ఐ పరీక్షకు హాజరయ్యాడు. ఉద్యోగం కోసం పూజారికి రూ. ఆరు లక్షలు చెల్లించి పూజలు చేయించాడు. మరోవైపు అదే ఉద్యోగం కోసం కిస్మత్ పురాకు చెందిన ఇద్దరికి రూ.12.5లక్షలు ఇచ్చాడు. ఎన్నాళ్లు గడిచిన ఉద్యోగం రాకపోవడంతో వినయ్ ఒత్తిడి పెంచగా మధ్యవర్తులు నగదు తిరిగి ఇచ్చేశారు. పూజలు చేసిన నరసింహను రూ. 6 లక్షలు అడిగినా ఇవ్వలేదు. తన పూజల వల్లే మధ్యవర్తులు డబ్బులు తిరిగి ఇచ్చారంటూ అదనంగా రూ.40వేలు తీసుకున్నాడు.

ఒక మిత్రుడు వ్యాపారంలో పెట్టిన రూ.13.5 లక్షలు పెట్టుబడి తిరిగి రావట్లేదని జీవితంలో స్థిరపడే లేకపోతున్నానని వినయ్  నరసింహను సంప్రదించగా పూజలు చేసి డబ్బు తీసుకున్నాడు.  గ్రహాలు అనువుగా లేవని విదేశాలకు వెళ్తే ప్రయోజనం ఉంటుంది అంటూ మరోసారి డబ్బు తీసుకున్నాడు. వినయ్ ఉన్నత విద్య కోసం ఆస్ట్రేలియా వెళ్లినా కరోనా నేపథ్యంలో 2020 సెప్టెంబర్లో భారత్ తిరిగి వచ్చేశాడు.

ఉప్పల్ జంట హత్యల వెనక క్షుద్రపూజలు.. కేసులో క్లూస్ ఇచ్చిన పసుపు-కుంకుమ.. వెలుగులోకి షాకింగ్ విషయాలు..

2021 సెప్టెంబర్ నుంచి ఆర్థిక ఇబ్బందులకు తోడు అనారోగ్యానికి  గురవుతున్నట్లు వినయ్ భావించాడు. ముఖ్యంగా ప్రతి పౌర్ణమి రోజు ఏదో చెడు జరుగుతుందని నమ్మడు. ఈ నేపథ్యంలో కొందరు పురోహితులను కలవగా.. క్షుద్ర పూజలు జరుగుతున్నాయని చెప్పారు. రూ. 6లక్షలు ఇవ్వాల్సి వస్తుందని నరసింహ తనపై క్షుద్రపూజలు చేస్తున్నట్లు నమ్మిన వినయ్ అతడిని హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు. చంపాపేటకు చెందిన స్నేహితుడు బాలకృష్ణ (33), మేడిపల్లి లాల్ జగదీష్ గౌడ్ (36)లను సంప్రదించాడు. జగదీష్  తన స్నేహితులు రామ్(56), శ్యాంసుందర్ లను వినయ్ కి పరిచయం చేశాడు.

పక్కా ప్రణాళిక ప్రకారం…
పూజారి నరసింహ కదలికలపై నిఘా ఉంచేందుకు ఉప్పల్ లోని ఆయన నివాసం ఎదురుగా ఉండే హాస్టల్లో రూ. 4,800 చెల్లించి ఈ నెల 6న రామ్ అనే వ్యక్తిని ఉంచారు. అయితే, హత్యా ప్రణాళిక కోసం తనను  హాస్టల్ లో ఉంచారని తెలిసి రామ్ అక్కడి నుంచి పారిపోయాడు. తర్వాత శ్యామ్ ను రంగంలోకి దించారు. ఈ నెల 14న ఉదయం పూజారి బయటకు వచ్చి కూర్చున్నాడు. పనిమనిషి గేటు తీసి లోపలికి రాగానే వినయ్, బాలకృష్ణలు కొడవలి, కత్తితో లోపలికి ప్రవేశించారు. వినయ్ పూజారిపై కొడవలితో వేటు వేశాడు. తండ్రి కేకలు విన్న కొడుకు శ్రీనివాస్ బయటికి రాగానే అతని ఛాతీపై బాలకృష్ణ కత్తితో పొడిచాడు.  

ఇద్దరు మరణించాక నిందితులు కడప జిల్లా ఒంటిమిట్టకు పారిపోయారు. అక్కడి నుంచి విశాఖ చేరుకున్నారు. నిందితుల సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుల పరారీలో జల్ పల్లి వాసి గడ్డి కార్తీక్ (22), ఎల్బీనగర్ వాసి సుధాకర్ రెడ్డి ( 32) సహకరించారు. హత్య చేసిన సమయంలో రక్తంతో తడిచిన వినయ్ దుస్తులను అతని తల్లి సావిత్రి (60) శుభ్రం చేశారు.

Follow Us:
Download App:
  • android
  • ios