ఉప్పల్ జంట హత్యల వెనక క్షుద్రపూజలు.. కేసులో క్లూస్ ఇచ్చిన పసుపు-కుంకుమ.. వెలుగులోకి షాకింగ్ విషయాలు..
ఉప్పల్ జంట హత్యల వెనక క్షుద్రపూజల కోణం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. నరసింహ శర్మ పూజల వల్లనే ఆరోగ్యం క్షీణించిందని నిందితులు పగబట్టి హత్య చేసినట్లు తెలుస్తోంది.
హైదరాబాద్ : సంచలనం సృష్టించిన ఉప్పల్ తండ్రి కొడుకుల హత్య కేసును రాచకొండ పోలీసులు చేధించారు. ఉప్పల్ గాంధీ బొమ్మ సమీపంలోని హనుమసాయినగర్ కు చెందిన నరసింహుల నరసింహ శర్మ (78), ఆయన కుమారుడు నరసింహ శ్రీనివాస్ (45)లు గత శుక్రవారం తెల్లవారుజామున హత్యకు గురైన సంగతి తెలిసిందే. స్థిరాస్తి తగాదాలే హత్యలకు కారణమని మొదట భావించిన పోలీసులు ఇప్పుడు క్షుద్రపూజల కోణంలో దొరికిన ఆధారాలతో కేసు ఓ కొలిక్కి తీసుకు వచ్చినట్లు తెలుస్తోంది.
ఘటనా స్థలానికి సమీపంలో దొరికిన బ్యాగులో పసుపు, కుంకుమ పొట్లాలు లభ్యం కావటమే అందుకు కారణంగా తేలింది. హత్య జరిగిన తర్వాత అతి పెద్ద సంఖ్యలో మహిళలు, యువకులు రావడంతో ఆ కోణంలో ర్యాప్తు చేసిన పోలీసులకు విస్తు గొలిపే విషయాలు తెలిశాయి. ప్రత్యక్షసాక్షి నరసింహ శర్మ ఇంటి పనిమనిషి, స్థానికులను విచారించగా.. నరసింహశర్మ క్షుద్ర పూజలు, వాస్తు పూజలు చేసేవారని తేలింది.
ఉప్పల్ లో దారుణం.. దుండగుల చేతిలో తండ్రీకొడుకు హతం.. (వీడియో)
ఈ వ్యవహారంలో నిందితులు ఆయనపై కక్ష కట్టారని పోలీసులు ప్రాథమిక విచారణలో గుర్తించారు.సెల్ ఫోన్ టవర్ లొకేషన్ ఆధారంగా హత్య తర్వాత దుండగులు విశాఖకు పారిపోయినట్లు గుర్తించి.. ప్రత్యేక బృందంతో వెళ్లిన పోలీసులు మామిడిపల్లికి చెందిన వినాయక్ రెడ్డి, అతని స్నేహితుడు సంతోష్ నగర్ కు చెందిన బాలకృష్ణారెడ్డిలను అరెస్ట్ చేసినట్లు విశ్వాసనీయ సమాచారం.
క్షుద్రపూజలతో చెడు జరుగుతుందని…
క్షుద్రపూజల నేపథ్యంలో హతుడు నరసింహశర్మతో వినాయక రెడ్డికి పరిచయం ఏర్పడిందని పోలీసుల దర్యాప్తులో తేలింది. పూజలతో ఆర్థికంగా, ఆరోగ్య నష్టం వాటిల్లిందని వినాయక రెడ్డి భావించి.. ఎలాగైనా పురోహితుడిని చంపేయాలని పగబట్టినట్లు సమాచారం. స్నేహితుడు బాలకృష్ణరెడ్డితో కలిసి హత్యకు పథకం రచించినట్లు తెలిసింది.
నరసింహశర్మ కదలికలను తెలుసుకునేందుకు ఆయన ఇంటి ఎదురుగా ఉన్న హాస్టల్ లో అద్దెకు దిగారు. వారం రోజుల పాటు రెక్కీ నిర్వహించి, శుక్రవారం ఉదయం బ్యాగులో కత్తులు పట్టుకుని నరసింహ శర్మ ఇంట్లోకి ప్రవేశించారు. ఆ తర్వాత అతని గొంతు కోసి దారుణంగా హత్య చేశారు. తండ్రిని హత్య చేసి తిరిగి వెళ్ళిపోతున్న నిందితులను అడ్డుకోవడానికి ప్రయత్నించిన శ్రీనివాస్పై విచక్షణారహితంగా దాడి చేశారు. శ్రీనివాస్ మృతదేహంపై 27 కత్తిపోట్లు ఉన్నట్లు పోస్టుమార్టం నివేదికలో వెల్లడైంది.
స్పష్టత లేని సీసీ టీవీ ఫుటేజ్..
మృతుడి ఇంట్లో సీసీటీవీ కెమెరా ఉందని, కానీ.. గత కొన్ని రోజులుగా కెమెరాలు పనిచేయడం లేదని ఓ పోలీసు ఉన్నతాధికారి తెలిపారు. కెమెరా పని చేయడం లేదన్న విషయం నరసింహశర్మ, ఆయన కుమారుడు శ్రీనివాస్ కు తెలియదని తెలిపారు. దర్యాప్తులో భాగంగా నిందితులు ఉన్న హాస్టల్, సమీప ప్రాంతంలో సుమారు 200-250 సీసీటీవీ ఫుటేజీలను పోలీసులు సేకరించారు. వటిలో నిందితుల ముఖాలు స్పష్టంగా రికార్డు కాలేదని దీంతో సెల్ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా కేసును చేదించినట్లు తెలిపారు.
పూర్తి వివరాలు రాబట్టేందుకు నిందితులను రహస్య ప్రాంతంలో ఉంచి, విచారణ చేస్తున్నట్లు తెలిసింది. పూర్తి వివరాలను 1,2 రోజులలో పోలీసు ఉన్నతాధికారులు అధికారికంగా వెల్లడించనున్నట్లు సమాచారం.