హైదరాబాద్: మారుతీ రావు ఎవరి వద్దకు హైదరాబాద్ వచ్చేవారో వెలుగులోకి వచ్చింది. తన న్యాయవాది వెంకటసుబ్బారెడ్డిని కలిసేందుకు ఆయన హైదరాబాదు వచ్చినట్లు అర్థమవుతోంది. మారుతీ రావు తరఫు న్యాయవాది వెంకటసుబ్బా రెడ్డి తెలుగు టీవీ చానెల్స్ తో సోమవారం మాట్లాడారు. కూతురు అమృతతో రాజీకి మారుతీ రావు వెంకట సుబ్బారెడ్డి ద్వారానే ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది.

గత ఏడేళ్లుగా తనకు మారుతీ రావుతో పరిజయం ఉందని వెంకట సుబ్బారెడ్డి చెప్పారు. గత శుక్రవారం తాను మిర్యాలగుడాలో మారుతీ రావును కలిసినట్లు చెప్పారు. అమృత రెండు కేసులు పెట్టడంతో మారుతీరావు మనస్తాపానికి గురైనట్లు ఆయన చెప్పారు. 

also Read: మారుతీరావు, శ్రవణ్ మధ్య ఆస్తుల గొడవలు: అమృత సంచలనం

ప్రణయ్ తో పెళ్లయిన తర్వాత అమృత ఇంటికి వస్తుందని మారుతీ రావు అనుకుంటూ వచ్చాడని ఆయన అన్నారు. కేసు విచారణకు ముందే అమృత మారుతుందని ఆయన భావించిటన్లు వెంకట సుబ్బారెడ్డి తెలిపారు. వేరే వివాహం చేసుకున్నా కూడా ఇంటికి వస్తుందని మారుతీ రావు అనుకున్నారని ఆయన చెప్పారు. 

మారుతీ రావు కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు లేవని ఆయన స్పష్టం చేశారు. ప్రణయ్ హత్యకు ముందే మారుతీ రావు కుటుంబ సభ్యులు ఆస్తులు పంచుకున్నట్లు ఆయన తెలిపారు. ప్రణయ్ హత్య కేసులో జీవిత ఖైదు పడుతుందని మారుతీ రావుకు ణుందే తెలుసునని ఆయన చెప్పారు. 

Also Read: మిర్యాలగూడ స్మశానవాటికలో ఉద్రిక్తత, నాన్నను చూడలేదు: అమృత

అమృత గురించే మారుతీ రావు మాట్లాడేవారని, రాజీకి తీవ్ర ప్రయత్నం చేశారని ఆయన అన్నారు. మారుతీ రావుకు కూతురంటే పిచ్చి ప్రేమ అని ఆయన చెప్పారు. మధ్యవర్తులను పంపితే కొత్త కేసులు పెట్టిందని మారుతీ రావు మనస్తాపానికి గురైనట్లు తెలిపారు. అమృతతో రాజీకి 20 సార్లు ప్రయత్నించాడని ఆయన చెప్పారు. చనిపోవడానికి ముందు రాత్రి 8.22 గంటలకు తనతో మాట్లాడినట్లు ఆయన తెలిపారు. అమృత తన వద్దకు రావడం లేదనే మనస్తాపంతోనే మారుతీ రావు మరణించారని ఆయన అన్నారు.  

ప్రణయ్ హత్య కేసు చార్జిషీట్ లోనే మారుతీరావు వీలునామాను జత చేసినట్లు ఆయన తరఫు న్యాయవాది వెంకట సుబ్బారెడ్డి చెప్పారు.