మారుతీరావుకు సంబంధించిన ఒక్క పైసా కూడా తనకు అవసరం లేదని, తన మీద అనుమానం ఉంటే చట్టపరంగా ముందుకు వెళ్లొచ్చునని శ్రవణ్ తేల్చి చెప్పారు. అమృతది మెచ్యూరిటీ లేని మైండ్‌ అని ఏది పడితే అది మాట్లాడుతుందని.. మారుతీరావు మరణవార్త తనకు శుభవార్త అందని ఆయన విమర్శించారు.

మిర్యాలగూడలో సోమవారం మీడియాతో మాట్లాడిన ఆయన తండ్రి చనిపోయేంత వరకు మానసికంగా క్షోభకు గురిచేసిన అమృత అప్పుడు బాబాయ్‌ మీద లేనిపోని ఆరోపణలు చేస్తోందని శ్రవణ్ వ్యాఖ్యానించారు.

Also Read:ఆస్తిపై ఆశ లేదు, శ్రవణ్ కూతురు నెట్టేసింది: అమృత

మారుతీరావు భార్య తాళీ తీసిన రోజే తాను కూడా తాళీ తీస్తానని చెప్పిన అమృతకు ఇప్పుడు తల్లిదండ్రుల మీద ప్రేమ ఎందుకు వస్తుందని శ్రవణ్ ప్రశ్నించారు. ఆమెకు తండ్రి మీద ఎలాంటి ప్రేమ లేదని, ఆస్తి కోసం అమృత డ్రామాలు ఆడుతోందని శ్రవణ్ ఆరోపించాడు.

ఆత్మహత్య చేసుకునేటప్పుడు కూడా అమృతను తల్లి దగ్గరకు వెళ్లమన్నాడంటే అంతటి ప్రేమించే తండ్రిని మిస్ చేసుకున్న అమృత దురదృష్టవంతురాలని ఆయన చెప్పారు.  తనను, తన భార్యను, వదిన గిరిజనను తప్పించి ఎవర్ని నమ్మడని శ్రవణ్ అన్నారు.

చిన్నప్పటి నుంచి తానంటే అమృతకు కోపమని ఎందుకంటే ఆమెను గట్టిగా మందలించడం ఇష్టం లేని మారుతీరావు ఎప్పుడు తన పేరు చెప్పి ఆ పని వద్దని చెప్పేవాడన్నాడు. ఆ విధంగా తాను ఆమె దృష్టిలో విలన్‌గా మారానని గటుర్తుచేశాడు.

తమ కుటుంబానికి ఎలాంటి ఆర్ధిక ఇబ్బందులు లేవని, తనకు తెలియకుండా అన్నయ్య ఒక్క రూపాయి కూడా బయటి నుంచి అప్పు తీసుకురాలేదన్నారు. ఒకవేళ తనకు తెలియకుండా అన్నయ్య అప్పు చేసి వుంటే అలాంటి వారు తన దగ్గరకు వస్తే వాళ్లకు 100 శాతం వడ్డీతో సహా చెల్లిస్తానని శ్రవణ్ స్పష్టం చేశారు.

తమకు ఎలాంటి వ్యసనాలు లేవని, వ్యాపారం.. కుటుంబం తప్పించి మరో లోకం తనకు తెలియదన్నారు. అమృత లాంటి క్యారెక్టర్లను పెంచి పోషించొద్దంటూ ఆయన మీడియాకు విజ్ఞప్తి చేశారు.

ఒక కుటుంబంలో ఓ అమ్మాయిని తల్లిదండ్రుల నుంచి వేరు చేసే వ్యక్తిత్తం తనది కాదన్నారు. అలా చేస్తే తనను భగవంతుడు వదిలిపెట్టడని శ్రవణ్ స్పష్టం చేశాడు. ఆమెతో కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదని, తనకు ఆ అవసరం కూడా లేదన్నారు. తన అన్నయ్యను కొట్టడం కాదు కదా.. పల్లెత్తు మాట కూడా అనలేదన్నారు.

Aslo Read:అమ్మ నా దగ్గరికి వస్తే చూసుకొంటా, శ్రవణ్‌తోనే భయం: అమృత

అన్నయ్య తన బిడ్డను సక్రమంగా పెంచకపోవడం వల్ల, ఆమె కేసు పెట్టడం వల్ల తాను 7 నెలలకు పైగా జైల్లో ఉన్నానని శ్రవణ్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రణయ్ హత్య కేసుకు సంబంధించి తాను ఇంకా ఎన్ని రోజులు కోర్టుల చుట్టూ తిరగాలోనని, తన పిల్లలు కూడా పెద్దవాళ్లు అయ్యారని ఇక నీతో నాకొద్దని వ్యాపారపరంగా వేరుపడదామని మాత్రమే తాను మారుతీరావుతో చెప్పానని శ్రవణ్ స్పష్టం చేశారు.

తనకు సంబంధంలేని కేసులో ఇరుక్కోవడం వల్ల  రేపు పిల్లల పెళ్లి విషయంలో లేనిపోని ఇబ్బందులు పడాల్సి వస్తుందేమోననే పెద్ద మనుషుల ద్వారానే అన్నయ్యతో మాట్లాడించానని శ్రవణ్ చెప్పారు. గతేడాది మే 15 నుంచి నేటి వరకు మారుతీరావుతో తాను మాట్లాడలేదని ఆయన వెల్లడించారు.