బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావు శనివారం భేటీ అయ్యారు. కేటీఆర్ స్వయంగా వెళ్లి హరీష్ రావును కలిశారు. వీరిద్దరు దాదాపు 2 గంటల పాటు చర్చించారన్న వార్త హాట్ టాపిక్‌గా మారింది. ఇంతకీ వీళ్ల మధ్య ఎలాంటి అంశాలు చర్చకు వచ్చాయి.
బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇటీవల మాజీ మంత్రి హరీశ్ రావును ఆయన నివాసంలో కలిసి మాట్లాడారు. హరీశ్ రావు తండ్రి ఆరోగ్య సమస్యల నేపథ్యంలో ఆయనను పరామర్శించేందుకు వెళ్లిన కేటీఆర్, అనంతరం రెండు గంటల పాటు రాజకీయ పరిణామాలపై విశేషంగా చర్చించినట్లు సమాచారం.
ఇటీవల జరిగిన కొన్ని అంశాలు ఈ భేటీకి ప్రాధాన్యతను తీసుకొచ్చాయి. హరీశ్ రావుపై సోషల్ మీడియాలో జరుగుతున్న పుకార్ల నేపథ్యంలో వీరి భేటీ చర్చనీయాంశంగా మారింది. హరీశ్ రావుకు కేటీఆర్, కవితలకు మధ్య గ్యాప్ పెరుగుతోందంటూ సోషల్ మీడియాలో చర్చ జరిగిన విషయం తెలిసిందే.
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో హరీష్ రావు ఈ వార్తలను పూర్తిగా ఖండించారు. కేసీఆర్ చూపిన దారిలోనే తాను ముందుకెళ్తానని స్పష్టం చేశారు. పార్టీ వ్యవస్థాపకుడు, మాజీ సీఎం కేసీఆర్ నాయకత్వమే తుది మాట అని, ఆయన నిర్ణయాలను తాను ఎల్లప్పుడూ గౌరవిస్తానని హరీష్ చెప్పారు.
అంతేకాకుండా కేటీఆర్‌కు నాయకత్వ బాధ్యతలు అప్పగిస్తే, తాను పూర్తిగా సహకరిస్తానని హరీష్ రావు స్పష్టం చేశారు. తాజాగా హరీష్, కేటీఆర్‌ల భేటీతో పార్టీలో అసమ్మతి లేదని చెప్పే ప్రయత్నం చేసినట్లు పలువురు అభిప్రాయపడుతున్నారు.
