Asianet News TeluguAsianet News Telugu

కోదండరాం జన సమితికి బిసి దెబ్బ (వీడియో)

కొత్త పార్టీకి కొత్త సవాళ్లు.. మరి కోదండ దారెటో ?

Kodandaram in trouble with his organisational appointments

తెలంగాణలో జన సమితి పార్టీ పురుడు పోసుకుని ఇప్పుడిప్పుడే అడుగులు వేస్తున్నది. పార్టీ అధ్యక్షుడిగా రిటైర్డ్ ప్రొఫెసర్, మాజీ తెలంగాణ జెఎసి ఛైర్మన్ కోదండరాం నియమితులయ్యారు. ఇంకా పార్టీ నిర్మాణం పూర్తి కాలేదు. బుధవారం పలు జిల్లాలకు ఇన్ఛార్జిలను పార్టీ అధినేత కోదండరాం నియమించారు. అది కూడా కొద్ది జిల్లాలకు మాత్రమే. కానీ ఇప్పటికే తెలంగాణ జన సమితిపై కుల ముద్ర పడుతున్నది. అన్ని వైపులా తెలంగాణ జన సమితి మీద దృష్టి కేంద్రీకరిస్తున్న పరిస్థితి ఉంది. ఈ తరుణంలో జన సమితికి సరికొత్త సవాళ్లు ఎదురయ్యే అవకాశాలున్నట్లు చర్చ జరుగుతోంది. ఆ వివరాలేంటో చదవండి. వీడియో కూడా ఉంది చూడండి.

తెలంగాణ ఇంటి పార్టీ అధినేత డాక్టర్ చెరుకు సుధాకర్ గత వారం రోజుల కిందట జన సమితి పార్టీపైనా, జన సమితి అధ్యక్షులు కోదండరాం పైనా తీవ్రమైన స్థాయిలో విరుచుకుపడ్డారు. తెలంగాణ జన సమితి పేరుతో పార్టీ పెట్టిన కోదండరాం ఎందుకు తమను కలుపుకుపోవడంలేదని ప్రశ్నించారు. మంచిర్యాల సమీపంలో పిల్ల జమిందారు కుటుంబంలో జన్మించారని తెలిపారు. కోదండరాం పైకి పూలే, అంబేద్కర్ లాంటి మహనీయుల పేర్లు చెబుతన్నా.. ఆయన మాత్రం ఒక రెడ్డి కులానికే ప్రతినిధి అన్నట్లు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఇంకా చాలా తీవ్రమైన కామెంట్స్ చేశారు డాక్టర్ చెరుకు. ఆయనేమన్నారో కింద వీడియోలో చూడండి.

"

ఇక మరో విషయానికి వస్తే.. సామాజిక తెలంగాణ పేరుతో, దొరల తెలంగాణకు వ్యతిరేకంగా, కుటుంబ పాలన బద్ధలు కొడదామన్న టార్గెట్ తో తెలంగాణ జన సమితి ఆవిర్భవించింది. ఆ దిశగా ముందుకు సాగుతున్నది. అయితే సామాజిక మార్పు కోసం ఇప్పటి వరకు పెద్దగా కసరత్తు చేసిన పరిస్థితి అయితే కనిపించడం లేదు. ఇక తెలంగాణ జన సమితి అధినేత వెలువరించిన తొలి ప్రకటన వివాదాల సుడిగుండంలో చిక్కుకుపోయింది. తొలి దశలో పలు జిల్లాలకు తెలంగాణ జన సమితి కన్వీనర్లను కోదండరాం నియమించారు. అందులో అగ్రవర్ణాలకు పెద్ద పీఠ వేశారన్న విమర్శలు అప్పుడే మొదలయ్యాయి.తొలి దశలో 12 మందిని నియమించారు. అందులో సగం మంది రెడ్డి సామాజికవర్గం వారేనని విమర్శకులు గొంతు విప్పుతున్నారు.నియమించిన వారిలో సగం మంది రెడ్డి నేతలే ఉన్నారని గుర్తు చేస్తున్నారు. కోదండరాం సామాజికవర్గానికి చెందిన వారి వివరాలు కింద ఉన్నాయి.

1 గాదె ఇన్నయ్య (ఇన్నారెడ్డి)

2 ప్రొఫెసర్ రమేష్ రెడ్డి

3 విద్యాధర్ రెడ్డి

4 ధర్మార్జున్ (ధర్మార్జున్ రెడ్డి)

5 ప్రభాకర్ రెడ్డి

6 శ్రీశైల్ రెడ్డి

లు ఉన్నారు. వీరితోపాటు మిగిలిన సగం మంది బిసిలు, మిగతా కులాల వారు ఉన్నారు. తెలంగాణలో అన్ని రాజకీయ పార్టీలో రెడ్డీ కులస్తులకే అగ్రతాంబూలం వేస్తున్న వాతావరణం ఉంది. ఏ పార్టీ అయినా సరే అక్కడ రిజర్వు సీటు కాకపోతే రెడ్డీలే ఎమ్మెల్యేలుగా ఉంటున్న పరిస్థితి ఉంది. జిల్లాకు ఒకటి అర బిసి కులాల వారు పోటీదారులుగా ఉన్నారు. ఈ పరిస్థితుల్లో సామాజిక తెలంగాణ పేరుతో వస్తున్న తెలంగాణ జన సమితి మరి కొత్త మార్పును తీసుకువస్తుందా అన్న ఆశ బిసి వర్గాల్లో ఉందని చెబుతున్నారు. కానీ ఇప్పుడున్న పరిస్థితి చూస్తే జన సమితి కన్వీనర్ల నియామకంలో సింహభాగం రెడ్డీల చేతులకే కోదండరాం అప్పగించడం బిసి వర్గాల్లో కొత్త చర్చను లేవనెత్తుతోంది.

 

చెరుకును ఎందుకు పట్టించుకోరు : ఎల్లన్న యాదవ్

జన సమితి పార్టీ నిజంగా సామాజిక తెలంగాణ కోణంలో పనిచేసే పరిస్థితి ఉంటే ఆయనతో కలిసి పనిచేసేందుకు ప్రతయ్నం చేస్తున్న డాక్టర్ చెరుకు సుధాకర్ ను ఎందుకు కలుపుకుపోవడంలేదని సమాజ్ వాదీ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, (అసిస్టెంట్ ప్రొఫెసర్) ఎల్లన్న యాదవ్ ప్రశ్నించారు. కోదండరాం సామాజిక కోణంలో చిత్తశుద్ధి ఉంటే చెరుకును కలుపుకుని పోవచ్చు కదా అని ప్రశ్నించారు. తెలంగాణ జెఎసిలో సైతం అందరూ రెడ్లకే కోదండరాం ప్రాధాన్యత కల్పించారని ఆరోపించారు. తెలంగాణలో వెలమలు రాజ్యాధికారంలో ఉన్నారు కాబట్టి వాళ్లను దింపి, రెడ్లకు రాజ్యాధికారం తేవడం కోసమే కోదండరాం ప్రయత్నం తప్ప ఇంకోటి కాదన్నారు. తెలంగాణ జనాభాలో 3.5 శాతం రెడ్లు ఉంటే 42 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ఉన్నారని అదే 52 శాతం బిసిలు ఉంటే కేవలం 19 మంది మాత్రమే బిసి ఎమ్మెల్యేలు చట్టసభలో ఉన్నారని తెలిపారు. ఈ పరిస్థితిని ఏరకంగా కోదండరాం మారుస్తారని ప్రశ్నించారు. ప్రకటించిన 12 మందిలో సగం పోస్టులను రెడ్డీలకే కట్టబెట్టడం ఎంతవరకు సమంజసమన్నారు. నిజంగానే కోదండరాం సామాజిక తెలంగాణ కోరుకుంటే రానున్న ఎన్నికల్లో 3లేదా 4 సీట్లు మాత్రమే ఆయన పార్టీ నుంచి రెడ్డీలకు సీట్లు కేటాయించాలన్నారు. తెలంగాణ ఉద్యమంలో బిసిలు, ఎస్సీలు, ఎస్టీలు త్యాగాలు చేస్తే, ఆ త్యాగాలను బుట్టలో వేసుకుని కేసిఆర్ అధికారంలోకి వచ్చారన్నారు. తెలంగాణ జన సమితి అనే పార్టీ కాంగ్రెస్ బి టీం లాంటిదే తప్ప మరొకటి కాదన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios