Asianet News TeluguAsianet News Telugu

ఇంట్లో పుట్టా, నా బర్త్ సర్టిఫికెట్ లేదు, నువ్వెవరంటే..: సీఏఏపై కేసీఆర్

సీఏఏపై తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ శాసనసభలో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తనకే బర్త్ సర్టిఫికెట్ లేదని, పేదలకూ దళితులకూ ఎక్కడి నుంచి ఉంటుందని ఆయన అడిగారు.

KCR vehemently opposes CAA in Telangana assembly
Author
Hyderabad, First Published Mar 7, 2020, 3:40 PM IST

హైదరాబాద్: పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ), ఎన్నార్సీలపై తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తనకు బర్త్ సర్టిఫికెట్ లేదని, మీరెవరని అడిగితే తాను ఏం సమాధానం చెప్పాలని ఆయన అన్నారు. తాను తన ఊళ్లో, తన ఇంట్లో పుట్టానని, ఆస్పత్రి బర్త్ సర్టిఫికెట్ లేదని ఆయన అన్నారు. నీది లేకపోతే నీ తండ్రిదో, తాతదో తేవాలని అడిగితే ఎక్కడి నుంచి తెస్తానని ఆయన అన్నారు. 

తనకే ఈ విధమైన పరిస్థితి ఉంటే దళితులు, పేదలు ఏ విధమైన పరిస్థితిలో ఉంటారో అర్థం చేసుకోవచ్చునని, తాను ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీకి ఇదే విషయం చెప్పానని ఆయన అన్నారు. తెలంగాణ శాసనసభలో ఆయన గవర్నర్ ప్రసంగంపై జరిగిన ధన్యవాద తీర్మానానికి శనివారం సమాధానం ఇచ్చారు. సీఏఏపై అసెంబ్లీలో రోజంతా చర్చిద్దామని చెప్పారు. తప్పుని తప్పని తాము ధైర్యంగా చెప్తామని కేసీఆర్ అన్నారు. 

Also Read: కేసీఆర్ ప్రసంగానికి ఆటంకం.. కాంగ్రెస్ సభ్యుల సస్పెన్షన్

సీఏఏపై దేశవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోందని, చాలా చెడుగా దానిపై చర్చ జరుగుతోందని ఆయన అన్నారు. సిఏఏను వ్యతిరేకిస్తూ వందకు వందశాతం అసెంబ్లీలో తీర్మానం పెడుతామని ఆయన స్పష్టం చేశారు. తమకు కొన్ని సిద్ధాంతాలున్నాయని చెప్పారు. 

అప్పులు తెచ్చి కరెంట్ ఇస్తున్నట్లు కాంగ్రెసు నాయకులు ఆరోపిస్తున్నారని, ఆరేళ్లలో ఒక్కసారి మాత్రమే కరెంట్ చార్జీలు పెంచామని ఆయన అన్నారు. 24 గంటల విద్యుత్తు సరఫరా కొనసాగుతుందని భరోసా ఇచ్చారు. సభను తప్పుదోవ పట్టించేవారు సభలో ఉండడం అవసరమా అని ఆయన కాంగ్రెసు సభ్యుల సస్పెన్షన్ ను ఉద్దేశించి అన్నారు. తెలంగాణ ఉద్యమాన్ని నీరు గార్చడానికి కాంగ్రెసు ప్రయత్నించిందని ఆయన విమర్శించారు. ఎన్నికల్లో ఓడించినా కాంగ్రెసువాళ్లకు బుద్ధి రాలేదని ఆయన వ్యాఖ్యానించారు. కాంగ్రెసు, బిజెపిలకు ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టారని అన్నారు. 

Also Read: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు: సీఏఏ పై తేల్చేసిన కేసీఆర్!

పాతబస్తీకి మెట్రో రైలు కావాలని మజ్లీస్ నేతలు అడుగుతున్నారని ఆయన చెప్పారు. త్వరలోనే మెట్రో పనులు పూర్తవుతాయని ఆయన చెప్పారు. రాష్ట్రంలో ఏడు లక్షల ఇళ్లు నిర్మిస్తే సరిపోతుందని సమగ్ర సర్వేలో తేలిందని ఆయన చెప్పారు. సాధ్యమైనంత వరకు పేదలకు డబుల్ బెడ్రూం ఇళ్లు కట్టిస్తున్నట్లు తెలిపారు. పేదలకు ఇళ్లు కట్టిస్తామని కాంగ్రెసువాళ్లు చెప్పారు గానీ కట్టలేదని ఆయన అన్నారు. 

మిషన్ భగీరథను ఇతర రాష్ట్రాలు అధ్యయనం చేస్తున్నాయని ఆయన చెప్పారు. పోడు భూములకు రైతు బంధు వర్తించదని ఆయన చెప్పారు. పోడు భూముల సమస్యను పరిష్కరిస్తామని ఆయన గిరిజనులకు హామీ ఇచ్చారు. 

Follow Us:
Download App:
  • android
  • ios