హైదరాబాద్: కరీంనగర్ మాజీ ఎంపీ వినోద్‌కుమార్‌కు ప్లానింగ్ బోర్డు వైఎస్ ఛైర్మెన్ పదవి దక్కడంతో గత ఎన్నికల్లో ఓటమి పాలైన కీలక నేతలకు కూడ పదవులు దక్కుతాయా అనే చర్చ టీఆర్ఎస్ వర్గాల్లో సాగుతోంది.

ఈ ఏడాది ఏప్రిల్ మాసంలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో  కరీంనగర్ ఎంపీ స్థానం నుండి పోటీ చేసిన బోయినపల్లి వినోద్ కుమార్ ఓటమి పాలయ్యాడు. ఈ స్థానం నుండి బీజేపీ అభ్యర్ధి బండి సంజయ్ కుమార్  విజయం సాధించారు.

కేంద్రంలో ఫెడరల్ ఫ్రంట్ సహాయంతో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా  వినోద్‌కుమార్  కేంద్ర మంత్రి అవుతారని కేసీఆర్ ఎన్నికల ప్రచార సభలో ప్రకటించారు. కానీ, ఈ ఎన్నికల్లో వినోద్ కుమార్ ఓటమి పాలయ్యాడు.ఇటీవలనే వినోద్‌కుమార్ కు ప్లానింగ్ బోర్డు వైఎస్ ఛైర్మెన్ పదవిని కేసీఆర్ కట్టబెట్టారు.

తెలంగాణ ఉద్యమంలో  కేసీఆర్ తో మొదటి నుండి వినోద్ కుమార్ ఉన్నాడు. గత టర్మ్‌లో కూడ వనపర్తి నుండి పోటీచేసిన సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఓటమి పాలయ్యాడు. దీంతో ఆయనకు ప్లానింగ్ వైస్ ఛైర్మెన్ బోర్డు పదవిని కట్టబెట్టారు.ఈ దఫా ఎన్నికల్లో నిరంజన్ రెడ్డి విజయం సాధించడంతో ఆయనను మంత్రివర్గంలోకి తీసుకొన్నారు.

ఇక నిజామాబాద్ నుండి పోటీ చేసి ఓటమి పాలైన కేసీఆర్ కూతురు కవితకు  కూడ కీలక పదవిని కట్టబెట్టే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది. కేటీఆర్ ను మంత్రివర్గంలోకి తీసుకొంటే కవితకు టీఆర్ఎస్ వర్కింగ్  ప్రెసిడెంట్ పదవిని కట్టబెట్టే అవకాశం ఉందనే ప్రచారం కూడ లేకపోలేదు.

గత టర్మ్‌లో కేసీఆర్ మంత్రివర్గంలో రోడ్లు భవనాల శాఖ మంత్రిగా పనిచేసిన తుమ్మల నాగేశ్వరరావు ఈ ఎన్నికల్లో ఓటమి పాలయ్యాడు. గత టర్మ్‌లో స్పీకర్ గా వ్యవహరించిన మధుసూధనాచారి కూడ ఓడిపోయాడు.

గత టర్మ్ లో  కేసీఆర్ మంత్రివర్గంలో  పౌరసరఫరాల శాఖ మంత్రిగా వ్యవహరించిన జూపల్లి కృష్ణారావు ఈ దఫా ఓడిపోయాడు దీంతో ఈ దఫా ఎర్రబెల్లి దయాకర్ రావుకు కేబినెట్ లో సునాయాసంగా చోటు దక్కింది.కేసీఆర్ కేబినెట్ లో కేసీఆర్ , ఎర్రబెల్లి దయాకర్ రావులు మాత్రమే వెలమ సామాజిక వర్గానికి చెందినవారు.

తుమ్మల నాగేశ్వరరావు సేవలను ఎలా ఉపయోగించుకోవాలనే దానిపై కేసీఆర్ ఆలోచిస్తున్నట్టుగా టీఆర్ఎస్ వర్గాల్లో ప్రచారంలో ఉంది.మాజీ స్పీకర్ మధుసూధనాచారి  కేసీఆర్ వెంట మొదటి నుండి ఉన్నాడు. తుమ్మల నాగేశ్వరరావు 2014 ఎన్నికల తర్వాత టీఆర్ఎస్ లో చేరాడు. జూపల్లి కృష్ణారావు కూడ ఉమ్మడి రాష్ట్రంలో  మంత్రి  పదవికి రాజీనామా చేసిన తర్వాత కొంత కాలానికి టీఆర్ఎస్‌లో చేరారు.

వినోద్‌కుమార్ కు ప్లానింగ్ బోర్డు వైస్ ఛైర్మెన్ పదవిని కట్టబెట్టడంతో గత ఎన్నికల్లో ఓటమి పాలైన వారికి కూడ పదవులు వరించే అవకాశం ఉందనే ప్రచారం సాగుతోంది. ఖమ్మం జిల్లా  నుండి ఒక్కరికి మాత్రం మంత్రి పదవి దక్కనుంది. అయితే సండ్ర వెంకటవీరయ్య, పువ్వాడ అజయ్, హరిప్రియనాయక్, రేగా కాంతారావుల పేర్లు విన్పిస్తున్నాయి.

సంబంధిత వార్తలు

బంపర్ ఆఫర్: టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కవిత?

విస్తరణపై కేసీఆర్ దృష్టి: కేబినెట్‌లోకి కేటీఆర్, హరీష్ డౌటే?

కేసీఆర్ కేబినెట్: కేటీఆర్, హరీష్‌లలో ఎవరికి చోటు?
దసరా తర్వాత కేసీఆర్ కేబినెట్ విస్తరణ: హరీష్‌‌కు చోటు, కారణమదేనా

ఎమ్మెల్సీగా సుఖేందర్ రెడ్డి ఏకగ్రీవం: మంత్రి పదవికి దక్కేనా?