కేసీఆర్ కేబినెట్: కేటీఆర్, హరీష్‌లలో ఎవరికి చోటు?
దసరా తర్వాత కేసీఆర్ కేబినెట్ ను విస్తరించే అవకాశం ఉంది. ఈ కేబినెట్ లో ఎవరికీ చోటు దక్కుతోందనే విషయమై సర్వత్రా చర్చ సాగుతోంది.
హైదరాబాద్:దసరా తర్వాత కేసీఆర్ తన కేబినెట్ ను విస్తరించే అవకాశం ఉందని టీఆర్ఎస్ వర్గాల్లో ప్రచారం సాగుతోంది.అయితే మంత్రివర్గ విస్తరణలో కేటీఆర్, హరీష్‌లకు చోటు దక్కుతోంది. ఇద్దరిలో ఒక్కరికే చోటు దక్కే అవకాశం ఉందా అనే విషయమై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
కేసీఆర్ తన మంత్రివర్గంలోకి ఇంకా ఆరుగురిని తీసుకొనే అవకాశం ఉంది. అయితే ఆ ఆరుగురిలో ఎవరికి చోటు దక్కుతోందనే విషయమై పార్టీలో తీవ్ర చర్చ సాగుతోంది. గత కేబినెట్ లో కేటీఆర్, హరీష్ రావు, జోగు రామన్న, లక్ష్మారెడ్డి, కడియం శ్రీహరి, నాయిని నర్సింహ్మరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావులకు ఈ దఫా చోటు దక్కలేదు.
కేటీఆర్,హారీష్ రావు, జోగు రామన్న, లక్ష్మారెడ్డి లు ఈ దఫా కూడ విజయం సాధించారు. ఖమ్మం జిల్లా పాలేరు నుండి తుమ్మల నాగేశ్వర రావు పోటీ చేసి ఓటమి పాలయ్యాడు. గత కేబినెట్ లో చోటు దక్కించుకొన్న కడియం శ్రీహరి, నాయిని నర్సింహ్మరెడ్డిలు ఎమ్మెల్సీలుగా ఉన్నారు.
కాంగ్రెస్ పార్టీ నుండి టీఆర్ఎస్ లో చేరిన మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డికి కూడ కేబినెట్ లో చోటు దక్కే అవకాశం ఉందని ప్రచారం ఉంది. మరో వైపు గుత్తా సుఖేందర్ రెడ్డికి కూడ కేబినెట్ లో చోటు దక్కే అవకాశం ఉంది. ఎమ్మెల్సీగా సుఖేందర్ రెడ్డి ఏకగ్రీవంగా ఎణ్నికయ్యారు.
సుఖేందర్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డికి కేబినెట్ లో చోటు దక్కాలంటే ప్రస్తుతం రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఐదుగురు మంత్రుల్లో ఇద్దరిని తప్పించాల్సిన పరిస్థితి అనివార్యంగా కేసీఆర్ కు నెలకొంది.
గత కేబినెట్ లో వెలమ సామాజిక వర్గం నుండి కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, జూపల్లి కృష్ణారావులు ఉన్నారు.ఈ దఫా మాత్రం కేసీఆర్ తో పాటు ఎర్రబెల్లి దయాకర్ రావు మాత్రమే ఉన్నారు.
ఎన్నికల ఫలితాల తర్వాత కేటీఆర్ కు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని కేసీఆర్ కట్టబెట్టాడు. పార్టీ వ్యవహరాలను కేటీఆర్ చూస్తున్నారు. హరీష్ రావు మాత్రం ప్రస్తుతం మెదక్ జిల్లాకు పరిమితమయ్యాడు.
గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సుమారు 26 అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన కీలక నేతలను ఓడించడంలో హరీష్ రావు కీలకంగా వ్యవహరించారు. పార్లమెంట్ ఎన్నికల్లో మెదక్ ఎంపీ స్థానానికి మాత్రమే హరీష్ రావు పరిమితమయ్యారు. హరీష్ ను పక్కకు పెడుతున్నారనే ప్రచారం సాగింది.అయితే ఈ ప్రచారాన్ని హరీష్ ఖండించారు.
ఈ దఫా కేటీఆర్, హరీష్ లకు ఇద్దరికి కేబినెట్ లో చోటు కల్పిస్తారా.. ఒక్కరికే చోటు దక్కుతోందా అనే చర్చ కూడ లేకపోలేదు. కేటీఆర్ ఇప్పటికే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నారు. హరీష్ రావు మాత్రం మెదక్ జిల్లాకే పరిమితమయ్యారు. ఈ దఫా కేసీఆర్ కేబినెట్ లో హరీష్ రావుకు చోటు దక్కకపోతే తప్పుడు సంకేతాలు వెళ్లే అవకాశం లేకపోలేదనే ప్రచారం కూడ ఉంది.
మరో వైపు ఎస్టీ మహిళ, మున్నూరు కాపు, కమ్మ సామాజిక వర్గాలకు కూడ కేబినెట్ లో చోటు కల్పించాల్సి ఉంది. వీటన్నింటిని పరిగణనలోకి తీసుకొని కేబినెట్ కూర్పు ఉండే అవకాశం ఉందంటున్నారు.
సంబంధిత వార్తలు
దసరా తర్వాత కేసీఆర్ కేబినెట్ విస్తరణ: హరీష్‌కు చోటు, కారణమదేనా